పార్టీలకతీతంగా అభివృద్ధి
అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా రూరల్ మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
తాటిచెర్ల గ్రామంలో తాగు నీటికి ఇబ్బంది లేదని, సాగు నీటి సమస్య ఉందన్నారు. చెరువుకు తప్పకుండా నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గ్రామంలో ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే గేట్ ద్వారా రాకపోకలకు అంతరాయం కల్గుతోందని, ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వం రూ 12వేలు మంజూరు చేస్తోందన్నారు. ఆడవారు కాలకృత్యాల కోసం ఆరుబయటకెళ్లడం సరైంది కాదన్నారు. సెల్‌ఫోన్ కన్నా మరుగుదొడ్డే ముఖ్యమన్నారు.
అధైర్య పడాల్సిన పనిలేదు : రైతులు, డ్వాక్రా మహిళలు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రుణాల మాఫీ జరుగుతుందన్నారు. పింఛన్లు అందని వారికి ఈ నెల 25లోపు అందుతాయని భరోసా ఇచ్చారు. జెడ్పీచైర్మన్ చమన్ మాట్లాడుతూ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం ప్రభావతి అనే వికలాంగురాలికి మంత్రి పింఛ న్ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప, జెడ్పీటీసీ వేణుగోపాల్, టీడీపీ నేతలు చంటి, పరిటాల మహేంద్ర, తాటిచెర్ల సర్పంచ్ రామాంజినేయులు, ఎంపీడీఓ లక్ష్మినరసింహశర్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నర్సనాయినకుంటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలి:
మంత్రిని కోరిన సీపీఎం : 2013 ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, ఈ ఏడాది కరువు మండలంగా రూరల్ ప్రాంతాన్ని ప్రకటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ను మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి టీ రామాంజినేయులు మంత్రి పరిటాల సునీతను కోరారు.
రూ 8 లక్షలతో గ్రామానికి బోరు:
మన్నీల గ్రామంలో రూ 8 లక్షలతో బోరు వేయించామని ఎంపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప అన్నారు. శుక్రవారం మన్నీలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీటీసీ వేణుగోపాల్, మన్నీల సర్పంచ్ ఆదిశేషయ్య, టీడీపీ నేత చంటి, తహశీల్దార్ షేక్‌మహబూబ్ బాష, టెక్నికల్ ఇంజనీర్ లక్ష్మిదేవి, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.