Minister Pydikondala Manikyalarao
-
ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం
ఐ.పోలవరం: ఆలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకరిస్తానని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. కేశనకుర్రులో జరుగుతున్న రుద్రయాగంలో ఆయన ఆదివారం పాల్గొని పూజలు చేశారు. వ్యాస భగవానునిచే ప్రతిష్టించబడిన ఉమా సమేత వ్యాసేశ్వరస్వామి ఆలయంలో 11 రోజుల పాటు నిర్వహించే శ్రీరుద్ర మహాయాగం ఆదివారం పదో రోజు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావుకు, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు ఆలయ మర్యాదలతో గ్రామస్తులు, అధికారులు స్వాగతం పలికి యాగ విశిష్టతను తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మహిమగల ఈ పుణ్యక్షేత్రంలో ఇటు వంటి యాగాలు జరగడం ఆనందం అని, శివారు ప్రాంతం అయినా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం హర్హణీయమన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరో పుణ్యక్షేత్రం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పలు అభివృద్ధి పనులకు అధికారులచే ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రుద్రయాగాన్ని భీమవరానికి చెందిన యీవని వెంకటరామచంద్ర సోమయాజి ఘనపాఠి, మచిలీపట్నానికి చెందిన యాగబ్రహ్మ రాళ్లపల్లి వేంకటేశ్వర శాస్త్రిల సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం ఏకాదశ రుద్ర కలశావాహనము, మహాన్యాస పూర్వక ఏకాదశ శ్రీరుద్ర కలశాభిమంత్రణము, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్ర క్రమార్చన, అధ్యాత్మిక ప్రవచనాలు జరిగాయి. ఈ పూజల్లో ఎమ్మెల్యే బుచ్చిబాబు పాల్గొని స్వామి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ మంత్రి మాణిక్యాలరావును, ఎమ్మెల్యే బుచ్చిబాబును సత్కరించారు. ఈ సందర్భంగా ఈ పూజలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. వీరి వెంట వి.సూర్యనారాయణ రాజు, జంపన బాబు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి బంధువులా... మజాకా!
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మంత్రి బంధువుల ఆగ్రహంతో ఒక సూపరింటెండెంట్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయన పేరు చెప్పి నిత్యం అనేకమంది అతిథి మర్యాదలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన వారు మంత్రి బంధువులు అవునో కాదో తెలుసుకోవడం ఆలయ అధికారులకు, సిబ్బందికి ప్రహసనంగా మారింది. మంత్రివర్యుల సిఫార్సు లేఖ లేకుండా వచ్చి డిమాండ్ చేసి మరీ శ్రీవారి దర్శనం చేసుకునే వారి సంఖ్య చాలానే ఉంటోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి చినవెంకన్న దర్శనార్థం కొందరు మంత్రి బంధువులమని స్వామివారి దర్శనానికి వెళ్లాలని ఆలయ సూపరింటెండెంట్ రమణరాజును అడిగారు. అయితే వారు మంత్రి లెటర్ గాని, ప్రొటోకాల్ గానీ లేకుండా వచ్చారు. దీంతో రమణరాజు దర్శనానికి అనుమతించడం కుదరదని, దర్శనం టికెట్లు తప్పనిసరని వారికి సూచించారు. ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడమని సూపరింటెండెంట్‌కు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫోన్ తీసుకోమని, టికెట్లు తేవాలని రమణరాజు ఖచ్చితంగా చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు మంత్రి మాణిక్యాలరావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆలయ అధికారులు వెంటనే స్పందించి మంత్రి బంధువులమని వచ్చిన వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయానికి వచ్చినవారి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో సూపరింటెండెంట్ రమణరాజును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.