ఇక మీరే వాదించుకోవచ్చు
కేంద్ర మంత్రి పాశ్వాన్
వినియోగదారుల ఇంటి నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు
{పమాణాలు పాటించని తయారీదారులపై కఠిన చర్యలు
హైదరాబాద్: ఉత్పత్తుల్లో భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నిబంధనల ప్రకారం నాణ్యతను పాటించకుంటే ఇక నుంచి కఠిన చర్యలు అమలు చేయనున్నట్టు కేంద్ర పౌరసరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హెచ్చరించారు. కోర్టుల్లో తేల్చుకున్న తర్వాత జరిమానాలు విధించే పద్ధతి కాకుండా ఇక బీఐఎస్నే నేరుగా భారీ జరిమానాలు విధించనుందని, శిక్షా కాలాన్ని కూడా పెంచబోతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ విపణిలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా భారతీయ వస్తువుల నాణ్యతను కూడా మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీఐఎస్ కోసం మౌలాలిలో కొత్తగా నిర్మించిన అధునాతన భవనాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బీఐఎస్‌ను ఆధునికీకరిస్తున్నట్టు వెల్లడించారు. దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లులు ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, అది త్వరలో చట్టంగా రూపొందించనుందని తెలిపారు. దీంతోపాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని కూడా మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా తెచ్చామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించే ఉద్దేశంతో వినియోగదారుల కోర్టులను కూడా బలోపేతం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక అవి కమిషన్లుగా మారనున్నాయని, డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్‌గా మారతాయన్నారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చని, అడ్వొకేట్‌తో ప్రమేయం లేకుండా సొంతంగా వాదించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండ: వెంకయ్య
ఎన్నికలు ముగియటంతోనే రాజకీయాలు పక్కన పెట్టి దేశాభివృద్ధిపై దృష్టి సారించాలనే విధానంతో ప్రధాని మోదీ, ఆయన మార్గదర్శకత్వంలో తాము ముందుకు సాగుతున్నామని వెంకయ్య అన్నారు. అందుకే ఎన్డీయే భాగస్వామ్య పార్టీ(దేశం) అధికారంలో ఉన్న ఏపీకి, ఎన్డీయేలో లేని టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిలో కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణకు పూర్తిస్థాయి కొత్త బీఐఎస్ ల్యాబ్‌ను, ఏపీకి శాఖా కార్యాలయాన్ని మంజూరు చేయాలని వెంకయ్య కోరగా రెండింటిని మంజూరు చేస్తున్నట్టు పాశ్వాన్ ప్రకటించారు. స్థలం చూపితే మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
నెస్లే నుంచి 640 కోట్లు క్లెయిమ్
మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాదకర సీసం స్థాయి అధికంగా ఉందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా వివాదానికి కారణమైన నెస్లే కంపెనీ నుంచి రూ.640 కోట్ల మొత్తాన్ని క్లెయిమ్ చేసినట్టు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ‘ఆ నూడుల్స్‌లో సీసం పరిమాణం ఎంత ఉందనే విషయం త్వరలో తేలుతుంది. దాన్ని పక్కన పెడితే అసలు ఎఫ్ఎస్ఎస్ఐ అనుమతి లేకుండా సరుకులు మార్కెట్లోకి ఎలా తెచ్చారు, లేబుల్‌పై ముద్రించని కంటెంట్ లోపల ఎలా ఉంది.. అన్న రెండు ప్రధానాంశాల ఆధారంగా ఆ సంస్థ నుంచి రూ.640 కోట్లను మా శాఖ క్లెయిమ్ చేసింది’ అని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహాలో నిబంధనలను అనుసరించి ఓ సంస్థ నుంచి ఇంత భారీ మొత్తం క్లెయిమ్ చేయటం ఇదే ప్రథమమని చెప్పారు.