minister somi reddy
-
అధికారముందని విర్రవీగొద్దు!
సాక్షి ప్రతినిధి, కడప : టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో అధికారం ముసుగులో ఇంతకాలం చేసిన అవినీతి, అక్రమాలకు ఇక అడ్డుకట్ట వేయకపోతే కష్టమనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులపై బెదిరింపు ధోరణికి స్వస్తి చెప్పి, సౌమ్యంతో పనులు చేయించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల జిల్లా ముఖ్యనేతలతో రాజధానిలో పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఘావర్గాల ద్వారా తాను తెప్పించుకున్న సమాచారాన్ని క్రోడికరించుకుని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. నేతల మధ్య కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు తీవ్రతరం కావడంతో అధినేత దిద్దుబాటు చర్యలకు దిగారు. అందులోభాగంగానే జిల్లా ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి రెండురోజుల జిల్లా పర్యటనలో పార్టీ ముఖ్యనేతలతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లకాలం సాగదు.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రెండురోజులపాటు కడపలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమ మాటకు విలువలేకుండా పోయిందని, జూనియర్లదే హవా నడుస్తోందని, ఇలాగైతే జిల్లాలో పార్టీ మనుగడ సాగించేలేదని ఆది నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న కొందరు సీనియర్ నాయకులు కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా అధికార ముసుగులో నేతలు కొందరు భారీ అవినీతికి పాల్పడిన ఉదంతాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అధికారముందని, మనమనుకున్నవన్నీ జరిగిపోతాయనుకోవడం పొరపాటే అవుతుందని, ఎల్లకాలం మన ఆటలు సాగవన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే మరోవైపు తమ పనులేమీ జరగడం లేదని, అధికారులు తమ మాటే వినడం లేదని కొందరు నేతలు మంత్రి వద్ద వాపోయారు. తక్షణమే ఆ అధికారులకు స్థానచలనం కలిగించాలని ఒత్తిడి కూడా తెచ్చారు. పార్టీకి మచ్చతెచ్చే పనులు చేపట్టొద్దు ‘రానున్నది ఎన్నికల వేళ.. పార్టీ నేతలు, నాయకులు అందరూ ప్రజలతో కలిసి పోయి పనిచేయాలి. ఇది పార్టీ ఆదేశమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా వ్యవతిరేకతను మూటకట్టుకోకూడదు’ అని ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి జిల్లా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షం చురుకైన పాత్రను పోషిస్తూ అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పుడు మిత్రపక్షమైన బీజేపీ కూడా మనపై దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీనేతలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో అధికారపార్టీ నేతల అవినీతి, అక్రమాలు పెరిగాయని, అధినేత వద్ద స్పష్టమైన సమాచారం ఉందని, ఇకపై వాటికి స్వస్తి పలకాలని హెచ్చరించడం కొందరు నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది. మంచి పనులు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలికానీ, అవినీతి పనులు, కబ్జాలతో పత్రికల్లో పతాకశీర్షికల్లో నిలవరాదని ఇన్చార్జి మంత్రి హితవుపలికారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తుంటారని, వారిని తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు. ‘ప్రతిదానికి తగువపడితే నష్టం మనకే జరుగుతుంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. దానికి మచ్చ తెచ్చే పనులేవీ చేపట్టొద్దు. చీటికిమాటికి అధికారులపై చిర్రుబుర్రలాడొద్దు. వారితో సౌమ్యంగా పనులు చేపించుకోండి. బెదిరిస్తే అన్ని పనులూ జరగవు.’ అని మంత్రి సోమిరెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. జిల్లాలో బలహీనంగా ఉన్న ఆ పార్టీ, అధినేత చర్యలతో ఎంతమేరకు పుంజుకుంటుందో వేచిచూడాల్సిందే. -
ఎక్కడ మాఫీ చేశారయ్యా?
నెల్లూరు(అర్బన్): రైతు రుణమాఫీని గొప్పగా అమలు చేశామని చెప్పుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సొంత జిల్లా రైతులే షాక్ ఇచ్చారు. రుణాలు ఎక్కడ మాఫీ చేశారో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి.. పేర్ల నమోదులో సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్పి, అక్కడ్నుంచి బయటపడ్డారు. రుణ మాఫీ అందని రైతుల కోసం శనివారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. మంత్రి సోమిరెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమానికి అధికారులు ఊహించిన దానికంటే వేలాది సంఖ్యలో రైతులు తరలివచ్చారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ అందలేదని ఫిర్యాదులు చేశారు. వందలాది మంది రైతులు మంత్రి సోమిరెడ్డి వద్దకు చేరుకుని రుణమాఫీ తీరుపై నిలదీశారు. రెండో విడతలో రుణమాఫీ బాండ్లు ఇస్తున్నట్లు చెప్పారని, కానీ వాటిని తమకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నల దాడి నుంచి తప్పించుకునేందుకు.. పేర్ల నమోదులో సాంకేతిక లోపాలు తలెత్తాయని, సమస్యను వెంటనే పరిష్కరిస్తామంటూ మంత్రి అక్కడ్నుంచి బయటపడ్డారు. -
తమ్ముళ్ల తన్నులాట
టీడీపీలో ముదురుతున్న ముసలం ♦ మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల మధ్య తారస్థాయికి విభేదాలు ♦ కీలక నియోజకవర్గాల్లో సోమిరెడ్డి పెత్తనంపై నేతల గుర్రు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా టీడీపీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ముఖ్యనేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చెంతకు ప్రతినెలా రెండుమూడు పంచాయితీలు వెళుతున్నా.. పరిష్కారం కావడం లేదు. దీంతో నాయకుల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ఈ పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీమంత్రి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య నెలకొన్న వివాదం తాజాగా మరోసారి భగ్గుమంది. గురువారం నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్లో మంత్రి సోమిరెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో ఆదాలకు తెలియకుండానే అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారనేది ఆయన వర్గీయుల ఆరోపణ కాగా.. ఈ నియోజకవర్గానికి వస్తున్నప్పుడల్లా మంత్రే స్వయంగా ఆదాలకు ఫోన్ చేస్తున్నారనేది సోమిరెడ్డి వర్గం వాదన. మొత్తం మీద ఇరువురు నేతల వ్యవహారంతో అధికార పార్టీలో కొత్త పంచాయితీకి తెరలేచింది. ఇదీ నేపథ్యం గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కొనసాగతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ.. జిల్లాలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. అయితే, మంత్రి సోమిరెడ్డి కీలక నియోజకవర్గాల్లోని వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహాలోనే ఆదాల ప్రభాకరరెడ్డి, మంత్రి సోమిరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అవికూడా వివిధ పనులకు సంబంధించినవే. ఇరిగేషన్ కాంట్రాక్ట్ పనులు మొదలుకొని ట్రాక్టర్ల పంపిణీ వరకు వీరిద్దరూ ఒక్కొక్క రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో రూరల్ నియోజకవర్గంలో సుమారు రూ.30 కోట్ల విలువైన ఇరిగేషన్ పనులను తన అనుచరులకు ఇవ్వాలని ఆదాల కోరగా.. వాటిని సోమిరెడ్డి తన అనుయాయులకు కట్టబెట్టారు. ఈ వ్యవహరంతో ఇద్దరిమధ్యా దూరం పెరిగింది. ఈ విషయమై ఆదాల వర్గం లోకేష్ ఎదుట పంచాయితీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా మంత్రి సోమిరెడ్డి నెల్లూరు రూరల్‌లో ట్రాక్టర్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆదాలతో సంబంధం లేకుండా చేపట్టి 38 ట్రాక్టర్ల పంపిణీకి సంబంధించి లబ్థిదారుల జాబితాను సిద్ధం చేశారు. దీనిపై కూడా ఆదాల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో తనకు పార్టీపరంగా ప్రాధాన్యత తగ్గుతోందని, పార్టీలో తనమాట చెల్లుబాటు కాకుండా చేస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ఆదాల గతంలో విన్నవించారు. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆదాల తన నియోజకవర్గంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టి.. మంత్రి పి.నారాయణను ఆహ్వానించి నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి సోమిరెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తాను ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఉన్నందున రూరల్ నియోజకవర్గంలోని 2వ డివి జన్‌లో చేపట్టే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదాల కోరగా.. అందుకు భిన్నంగా మంత్రి సోమిరెడ్డి గురువారం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటంతో వివాదం మరింత ముదిరింది. -
‘సోమిరెడ్డి లాఠీకి ఎక్కువ.. తుటాకు తక్కువ’
నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార టీడీపీని తీవ్రంగా విమర్శించారు. టీడీపీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకులో అరటిపండు లాంటివారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి లాఠీకి ఎక్కువ.. తుటాకు తక్కువ అని కాకాని అన్నారు. చంద్రబాబుది హత్యలు చేయించిన చరిత్ర అని ఆయన అన్నారు. రంగాతో పాటు ఒక జర్నలిస్ట్‌ను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. రాజీనామా చేసిన తరువాత వైఎస్ఆర్ సీపీలో చేరాలని శిల్పా చక్రపాణి రెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పరన్నారు. చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాత్రం కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొన్నరని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, టీడీపీ నేతలకు మతిభ్రమించిందని అన్నారు. సోమిరెడ్డి లాంటి వారికి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని కాకాని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్బంగా జిల్లాలో రాజకీయ వాతావరణ వెడెక్కింది.