
తమ్ముళ్ల తన్నులాట
టీడీపీలో ముదురుతున్న ముసలం
♦ మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల మధ్య తారస్థాయికి విభేదాలు
♦ కీలక నియోజకవర్గాల్లో సోమిరెడ్డి పెత్తనంపై నేతల గుర్రు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు :
జిల్లా టీడీపీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ముఖ్యనేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చెంతకు ప్రతినెలా రెండుమూడు పంచాయితీలు వెళుతున్నా.. పరిష్కారం కావడం లేదు. దీంతో నాయకుల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ఈ పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీస్తోంది.
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీమంత్రి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య నెలకొన్న వివాదం తాజాగా మరోసారి భగ్గుమంది. గురువారం నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్‌లో మంత్రి సోమిరెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో ఆదాలకు తెలియకుండానే అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారనేది ఆయన వర్గీయుల ఆరోపణ కాగా.. ఈ నియోజకవర్గానికి వస్తున్నప్పుడల్లా మంత్రే స్వయంగా ఆదాలకు ఫోన్ చేస్తున్నారనేది సోమిరెడ్డి వర్గం వాదన. మొత్తం మీద ఇరువురు నేతల వ్యవహారంతో అధికార పార్టీలో కొత్త పంచాయితీకి తెరలేచింది.
ఇదీ నేపథ్యం
గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ.. జిల్లాలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. అయితే, మంత్రి సోమిరెడ్డి కీలక నియోజకవర్గాల్లోని వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహాలోనే ఆదాల ప్రభాకరరెడ్డి, మంత్రి సోమిరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అవికూడా వివిధ పనులకు సంబంధించినవే. ఇరిగేషన్ కాంట్రాక్ట్ పనులు మొదలుకొని ట్రాక్టర్ల పంపిణీ వరకు వీరిద్దరూ ఒక్కొక్క రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో రూరల్ నియోజకవర్గంలో సుమారు రూ.30 కోట్ల విలువైన ఇరిగేషన్ పనులను తన అనుచరులకు ఇవ్వాలని ఆదాల కోరగా.. వాటిని సోమిరెడ్డి తన అనుయాయులకు కట్టబెట్టారు. ఈ వ్యవహరంతో ఇద్దరిమధ్యా దూరం పెరిగింది.
ఈ విషయమై ఆదాల వర్గం లోకేష్ ఎదుట పంచాయితీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా మంత్రి సోమిరెడ్డి నెల్లూరు రూరల్‌లో ట్రాక్టర్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆదాలతో సంబంధం లేకుండా చేపట్టి 38 ట్రాక్టర్ల పంపిణీకి సంబంధించి లబ్థిదారుల జాబితాను సిద్ధం చేశారు. దీనిపై కూడా ఆదాల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో తనకు పార్టీపరంగా ప్రాధాన్యత తగ్గుతోందని, పార్టీలో తనమాట చెల్లుబాటు కాకుండా చేస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ఆదాల గతంలో విన్నవించారు. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆదాల తన నియోజకవర్గంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టి.. మంత్రి పి.నారాయణను ఆహ్వానించి నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి సోమిరెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తాను ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఉన్నందున రూరల్ నియోజకవర్గంలోని 2వ డివి జన్‌లో చేపట్టే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదాల కోరగా.. అందుకు భిన్నంగా మంత్రి సోమిరెడ్డి గురువారం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటంతో వివాదం మరింత ముదిరింది.