తలసాని ఫ్లెక్సీల దహనానికి కూలీల యత్నం
అమీర్‌పేట (హైదరాబాద్): తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహించిన కూలీలు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఫ్లెక్సీలను దహనం చేసేందుకు యత్నించారు. దీన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బల్కంపేట డివిజన్లోని స్వామి థియేటర్ వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని పేర్కొంటూ ఉదయం అడ్డా కూలీలు తలసాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించారు.
విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేత గోదాస్ కిరణ్‌తోపాటు కొందరు అక్కడకు చేరుకుని కూలీల చేతిలో ఉన్న ఫ్లెక్సీని లాగేసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటుతోపాటు గృహ నిర్మాణ పథకం వర్తింపచేస్తామని మంత్రి హమీ ఇచ్చి పట్టించుకోవడం లేదని కూలీల అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికి నిరసనగా చేపట్టిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.