కేటీఆర్కు ప్రమోషన్... తలసానికి డిమోషన్...
హైదరాబాద్: మంత్రుల శాఖల మార్పుల్లో భాగంగా తలసాని శ్రీనివాస యాదవ్ ను కీలకమైన శాఖ నుంచి తప్పించడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ నుంచి తప్పించి ఆయనకు అంతగా ప్రాధాన్యత లేని పశు సంవర్ధక, ఫిషరీస్, డెయిరీ డెవలప్ మెంట్ శాఖకు మార్చారు. శాఖల మార్పుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుండగా అందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
తలసాని నుంచి తప్పించిన వాణిజ్య పన్నుల శాఖను కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నారు. తలసానికి పశు సంవర్థక శాఖతో పాటు గతంలో ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను అలాగే కొనసాగించారు. ఇకపోతే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను కేసీఆర్ మార్చారు. పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయశాఖతో పాటు అదనంగా సహకార శాఖను కూడా అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం తర్వాత పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న కేటీఆర్ కు అదనంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను కేటీఆర్ కు అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కేటీఆర్ నుంచి తప్పించి దాన్ని జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అలాగే జూపల్లి ఇప్పటివరకు నిర్వహిస్తున్న వాణిజ్యం పరిశ్రమల శాఖను కేటీఆర్ కు అప్పగించారు. అంటే వీరి శాఖలను అటుఇటుగా మార్చారు. వాణిజ్య పన్నుల శాఖతో పాటు కేటీఆర్ మున్సిపల్ వ్యవహారాల శాఖ కూడా నిర్వహిస్తారు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎన్ఆర్ఐ శాఖలను కూడా కేటీఆర్ కు అప్పగించారు. ఒక రకంగా కేటీఆర్ కు కేటాయించిన అదనపు శాఖలను విశ్లేషిస్తే ఆయనకు మరోసారి ప్రమోషన్ లభించినట్టేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, రాష్ట్రానికి వాణిజ్య పన్నుల శాఖ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తుంది. అలాంటి కీలక శాఖ నుంచి తప్పించి అంతగా ప్రాధాన్యత లేని పశు సంవర్ధక శాఖ కేటాయించడం ద్వారా మంత్రి తలసానికి కేసీఆర్ పరోక్ష హెచ్చరికలా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తలసానికి ఈ మార్పు డిమోషన్ కాగా అందుకు బలమైన కారణాలే ఉంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. తలసాని శాఖ మార్చనున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు పశుసంవర్ధక శాఖకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే వాణిజ్య పన్నుల శాఖను తన వద్దే ఉంచుకోవడంతో కేసీఆర్ పరోక్షంగా మరో సంకేతం కూడా ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖతో పాటు గ్రామీణ నీటి సరఫరా శాఖను కూడా కేసీఆర్ తనవద్దే పెట్టుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిలో ఎవరికైనా ఆ శాఖలు కేటాయించేందుకే అలా చేసి ఉంటారన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.