Minister Uma Bharti
-
తెలంగాణ గోస వినాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంలో రాష్ట్రానికి ఊరట. జలాల పంపిణీలో తెలంగాణ వాదనలను వినాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గురువారం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ వినడం గానీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆ అర్జీలో కోరింది. కేంద్రం ఏడాదిలోగా కృష్ణా నదీ జలాల భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఏడాది గడువు ముగిసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో ఈ అర్జీని పరిష్కరించడంలో భాగంగా కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాదనలు కూడా వినాలని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2కు కేంద్రం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అర్జీలో ఏముంది? కృష్ణా జలాల పంపిణీలో ఎన్నడూ తమ వాదనలు వినిపించలేకపోయామని, అందువల్ల ఈ నదీ పరివాహకంలోని నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ మొదటి నుంచీ వినేలా వీలు కల్పించాలని తెలంగాణ కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా గానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా గానీ తెలంగాణకు న్యాయం జరగలేదని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలు వినిపించుకోలేకపోయామని తెలిపింది. ‘అసలు నీళ్లలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ ప్రాంతం ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంది. ఇప్పుడు విడిపోయిన తరువాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా? అన్యాయాన్ని సరిదిద్దేందుకు వీలుగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, నాలుగు రాష్ట్రాల వాదనలు తిరిగి వినిపించేందుకు గానీ వీలు కల్పించాలి’ అని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి అవార్డు ప్రకటించాక వివిధ రాష్ట్రాల అభ్యర్థనలతో సుప్రీంకోర్టు సూచనల మేరకు 2013లో తుది అవార్డు ప్రకటించింది. కానీ దానిని కేంద్రం నోటిఫై చేయలేదు. సుప్రీంకోర్టు దానిపై స్టే విధించడం వల్ల కేంద్రం నోటిఫై చేయలేకపోయింది. తెలంగాణ తమ వాదనలు వినాలని పట్టుబట్టుతుండగా.. మహారాష్ట్ర, కర్ణాటకలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ అవార్డును కేంద్రం నోటిఫై చేయలేదని, ఇలా అయితే ఇక ట్రిబ్యునళ్లు ఎందుకని మండిపడుతున్నాయి. ఉమ్మడి ఏపీకి ఏ కేటాయింపులైతే చేశారో.. వాటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని వాదిస్తున్నాయి. తదుపరి ఏంటి? ఒకవేళ కేంద్ర నిర్ణయంతో తెలంగాణకు మేలు జరిగే పరిస్థితి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటకలు దీనిని న్యాయస్థానంలో వ్యతిరేకించే అవకాశముంది. తాజాగా కేంద్రం చేస్తున్న ఈ సిఫారసును ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఆ మేరకు మళ్లీ మొదటి నుంచి తెలంగాణ వాదనలు విని అవార్డు తయారు చేస్తుందా? లేక సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదున కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణకు అనుగుణంగా నిర్ణయం వెలువడితే ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
మోదీపై పుస్తకం రాయాలనుంది: ఉమ
భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పుస్తకం రాయాలని ఉందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి తెలిపారు. మోదీ వ్యక్తిత్వం, దేశంలోని ప్రతి సమస్యపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆదివారమిక్కడ విలేకర్లతో అన్నారు. తాను కేంద్ర మంత్రి కాకముందు మోదీ గురించి పూర్తిగా తెలియదన్నారు. కానీ ఇప్పుడు తరచుగా మోదీతో మాట్లాడ డం వల్ల ఆయన విజ్ఞానం, సమస్యలపై ఉన్న లోతైన అవగాహన తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మోదీ అభివృద్ధి ఎజెండాకు కాంగ్రెస్ పార్టీ సమస్యగా మారిందని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో ఉమ.. మోదీని పొగుడుతూ మొత్తం 23 సార్లు ఆయన పేరు పలకగా, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. -
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!
- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194 - ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక - కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని - అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం - కేంద్రమంత్రి ఉమాభారతికి - వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జూరాలకు వరద కష్టమే! కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది. -
‘గుండుగుత్త’గా ప్రయోజనం!
* కృష్ణాలో కేటాయించిన నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకోవచ్చు * సాగర్ ఎగువన వాడుకోలేని నీరు దిగువ ఆయకట్టుకు.. * రాష్ట్ర వాదనకు కేంద్రం అంగీకారం సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రానికి గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం వాదనకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు ఉండీ నాగార్జునసాగర్ ఎగువన వాడుకోలేకపోతున్న నీటిని దిగువ ఆయకట్టు, ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కలుగనుంది. కృష్ణా బేసిన్లో తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉన్నా ప్రస్తుతం ఆ ప్రాజెక్టులేవీ పూర్తికాలేదు. దాంతో ఆ కేటాయింపుల మేర సాగర్ నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ పేర్కొంటోంది. కానీ దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది గత ఏడాది రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీయగా... ఈసారి కేంద్రం ముందుగానే అప్రమత్తమై ఇరు రాష్ట్రాలతో చర్చించింది. గుండుగుత్తగా కేటాయించిన నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామన్న తెలంగాణ వాదనకు అంగీకరించింది. దీనిని ఏపీ కూడా అంగీకరించింది. ప్రాజెక్టులు పూర్తిగాక.. కృష్ణా నీటిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉంది. అయితే కృష్ణాపై తెలంగాణలో ప్రతిపాదించిన భీమా, ఆర్డీస్తో పాటు ఇతర మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులేవీ పూర్తికాకపోవడంతో నీటిని వాడుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎగువన వాడుకోలేక పోతున్న నీటిని.. దిగువన ఉన్న ఏఎమ్మార్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని ఏపీ అడ్డుకోవడం వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా కేటాయించిన నిర్దిష్ట వాటాను ఎక్కడైనా వాడుకోవచ్చనే కేంద్రం ప్రకటనతో.. తెలంగాణకు కృష్ణా నీటి కేటాయింపుల్లో పూర్తి వాటా దక్కుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయంతో సాగర్ దిగువన ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, ఖమ్మంలో ఉన్న 2.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. దీంతోపాటు ఏఎమ్మార్ ప్రాజెక్టు కింద మరో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీరనున్నాయి. మరోవైపు శ్రీశైలం జలాశయంలో కనీస జలమట్టం 534 అడుగులతో సంబంధం లేకుండా తమకు కేటాయించిన వాటాలో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు తెలంగాణకు దక్కనుంది. ఇరు రాష్ట్రాలను అభినందిస్తూ ఉమాభారతి లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అభినందించారు. ఈమేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శనివారం ఆమె లేఖలు రాశారు. ఈ పంపకాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆమె అభినందనలు తెలిపారు. నీటి పంపకాల ఒప్పందాన్ని చారిత్రాత్మకంగా ఆమె పేర్కొన్నారు.