
మోదీపై పుస్తకం రాయాలనుంది: ఉమ
భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పుస్తకం రాయాలని ఉందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి తెలిపారు. మోదీ వ్యక్తిత్వం, దేశంలోని ప్రతి సమస్యపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆదివారమిక్కడ విలేకర్లతో అన్నారు. తాను కేంద్ర మంత్రి కాకముందు మోదీ గురించి పూర్తిగా తెలియదన్నారు. కానీ ఇప్పుడు తరచుగా మోదీతో మాట్లాడ డం వల్ల ఆయన విజ్ఞానం, సమస్యలపై ఉన్న లోతైన అవగాహన తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
మోదీ అభివృద్ధి ఎజెండాకు కాంగ్రెస్ పార్టీ సమస్యగా మారిందని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో ఉమ.. మోదీని పొగుడుతూ మొత్తం 23 సార్లు ఆయన పేరు పలకగా, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు.