తెలంగాణ గోస వినాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంలో రాష్ట్రానికి ఊరట. జలాల పంపిణీలో తెలంగాణ వాదనలను వినాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గురువారం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ వినడం గానీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆ అర్జీలో కోరింది. కేంద్రం ఏడాదిలోగా కృష్ణా నదీ జలాల భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఏడాది గడువు ముగిసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో ఈ అర్జీని పరిష్కరించడంలో భాగంగా కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాదనలు కూడా వినాలని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2కు కేంద్రం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
అర్జీలో ఏముంది?
కృష్ణా జలాల పంపిణీలో ఎన్నడూ తమ వాదనలు వినిపించలేకపోయామని, అందువల్ల ఈ నదీ పరివాహకంలోని నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ మొదటి నుంచీ వినేలా వీలు కల్పించాలని తెలంగాణ కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా గానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా గానీ తెలంగాణకు న్యాయం జరగలేదని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలు వినిపించుకోలేకపోయామని తెలిపింది. ‘అసలు నీళ్లలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ ప్రాంతం ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంది.
ఇప్పుడు విడిపోయిన తరువాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా? అన్యాయాన్ని సరిదిద్దేందుకు వీలుగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, నాలుగు రాష్ట్రాల వాదనలు తిరిగి వినిపించేందుకు గానీ వీలు కల్పించాలి’ అని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి అవార్డు ప్రకటించాక వివిధ రాష్ట్రాల అభ్యర్థనలతో సుప్రీంకోర్టు సూచనల మేరకు 2013లో తుది అవార్డు ప్రకటించింది. కానీ దానిని కేంద్రం నోటిఫై చేయలేదు. సుప్రీంకోర్టు దానిపై స్టే విధించడం వల్ల కేంద్రం నోటిఫై చేయలేకపోయింది.
తెలంగాణ తమ వాదనలు వినాలని పట్టుబట్టుతుండగా.. మహారాష్ట్ర, కర్ణాటకలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ అవార్డును కేంద్రం నోటిఫై చేయలేదని, ఇలా అయితే ఇక ట్రిబ్యునళ్లు ఎందుకని మండిపడుతున్నాయి. ఉమ్మడి ఏపీకి ఏ కేటాయింపులైతే చేశారో.. వాటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని వాదిస్తున్నాయి.
తదుపరి ఏంటి?
ఒకవేళ కేంద్ర నిర్ణయంతో తెలంగాణకు మేలు జరిగే పరిస్థితి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటకలు దీనిని న్యాయస్థానంలో వ్యతిరేకించే అవకాశముంది. తాజాగా కేంద్రం చేస్తున్న ఈ సిఫారసును ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఆ మేరకు మళ్లీ మొదటి నుంచి తెలంగాణ వాదనలు విని అవార్డు తయారు చేస్తుందా? లేక సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదున కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణకు అనుగుణంగా నిర్ణయం వెలువడితే ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్‌పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.