సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయిన నేపథ్యం లో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి, రాష్ట్రానికి న్యాయమైన నీటి హక్కులు దక్కేలా చూడాలని విన్నవించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందులో మరోమారు ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తొలిసారిగా 2014లోనే లేఖ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను వివరిం చింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటా యింపులు ఏమాత్రం సరిపోవు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో పరివాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎం సీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో పేర్కొంది.
స్పందించని కేంద్రం
రాష్ట్రం చేసిన అభ్యర్థనపై చట్ట ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుండగా గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌చే విచారణ చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామంటూనే... సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం.. కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ మేరకు రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు నాలుగు నెలల కిందట ప్రభుత్వం పిటిషన్ పెట్టుకుంది.
సుప్రీం ఓకే చెప్పడంతో..
సుప్రీంకోర్టు బుధవారం ఉపసంహరణకు ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్రం నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితితో తుదితీర్పు వెలువడేలా చూడాలని లేఖలో కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయింపులు 500 టీఎంసీలకు పెరగాల్సి ఉందన్న విషయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment