‘గుండుగుత్త’గా ప్రయోజనం!
* కృష్ణాలో కేటాయించిన నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకోవచ్చు
* సాగర్ ఎగువన వాడుకోలేని నీరు దిగువ ఆయకట్టుకు..
* రాష్ట్ర వాదనకు కేంద్రం అంగీకారం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రానికి గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం వాదనకు కేంద్రం అంగీకరించింది.
ఈ మేరకు కేటాయింపులు ఉండీ నాగార్జునసాగర్ ఎగువన వాడుకోలేకపోతున్న నీటిని దిగువ ఆయకట్టు, ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కలుగనుంది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉన్నా ప్రస్తుతం ఆ ప్రాజెక్టులేవీ పూర్తికాలేదు. దాంతో ఆ కేటాయింపుల మేర సాగర్ నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ పేర్కొంటోంది. కానీ దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది గత ఏడాది రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీయగా... ఈసారి కేంద్రం ముందుగానే అప్రమత్తమై ఇరు రాష్ట్రాలతో చర్చించింది. గుండుగుత్తగా కేటాయించిన నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామన్న తెలంగాణ వాదనకు అంగీకరించింది. దీనిని ఏపీ కూడా అంగీకరించింది.
ప్రాజెక్టులు పూర్తిగాక..
కృష్ణా నీటిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉంది. అయితే కృష్ణాపై తెలంగాణలో ప్రతిపాదించిన భీమా, ఆర్డీస్‌తో పాటు ఇతర మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులేవీ పూర్తికాకపోవడంతో నీటిని వాడుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎగువన వాడుకోలేక పోతున్న నీటిని.. దిగువన ఉన్న ఏఎమ్మార్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని ఏపీ అడ్డుకోవడం వివాదాలకు దారి తీస్తోంది.
తాజాగా కేటాయించిన నిర్దిష్ట వాటాను ఎక్కడైనా వాడుకోవచ్చనే కేంద్రం ప్రకటనతో.. తెలంగాణకు కృష్ణా నీటి కేటాయింపుల్లో పూర్తి వాటా దక్కుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయంతో సాగర్ దిగువన ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, ఖమ్మంలో ఉన్న 2.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. దీంతోపాటు ఏఎమ్మార్ ప్రాజెక్టు కింద మరో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీరనున్నాయి. మరోవైపు శ్రీశైలం జలాశయంలో కనీస జలమట్టం 534 అడుగులతో సంబంధం లేకుండా తమకు కేటాయించిన వాటాలో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు తెలంగాణకు దక్కనుంది.
ఇరు రాష్ట్రాలను అభినందిస్తూ ఉమాభారతి లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అభినందించారు. ఈమేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శనివారం ఆమె లేఖలు రాశారు. ఈ పంపకాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆమె అభినందనలు తెలిపారు. నీటి పంపకాల ఒప్పందాన్ని చారిత్రాత్మకంగా ఆమె పేర్కొన్నారు.