సీఎం క్యాబిన్ లీకేజీ..!
సాక్షి, ముంబై : వరుసగా కురుస్తున్న వర్షాలకు మంత్రాలయ కురుస్తోంది. వివిధ శాఖల మంత్రుల క్యాబిన్లు వర్షానికి లీకేజీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూర్చునే క్యాబిన్, ఆయన చాంబర్లూ ఇందుకు మినహాయింపుకాదు. సీఎం క్యాబిన్లో అక్కడక్కడా బకెట్లు అమర్చాల్సిన దుస్థితి. లీకేజీల వల్ల వరండాలో, మంత్రుల చాంబర్లలో పరచిన ఖరీదైన తివాచీలు తడిసి పాడైపోయాయి.
కొన్ని చోట్ల పైన అమర్చిన పీపీ షీట్లు విరిగి కిందపడ్డాయి. 2012లో మంత్రాలయ భవనంలో అగ్ని ప్రమాద ఘటన జరిగిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆధునీకీకరించారు. దీంతో అనేక మంది మంత్రులు తమ క్యాబిన్లల్లో కుర్చీలు, కిటికీ కర్టెన్లు, ఏసీలు, సీలింగ్ పైన ప్లాస్టర్ ప్యారిస్ (పీపీ)తో తయారైన అందమైన షీట్లు అమర్చుకున్నారు. తీరా క్యాబిన్లల్లోకి వర్షం నీరు చేరుతుండడంతో కోట్ల విలువైన సామగ్రి పాడైపోతోంది.
నాసిరకంగా మరమ్మతు పనులు
కాలిపోయిన నాలుగు నుంచి ఏడో అంతస్తు ఆధునికీకరణ పనుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను చేపట్టిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. భవన సముదాయం చిన్నపాటి వర్షానికే లీకేజీ అవుతోంది.ఉద్యోగులు పనిచేసే చోట కూడా అక్కడక్కడా వర్షపు నీరు లీకేజీ అవుతోంది. టేబుళ్లు, ఫైళ్లకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని అంతస్తుల్లో వర్షపు నీరు నిల్వ ఉండంతో తొందరపాటులో ఉదయం ఉద్యోగులు జారీ పడుతున్న సంఘటనలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా భవన సముదాయంలో లీకేజీల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.