మంత్రిగారి కుక్కా.. మజాకా!
ఒకవైపు జైపూర్ నగరంలో జరిగిన సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు విచారణలో తల మునకలై ఉన్న రాజస్థాన్ పోలీసులకు.. ఓ అర్జంటు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆ కేసును పక్కన పెట్టి అంతా రోడ్ల మీద పడ్డారు. విషయం ఏమిటంటే, ఓ మంత్రిగారు పెంచుకుంటున్న మూడేళ్ల కుక్కపిల్ల తప్పిపోయింది. బీగిల్ జాతికి చెందిన చార్లీ అనే ఈ కుక్కపిల్ల శనివారం ఉదయం 7 గంటలకు తప్పిపోయింది. దాంతో సొడాలా పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదుచేశారు. వెంటనే అక్కడి పోలీసులు ఇతర స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చి, దాన్ని 'వీలైనంత తొందరగా' కనిపెట్టాలని చెప్పారు. అది రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్‌కు చెందినదా కాదా అనే విషయాన్ని మాత్రం పోలీసులు బయట పెట్టడంలేదు. ఆదివారం అంతా పోలీసులు ఆ కుక్కపిల్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
''కుక్కపిల్లలు, ఇతర పెంపుడు జంతువులు పోయాయన్న ఫిర్యాదులు మాకు రోజూ వస్తూనే ఉంటాయి. అది మంత్రిదైతే ఏమవుతుంది? అది కనిపించగానే మేం దాని యజమానికి అప్పగించాలి'' అని ఇన్స్పెక్టర్ విద్యా ప్రకాష్ చెప్పారు. చార్లీ ఆచూకీ ఎవరైనా చెబితే వాళ్లకు రూ. 10 వేల బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే.. సామూహిక అత్యాచారం, దోపిడీ లాంటి పెద్దకేసును వదిలేసి ఇలాంటి కేసును పట్టుకోవడంపై పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.