Ministers visit
-
గరగపర్రులో మంత్రుల వరాల జల్లు
పాలకోడేరు : గరగపర్రు వచ్చిన వచ్చిన ముగ్గురు మంత్రులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు దళితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజుతో కలిసి సోమవారం గరగపర్రు వచ్చారు. గరగపర్రులోని 63 మంది బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని వారు ప్రకటించారు. దీనికి దళితులు నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నష్టపరిహారం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిసేపు తర్జన భర్జనల అనంతరం అన్ని బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తామని వారు ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటనే ఉంచుతామని, పాత పంచాయతీ కార్యాలయాన్ని అంబేడ్కర్ భవనంగా నిర్మిస్తామని ప్రకటించిన మంత్రి ఆనంద్‌బాబు కొద్దిసేపటికే స్వరం మార్చారు. పక్కకు వెళ్లి ఎమ్మెల్యేతో తర్జనభర్జనలు జరిపి మీరు కోరుకున్న మరో చోట అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని, మీరనుకున్నచోట వివాదాస్పద స్థలంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. దీన్ని దళితులంతా వ్యతిరేకించారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పినా దళితులు ఒప్పుకోలేదు. మంత్రులు పితాని, జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని 36 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయించామని మీకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరంతా కలసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఎస్పీ పూర్ణచంద్రరరావు, ఆచంట మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, సిరింగుల బాబి, సిరింగుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో భక్తుల సందడి
పుష్కర స్నానం చేసిన స్పీకర్ కోడెల ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి సాక్షి, అమరావతి : అమరావతిలో పుష్కరాల ఆరో రోజైన బుధవారం ఉదయం ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అమరేశ్వరుని ఆలయంలో స్వామి దర్శనానికి రావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. వీఐపీ ఘాట్ ఉన్నప్పటికీ దానికంటే అనుకూలంగా ఉండటంతో స్థానిక ధ్యానబుద్ధ ఘాట్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించారు. ఘాట్ ప్రాంగణం ఎదురుగా ఉన్న నమూనా దేవాలయాల వద్దకు వెళ్లి భక్తులు పూజలు చేస్తుండటంతో ఆ ప్రాంగణం సందడిగా కనిపిస్తోంది. 125 అడుగులతో నిర్మించిన బుద్ధుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువత సెల్ఫీలు, చిన్నారులు ఆటలాడుకొంటూ సరదాగా గడుపుతున్నారు. సాయంత్రం తీరంలో ఆహ్లాదకర వాతావరణం భక్తులను కట్టిపడేస్తోంది. రాత్రివేళల్లో ఆ ప్రాంతం కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. నమూనా ఆలయాల పక్కనే చేస్తున్న చండీయాగానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అమరావతిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. సత్యసాయి సేవా ట్రస్టు వారు ఏర్పాటుచేసిన ఉచిత భోజనశాలలో భోజనం చేశారు. ఎండ వేడి బుధవారం కూడా కొనసాగడంతో చిన్నారులు, వద్ధులు ఇబ్బందులు పడ్డారు. సేవలో తరిస్తూ... ఫుష్కర స్నానాల కోసం వచ్చే వేలాది మంది భక్తులకు సేవలందిస్తూ స్వచ్ఛంద సంస్థలు మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. ఘాట్లను శుభ్రంగా ఉంచడం, వృద్ధులను వీల్‌చైర్‌లో తీసుకురావడం, ఘాట్‌లో తాగి పడేసిన ఖాళీ వాటర్ ప్యాకెట్లను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తున్నారు. ఘాట్లలో స్నానాలు చేస్తున్న వృద్ధులకు ఆసరాగా ఉంటున్నారు. రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు కూడా తమ దాతృత్వం చాటుకుంటున్నారు. ఉచిత అన్న ప్రసాదాన్ని భక్తులకు అప్యాయంగా అందజేస్తున్నారు. అమరావతిలో రామ భక్త సేవా సమితి వారు ఉచిత అల్పాహారం అందిస్తున్నారు.