గరగపర్రులో మంత్రుల వరాల జల్లు
గరగపర్రులో మంత్రుల వరాల జల్లు
Published Tue, Jul 25 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
పాలకోడేరు : గరగపర్రు వచ్చిన వచ్చిన ముగ్గురు మంత్రులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు దళితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజుతో కలిసి సోమవారం గరగపర్రు వచ్చారు. గరగపర్రులోని 63 మంది బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని వారు ప్రకటించారు. దీనికి దళితులు నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నష్టపరిహారం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిసేపు తర్జన భర్జనల అనంతరం అన్ని బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తామని వారు ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటనే ఉంచుతామని, పాత పంచాయతీ కార్యాలయాన్ని అంబేడ్కర్ భవనంగా నిర్మిస్తామని ప్రకటించిన మంత్రి ఆనంద్‌బాబు కొద్దిసేపటికే స్వరం మార్చారు. పక్కకు వెళ్లి ఎమ్మెల్యేతో తర్జనభర్జనలు జరిపి మీరు కోరుకున్న మరో చోట అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని, మీరనుకున్నచోట వివాదాస్పద స్థలంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. దీన్ని దళితులంతా వ్యతిరేకించారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పినా దళితులు ఒప్పుకోలేదు. మంత్రులు పితాని, జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని 36 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయించామని మీకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరంతా కలసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఎస్పీ పూర్ణచంద్రరరావు, ఆచంట మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, సిరింగుల బాబి, సిరింగుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement