Ministry of Communication
-
హలో.. అవుటాఫ్ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్ కవరేజ్కష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజ్ లేదని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజ్ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలకు మొబైల్ కవరేజ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొబైల్ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నాలజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలాగే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. -
పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ రెండోసారి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ గత వారం సమావేశమై.. జస్టిస్ సీకే ప్రసాద్ నియామకానికి ఆమోదం తెలిపింది. చట్టబద్ధ సంస్థ అయిన పీసీఐ.. ప్రింట్ మీడియా నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం.. కౌన్సిల్లో చైర్మన్‌తోపాటు మరో 28 మంది సభ్యులు ఉండాలి. గత మార్చిలో 8 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయగా.. మిగతా 20 మంది సభ్యుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. మిగతా సభ్యుల జాబితాను కూడా అందజేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని జస్టిస్ ప్రసాద్ తెలిపారు. బిహార్‌లోని పట్నా నగరంలో జన్మించిన జస్టిస్ ప్రసాద్.. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. 2008లో కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2009 మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2014 జూలై 14 వరకు సుప్రీంకోర్టు జడ్జీగా సేవలందించారు. -
ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా అమర్నాథ్ కొనసాగింపు
హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సభ్యుడిగా సీనియర్ జర్నలిస్టు, ఐజేయూ నేత కె.అమర్నాథ్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమర్నాథ్ను పీసీఐ సభ్యుడిగా మరోసారి నియమించింది. పీసీఐ ప్రతినిధిగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు సేవలను సైతం మరో మూడేళ్ల వరకు పొడిగించింది. కాగా, కె.అమర్నాథ్కు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవుపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు.