శ్రీకాళహస్తి-కాణిపాకం మధ్య మెట్రోరైలు
- సింగపూర్ సంస్థలతో విభేదాలు లేవు
- మీడియాతో మంత్రి నారాయణ
తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రాల అనుసంధాన ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి-కాణిపాకం మధ్య మెట్రో రైలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు అనేది కేవలం పుకారు మాత్రమేనని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వర్తింపజేయాలనే ఉద్దేశంతోనే పథకాలు, ప్రాజెక్ట్లు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. తిరుపతి సర్వతోముఖాభివృద్ధికి త్వరలోనే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఉన్నారు.