వేళ్లు నలిగాయని వెళ్తే.. కోమాలోకి పంపారు!
స్కూల్లో దెబ్బ తగిలి వేళ్లు నలిగాయని ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ ఆపరేషన్‌లో వైద్యులు చేసిన పొరపాటు వల్ల ఐదేళ్ల పిల్లాడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కోమాలోకి వెళ్లాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షయ్ (5) అనే తన కొడుక్కి వేళ్లు నలిగాయని స్కూలు నుంచి ఫోన్ వచ్చిందని, వాళ్లు తనను ఆస్పత్రికి రమ్మని చెప్పారని అతడి తండ్రి పురుషోత్తం తెలిపారు. ఆస్పత్రికి వెళ్లేసరికి లక్షయ్ వేళ్లు బాగా నలిగిపోయి ఉండటం చూశానన్నారు. ఆరు గంటల్లోగా ఆపరేషన్ చేయాలని, అందుకోసం వెంటనే రూ. 60 వేలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
సరే కదా అని ఆపరేషన్‌కు అంగీకరించామని, కొన్ని గంటల తర్వాత వైద్యులు వచ్చి లక్షయ్‌కి గుండెల్లో ఏదో సమస్య ఉందని చెప్పారన్నారు. ఆపరేషన్‌కు ముందువరకు ఎంచక్కా ఉన్న తన కొడుక్కి అంతలోనే ఏమైందోనని ఆందోళన చెందామన్నారు. తర్వాత ఉన్నట్టుండి మళ్లీ వచ్చి అతడు కోమాలోకి వెళ్లినట్లు చెప్పారని, గత తొమ్మిది రోజులుగా తమ బిడ్డ కోమాలోనే ఉన్నాడని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వర్గాలు కనీసం అతడు ఎలా ఉన్నాడన్న విషయం కూడా తమకు చెప్పడం లేదని తెలిపారు.