Minority educational institution
-
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,638 నియామకాలు
వెంటనే పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యా సంస్థల్లో భారీగా నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,638 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. వీటితోపాటు కొత్తగా 4,829 పోస్టులను మంజూరీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించటంతోపాటు కొత్త పోస్టులను రాబోయే మూడేళ్లలో మంజూరు చేసే ప్రణాళికను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రస్తుతం 1,638 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 118 ప్రిన్సిపల్, 287 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 866 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, 124 పీఈటీ, 125 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్, 125 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీని ఆదేశించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఖాళీలు భర్తీ చేయాలని, సంబంధిత విభాగం అందించే లోకల్ కేడర్, రోస్టర్ పద్ధతి, అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పంపిన ఖాళీల ప్రతిపాదనలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. 4,829 కొత్త పోస్టులకు ఆమోదం... మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు కొత్తగా 4,829 బోధన, బోధనేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 4,137 రెగ్యులర్ పోస్టులు, 692 అవుట్ సోర్సింగ్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాబోయే మూడేళ్ల వ్యవధిలో విడతల వారీగా ఈ పోస్టులు మంజూరవుతాయి. ఈ ఏడాది 1,640 పోస్టులు, 2018–19లో 1,494 పోస్టులు, 2019–20లో 1,695 పోస్టులను మంజూరు చేయనుంది. -
శాసనసభలో ప్రభుత్వం ప్రకటన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు
- ఇతర మైనారిటీలకు వర్తింపు : - మంత్రి ఫౌజియాఖాన్ వెల్లడి ముంబై: ముస్లింలతోపాటు రాష్ట్రంలోని మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రకటించింది. బాషాపరమైన మైనారిటీ విద్యాసంస్థలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిసభ అభిప్రాయపడింది. మైనారిటీలకు విద్యా అవకాశాల కల్పనపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ దిలీప్ వల్సేపాటిల్పై సూచన చేశారు. దీనికి ఇతర సభ్యులంతా మద్దతు పలికారు. ‘మతపరమైన మైనారిటీలేగాక భాషాపరమైన మైనారిటీలూ ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది సంపన్నులు. సొంతగా విద్యాసంస్థలూ ఉన్నా, పేద, అణగారినవర్గాల వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు’ అని స్పీకర్ అన్నారు. సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. పేదలకు అడ్మిషన్లు నిరాకరించే విద్యాసంస్థలను వదిలిపెట్టకూడదని స్పష్టీకరించారు. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే స్పందిస్తూ భాషాపర మైనారిటీల అడ్మిషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మాట్లడుతూ ముస్లింలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఫౌజియా ఖాన్ దీనిపై వివరణ ఇస్తూ త్వరలోనే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో బోధన, సదుపాయాలను మెరుగుపర్చాలని పటేల్ కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చ నడుస్తోందని ఫౌజియా అన్నారు. అంతేగాక ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలూ మైనారిటీలేనని ఆమె వివరణ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమ నిధి పెంపు మైనారిటీల సంక్షేమ కోసం కేటాయించిన నిధులను రూ.362 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో బుధవారం చర్చ నడిచినప్పుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో రూ.280 కోట్లు, ఇటీవలి బడ్జెట్లో రూ.82 కోట్లు కేటాయించామన్నారు. దీనిని ఈ ఏడాది రూ.500 కోట్లకు పెంచుతామన్నారు. మహిళల భద్రతపై రాజీ లేదు : పాటిల్ మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా వైర్లెస్ కార్ల సేవలను వినియోగించుకుంటామని హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సభలో బుధవారం ప్రకటించారు. వీటిని కేవలం మహిళల రక్షణ కోసమే ఉపయోగిస్తారని చెప్పారు. శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో నడిచిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. దళితులు, మైనారిటీలు, మహిళలు, వయోధికులు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. హోంశాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.13,342 కోట్లు కాగా, వాటిలో రూ.150 కోట్లు సీసీటీవీల ప్రాజెక్టుకు, రూ.440 కోట్లు పోలీసుశాఖ ఆధునీకరణకు కేటాయిస్తామని పాటిల్ ప్రకటించారు.