పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.
కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది.
టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది.
ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.
ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.
అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.
దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.
Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j
— cricket.com.au (@cricketcomau) December 28, 2023