Mirchi support price
-
మళ్లీ మిర్చి మంట
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మళ్లీ ఉద్రిక్తత వరంగల్ సిటీ: ప్రభుత్వాలు మద్దతు ధర అందేలా చూస్తామని ప్రకటించినా మిర్చికి తక్కువ ధరలే అందుతుండడంతో రైతులు మళ్లీ కన్నెర్ర చేశారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేశారు. మార్కెట్‌కు వచ్చి 3 రోజులైనా కొనే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో బస్తాలు పెట్టుకున్నందుకు కిరాయి వసూలు చేస్తున్నారంటూ మార్కెట్ మీద దాడికి సిద్ధమయ్యారు. వారికి పలువురు రైతు సంఘం నాయకులూ మద్దతు పలికారు. కానీ మార్కెట్లో నే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. కొందరు రైతులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్ మిర్చికి గరిష్ట ధర రూ.4 వేలు, కనిష్ట ధర రూ.2,500తో కొనుగోళ్లు సాగించారు. మూడు రోజులుగా మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌లు రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడమే తప్ప.. వ్యాపారులు మిర్చికి తక్కువ ధరే ఇస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. రైతు సంఘం నాయకులపై కేసు నమోదు వరంగల్ మిర్చి మార్కెట్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత, పోలీసు పహారా మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని శుక్రవారం ఆందోళన చేసిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇంతేజార్గంజ్ స్టేషన్‌కు తరలించారు. జేఏసీ నాయకులు పెద్దారపు రమేష్, చల్ల నర్సిం హారెడ్డి, ఎం.మల్లయ్య, ఎరుకల రాజన్న, అ జ్మీరా సారయ్య, మేకల మొగిలి, సారయ్య తది తరుల మీద కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొడుతూ, దాడికి ఉసిగొల్పుతున్నందున రైతు జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశామని.. రైతులెవరి మీదా కేసులు పెట్టలేదని ఏసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అయితే తాము మార్కెట్లో ఎలాంటి గొడవలకు పాల్పడలేదని, అయినా అన్యాయంగా అరెస్టు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు. జాడలేని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈనెల 3వ తేదీ నుంచే మద్దతు ధరకు మిర్చి కొనుగోళ్లు మొదలవుతాయని ఆశపడిన రైతులకు మార్కెట్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దానిపై ఆదేశాలు రాలేదని పాలక వర్గం, అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మే చివరి వరకు మరో వారం రోజులు సెలవులు ఉంటాయి. అంటే మిగిలిన 15 రోజుల్లోనే మద్దతు ధరతో రైతుల వద్దనున్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా.. అసలు రైతులకు మద్దతు ధర అందుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రశ్నిస్తే పట్టుకెళ్తున్నారు మద్దతు ధర గురించి అడిగినా, 3 రోజుల నుంచి కొను గోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నామని తెలిపినా పోలీసులు వినడం లేదు. దేని గురించి ప్రశ్నించినా పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంత అన్యాయమా? మరి మా ఇబ్బం దులను ఎవరికి చెప్పుకోవాలి? – పొంచిక సతీశ్, చిట్యాల, మిర్చి రైతు సగం సచ్చిన రైతుల్ని పూర్తిగా సంపుతరా? మిర్చి అమ్ముకోని స్తలేరు.. దాచుకో నిస్తలేరు.. మద్దతు ధర పెడ్తలేరు. అడిగితే పోలీసులు పట్టుకెళ్తున్నారు. మరేం చేయాలి. మార్కె ట్‌కు మిర్చిని తీసుకొచ్చి ఉత్త పుణ్యానికి (ఫ్రీగా) దానం చేసి పొమ్మంటే అలాగే చేస్తాం. సగం సచ్చిన రైతులను పూర్తిగా సంపుతరా.. – బొర్ర శంకర్, గణపురం, మిర్చి రైతు -
మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట అమ్మకాల విషయంలో రైతులకు కనీస ధరను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రైతుల కష్టాలకు సీఎం కేసీఆర్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావులే బాధ్యత వహించాలన్నారు. టీఆర్ఎస్కు రాజకీయ లబ్ధి తప్ప, రైతుల సంక్షేమం పట్టడం లేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. మిర్చి రైతులను ఆదు కునేందుకు తీసుకున్న చర్య ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కు అతీతంగా అందరినీ కలుపుకొని రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాల ని సూచించారు. మార్కెట్లో క్వింటాల్ మిర్చి రూ.6 వేలకు అమ్ముడుపోతుంటే, కేంద్రం అంతకంటే తక్కువగా రూ.5వేలు ధర నిర్ణయించిందంటున్న హరీశ్‌రావు మార్కెట్‌పై అవగాహన లేకుండా అసత్యాలు మాట్లాడుతు న్నారని అన్నారు. మార్కెట్లో మిర్చిని క్వింటాలుకు రూ.3 వేలకు కూడా కొనే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చేస్తున్న విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. నేడు ఖమ్మం, వరంగల్‌లలో కలెక్టర్లకు వినతిపత్రాలు మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు పార్టీ జిల్లా శాఖలు వినతిపత్రాలను సమర్పిస్తాయని లక్ష్మణ్ తెలిపారు. -
కేంద్రానిది పనికిమాలిన నిర్ణయం
♦ మిర్చి కొనుగోళ్ల ప్రకటనపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం ♦ కేంద్రం ప్రకటించిన పథకం మిలీనియం జోక్ అని ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మిర్చి కొనుగోళ్లకు సంబంధించి అస్పష్ట నిర్ణయంతో రైతులకు శఠగోపం పెట్టిందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. సమస్యను కేంద్రం అర్థం చేసుకోలేదని, ఫలితంగా మిర్చి రైతులకు ఏమాత్రం మేలు చేయని, పనికిమాలిన నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్లతో కలసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం ప్రకటించిన పథకం ఓ మిలీనియం జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. మిర్చికి క్వింటాలుకు రూ. 5 వేల ధర ప్రకటించి నాణ్యత ఉన్న వెరైటీనే కొంటామనడం, అదీ 3 లక్షల 37వేల క్వింటాళ్లనే కొనుగోలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి రైతుల దగ్గర మిగిలిన 35 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేమిటని హరీశ్ ప్రశ్నించారు. తేజ రకం మిర్చికి మార్కెట్లో ఇప్పటికే రూ. 6 వేల నుంచి రూ. 6,500 దాకా ధర పలుకుతోందని, మరి కేంద్రం ఇచ్చే రూ. 5 వేలు రైతును ఆదుకోవడానికా లేక ముంచడానికా అని నిప్పులు చెరిగారు. మిర్చిని రూ. 10 వేలకు కొనాలని స్థానిక బీజేపీ నేతలు ధర్నాలు చేస్తుంటే కేంద్రం మాత్రం రూ. 5 వేలే ఇస్తానంటోందని ఎద్దేవా చేశారు. అడిగింది రూ.7 వేలు.. ఇస్తానన్నది రూ. 5 వేలు ‘‘ప్రభుత్వం తరఫున క్వింటాలుకు రూ. 7 వేలు అడిగితే కేంద్రం ఇస్తామన్నది ముష్టి రూ. 5 వేలు. మిర్చి ధరపై కేంద్రానికి రాష్ట్రం నుంచి ఎలాంటి వినతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడం దారుణం. మార్చి 30న ఎంపీ బి.వినోద్ కుమార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి వినతిపత్రం ఇచ్చారు. అదే నెల 31న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్ధసారథి కేంద్రానికి లేఖ రాశారు. ఏప్రిల్ 1న నేను స్వయంగా లేఖ రాశా. ఈ లేఖల్లో స్పష్టత లేదని దత్తాత్రేయ తాజాగా అనడం మరో అబద్ధం. ఏ అంశంలో స్పష్టత లేదో కేంద్రం రాష్ట్రాన్ని ఎందుకు వివరణ అడగలేదు? ఈ లేఖలపై స్పందించడానికి కేంద్రానికి నెల రోజులుగా తీరిక లేకుండా పోయిందా..’’ అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కేంద్రం స్పందన దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన పథకమే అస్తవ్యస్తంగా ఉందని, కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వబోమని, రాష్ట్రమే కొనుగోళ్ల భారం మోయాలనడం, చివర్లో ఏదో ఇస్తామనడం విచిత్రంగా ఉందన్నారు. చివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 20 కోట్లకు మించి రావని వివరించారు. కేంద్రం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన ఎన్డీయే మిర్చికి ఎందుకు మద్దతు ధరలు ఇవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కోల్డ్ స్టోరేజీ అనుమతుల కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా అతీగతీ లేదని, విపక్షాలు రైతు సమస్యలను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.7 వేలు ధర ప్రకటించండి రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.ఏడు వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రతి క్వింటాల్‌కు అదనపు ఖర్చుల కింద రూ.1,500 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు ఉంటుందని పేర్కొంది. గురువారం ఈ మేరకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద క్వింటాల్ మిర్చిని రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటనతో తెలంగాణ రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లలో నాణ్యమైన మిర్చి క్వింటాల్‌కు రూ.5 వేల పైనే ధర పలుకుతోందని తెలిపారు. కేంద్రం రూ.ఏడు వేలు చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రైతుల వద్ద ఇంకా 3 వేల మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వలున్నాయని, కేంద్రం కేవలం 33,700 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసేలా మొదటి, రెండో రకం మిర్చి మొత్తం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
అమ్ముకున్నవారికీ ‘మద్దతు’ ఇవ్వాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం కనీసం క్వింటాలు మిర్చికి రూ.10 వేలు ఇవ్వాల్సిందన్నారు. మిర్చి పంటను కొనుగోలు చేయ లేని అసమర్థత నుంచి, దృష్టి మళ్లించడానికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులను పెట్టిందని ఆరోపించారు. -
ప్రభుత్వ చేతగానితనం వల్లే...
రైతు సమస్యలపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మిర్చి కొనుగోలులో ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన నేప థ్యంలో కేంద్రం తీసుకున్న చొరవ రైతుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ముందుకు రాగా, దానిని కూడా టీఆర్ఎస్ ఫ్రభు త్వం రాజకీయం చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగసభల కోసం వ్యాపారుల నుంచి పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేసి రైతులను గాలికొదిలేశారన్నారు. తాను శుక్రవారం ఖమ్మం మార్కెట్‌యార్డును సందర్శించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. -
క్వింటాల్ పది వేలకు కొనాలి
మిర్చికి కనీస మద్దతు ధరపై తమ్మినేని సాక్షి, హైదరాబాద్: మిర్చి కనీస ధర క్వింటాల్‌కు రూ.10 వేలుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఇందులో కేంద్రం రూ.8వేలు, రాష్ట్రం రూ.2వేలు భరించాలని సూచిం చారు. మే 31గడువును ఎత్తేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లో ఉచితంగా మిర్చి పంట నిల్వ చేసుకునే సదుపాయాలు కల్పించి, క్వింటాల్‌కు రూ.8వేలు వడ్డీ లేని రుణమివ్వాలన్నారు. కేంద్రం బుధవారం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.5 వేలు ధర ఏ మూలకు సరిపోదన్నారు. మిర్చి రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచు లాడుతూ వ్యాపారుల దోపిడికి అవకాశం కల్పించాయని ధ్వజమెత్తారు.