మళ్లీ మిర్చి మంట
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మళ్లీ ఉద్రిక్తత
వరంగల్ సిటీ: ప్రభుత్వాలు మద్దతు ధర అందేలా చూస్తామని ప్రకటించినా మిర్చికి తక్కువ ధరలే అందుతుండడంతో రైతులు మళ్లీ కన్నెర్ర చేశారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళన చేశారు. మార్కెట్‌కు వచ్చి 3 రోజులైనా కొనే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో బస్తాలు పెట్టుకున్నందుకు కిరాయి వసూలు చేస్తున్నారంటూ మార్కెట్ మీద దాడికి సిద్ధమయ్యారు. వారికి పలువురు రైతు సంఘం నాయకులూ మద్దతు పలికారు. కానీ మార్కెట్లో నే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. కొందరు రైతులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్ మిర్చికి గరిష్ట ధర రూ.4 వేలు, కనిష్ట ధర రూ.2,500తో కొనుగోళ్లు సాగించారు. మూడు రోజులుగా మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌లు రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడమే తప్ప.. వ్యాపారులు మిర్చికి తక్కువ ధరే ఇస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.
రైతు సంఘం నాయకులపై కేసు నమోదు
వరంగల్ మిర్చి మార్కెట్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత, పోలీసు పహారా మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని శుక్రవారం ఆందోళన చేసిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇంతేజార్‌గంజ్ స్టేషన్‌కు తరలించారు. జేఏసీ నాయకులు పెద్దారపు రమేష్, చల్ల నర్సిం హారెడ్డి, ఎం.మల్లయ్య, ఎరుకల రాజన్న, అ జ్మీరా సారయ్య, మేకల మొగిలి, సారయ్య తది తరుల మీద కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొడుతూ, దాడికి ఉసిగొల్పుతున్నందున రైతు జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశామని.. రైతులెవరి మీదా కేసులు పెట్టలేదని ఏసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అయితే తాము మార్కెట్లో ఎలాంటి గొడవలకు పాల్పడలేదని, అయినా అన్యాయంగా అరెస్టు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు.
జాడలేని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు
ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈనెల 3వ తేదీ నుంచే మద్దతు ధరకు మిర్చి కొనుగోళ్లు మొదలవుతాయని ఆశపడిన రైతులకు మార్కెట్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దానిపై ఆదేశాలు రాలేదని పాలక వర్గం, అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మే చివరి వరకు మరో వారం రోజులు సెలవులు ఉంటాయి. అంటే మిగిలిన 15 రోజుల్లోనే మద్దతు ధరతో రైతుల వద్దనున్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా.. అసలు రైతులకు మద్దతు ధర అందుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది.
ప్రశ్నిస్తే పట్టుకెళ్తున్నారు
మద్దతు ధర గురించి అడిగినా, 3 రోజుల నుంచి కొను గోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నామని తెలిపినా పోలీసులు వినడం లేదు. దేని గురించి ప్రశ్నించినా పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంత అన్యాయమా? మరి మా ఇబ్బం దులను ఎవరికి చెప్పుకోవాలి?
– పొంచిక సతీశ్, చిట్యాల, మిర్చి రైతు
సగం సచ్చిన రైతుల్ని పూర్తిగా సంపుతరా?
మిర్చి అమ్ముకోని స్తలేరు.. దాచుకో నిస్తలేరు.. మద్దతు ధర పెడ్తలేరు. అడిగితే పోలీసులు పట్టుకెళ్తున్నారు. మరేం చేయాలి. మార్కె ట్‌కు మిర్చిని తీసుకొచ్చి ఉత్త పుణ్యానికి (ఫ్రీగా) దానం చేసి పొమ్మంటే అలాగే చేస్తాం. సగం సచ్చిన రైతులను పూర్తిగా సంపుతరా..
– బొర్ర శంకర్, గణపురం, మిర్చి రైతు