Warangal Agricultural Market
-
పదేళ్ల తర్వాత జిల్లాలో పులుల సంచారం!
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ.. పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్‌గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పోటెత్తిన పత్తి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి పోటెత్తింది. రైతులు విక్రయించడానికి 30 వేల బస్తాలకు పైగా పత్తిని తీసుకురావడంతో యార్డు కిటకిటలాడింది. ఈ సీజన్లో ఇంత సరుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా 2 రోజులు సెలవులు, పత్తిలో కొంత తేమ తగ్గడంతో భారీగా పత్తి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే సరుకు అధికంగా రావడం తో ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న క్వింటాలుకు గరిష్ట ధర రూ.5,000 ఉండగా రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గరిష్ట ధర నిర్ణయించినప్పటికీ ఎక్కువ పత్తిని రూ.4,400 నుంచి రూ.3,500 ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘ఎక్కువ ధర పెట్టలే సీసీఐ దగ్గరకు పోండి’ అని వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5,555తో కొనుగోలు చేయడానికి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఈనెల 7 నుంచి 23 వరకు 9340.55 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లిస్తున్నారు. -
పత్తి రైతుకు శరాఘాతం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 13,504 క్వింటాళ్ల పత్తి రాగా, అందులో మూడో వంతు అంటే 4,193 క్వింటాళ్ల పత్తికి రూ.3,800 లోపే ధర పలికింది. గతేడాది ఇదే నెల 26న వరంగల్ మార్కెట్లో అత్యంత తక్కువగా రూ.4,400 ధర పలికింది. అది కనీస మద్దతుధర (ఎంఎస్పీ) కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. తడిసిన పత్తిని ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.4,320 ఉండగా, వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ప్రమాణాలు లేకే ధర పతనం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేకచోట్ల పత్తి తడిసిపోవడం, తేమ శాతం ఎక్కువ ఉండటంతో పత్తి ధర పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడిసిన పత్తికి ఎంఎస్పీ ఇచ్చే పరిస్థితి ఉండదని వ్యాపారులు, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 8 శాతం తేమ ఉంటే పత్తి క్వింటాల్‌కు రూ.4,320కు, 9 శాతం ఉంటే రూ.4,277కు, 10 శాతముంటే రూ.4,234, 11 శాతం తేమ ఉంటే రూ.4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ.4,147కు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం వర్షాల కారణంగా అనేకచోట్ల 20 శాతం వరకు తేమ ఉండటం, తడిసిపోవడంతో వ్యాపారులు అత్యంత తక్కువకు కొంటున్నారు. ప్రమాణాల ప్రకారం పత్తి లేకుంటే సీసీఐ కూడా కొనుగోలు చేయదు. కాబట్టి ఆ మేరకు రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఒక్క రోజు 45 వేల క్వింటాళ్లు కొనుగోలు రాష్ట్రంలో ఈ నెల 16న 45,151 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. ఆ రోజు పత్తికి గరిష్టంగా రూ.3,680 నుంచి రూ.5,010 ధర పలికినట్లు ఆ శాఖ ఒక నివేదికలో తెలిపింది. గజ్వేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3,680 ధర పలుకగా, కనిష్టంగా రూ.3,100 ధర పలికింది. సరాసరి ఆ మార్కెట్లో రూ.3,500 ధర పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లో అదే రోజు గరిష్టంగా ఎంఎస్పీ కంటే ఎక్కువగా రూ.4,580 పలుకగా, కనిష్టంగా రూ. 4,030 ధర పలికింది. సరాసరి ఎంఎస్పీ కంటే తక్కువగా రూ.4,259 ధర పలికింది. అదే రోజు వరంగల్ మార్కెట్లో గరిష్ట ధర ఎంఎస్పీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. గరిష్ట ధర రూ.5,010 పలుకగా, కనిష్ట ధర రూ.3,600 పలికింది. సరాసరి అక్కడ రూ.4,500 పలికింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. ఇదిలావుండగా రాష్ట్రంలో మంగళవారం నాటికి సీసీఐ ఆధ్వర్యంలో 20 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. -
మళ్లీ మిర్చి మంట
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మళ్లీ ఉద్రిక్తత వరంగల్ సిటీ: ప్రభుత్వాలు మద్దతు ధర అందేలా చూస్తామని ప్రకటించినా మిర్చికి తక్కువ ధరలే అందుతుండడంతో రైతులు మళ్లీ కన్నెర్ర చేశారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేశారు. మార్కెట్‌కు వచ్చి 3 రోజులైనా కొనే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో బస్తాలు పెట్టుకున్నందుకు కిరాయి వసూలు చేస్తున్నారంటూ మార్కెట్ మీద దాడికి సిద్ధమయ్యారు. వారికి పలువురు రైతు సంఘం నాయకులూ మద్దతు పలికారు. కానీ మార్కెట్లో నే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. కొందరు రైతులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్ మిర్చికి గరిష్ట ధర రూ.4 వేలు, కనిష్ట ధర రూ.2,500తో కొనుగోళ్లు సాగించారు. మూడు రోజులుగా మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌లు రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడమే తప్ప.. వ్యాపారులు మిర్చికి తక్కువ ధరే ఇస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. రైతు సంఘం నాయకులపై కేసు నమోదు వరంగల్ మిర్చి మార్కెట్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత, పోలీసు పహారా మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని శుక్రవారం ఆందోళన చేసిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇంతేజార్గంజ్ స్టేషన్‌కు తరలించారు. జేఏసీ నాయకులు పెద్దారపు రమేష్, చల్ల నర్సిం హారెడ్డి, ఎం.మల్లయ్య, ఎరుకల రాజన్న, అ జ్మీరా సారయ్య, మేకల మొగిలి, సారయ్య తది తరుల మీద కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొడుతూ, దాడికి ఉసిగొల్పుతున్నందున రైతు జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశామని.. రైతులెవరి మీదా కేసులు పెట్టలేదని ఏసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అయితే తాము మార్కెట్లో ఎలాంటి గొడవలకు పాల్పడలేదని, అయినా అన్యాయంగా అరెస్టు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు. జాడలేని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈనెల 3వ తేదీ నుంచే మద్దతు ధరకు మిర్చి కొనుగోళ్లు మొదలవుతాయని ఆశపడిన రైతులకు మార్కెట్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దానిపై ఆదేశాలు రాలేదని పాలక వర్గం, అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మే చివరి వరకు మరో వారం రోజులు సెలవులు ఉంటాయి. అంటే మిగిలిన 15 రోజుల్లోనే మద్దతు ధరతో రైతుల వద్దనున్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా.. అసలు రైతులకు మద్దతు ధర అందుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రశ్నిస్తే పట్టుకెళ్తున్నారు మద్దతు ధర గురించి అడిగినా, 3 రోజుల నుంచి కొను గోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నామని తెలిపినా పోలీసులు వినడం లేదు. దేని గురించి ప్రశ్నించినా పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంత అన్యాయమా? మరి మా ఇబ్బం దులను ఎవరికి చెప్పుకోవాలి? – పొంచిక సతీశ్, చిట్యాల, మిర్చి రైతు సగం సచ్చిన రైతుల్ని పూర్తిగా సంపుతరా? మిర్చి అమ్ముకోని స్తలేరు.. దాచుకో నిస్తలేరు.. మద్దతు ధర పెడ్తలేరు. అడిగితే పోలీసులు పట్టుకెళ్తున్నారు. మరేం చేయాలి. మార్కె ట్‌కు మిర్చిని తీసుకొచ్చి ఉత్త పుణ్యానికి (ఫ్రీగా) దానం చేసి పొమ్మంటే అలాగే చేస్తాం. సగం సచ్చిన రైతులను పూర్తిగా సంపుతరా.. – బొర్ర శంకర్, గణపురం, మిర్చి రైతు -
మెరిసిన ఎర్ర బంగారం
క్వింటాకు రూ.18వేల ధరతో రికార్డు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చికి రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా దేశి(టమాటా, దొడ్డు) రకం మిర్చికి పలికిన ధరతో రైతుల్లో ఆనం దం వెల్లువెత్తుతోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు గురువారం భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్యపల్లెకి చెందిన రైతు పి.సంపత్ మొదటిసారి చేతికొచ్చిన దేశీ రకం మిర్చిని 13బస్తాల్లో భగవాన్ అడ్తికి తీసుకువచ్చాడు. ఈ మిర్చిని ఖరీదు దారుడు రాంగణేష్ క్వింటాకు రూ.18వేలతో కొనుగోలు చేశాడు. గతంలో మార్కెట్ చరిత్రలోనే ఏ రకం మిర్చికి కూడా ఈ ధర పలికిన దాఖ లాలు లేవని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 2013లోనే అత్యధికం దేశీ రకం మిర్చి క్వింటాకు వరంగల్ మార్కెట్లో 2013 సంవత్సరంలో రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెబుతున్నా రు. ఇక గత సంవత్సరం దేశీ రకం మిర్చికి రూ.12వేల ధర పలకగా, అంతకుముందు ఏడాది రూ.13వేల ధర పలికింది. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారంలో మాత్రమే అమ్మకానికి వచ్చే దేశి రకం మిర్చి ఈసారి 15రోజుల ముం దే రావడం.. అత్యధిక ధర పలక డం విశేషం. ఈ సంవత్సరం వర్షాభావంతో పాటు చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి తగ్గుతుందని భావి స్తుం డగా.. ధర మాత్రం మెరుగుగా ఉండడంతో రైతు ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నేను ఉహించలేదు... మా గ్రామంలో రైతులందరం దేశీ రకం మిర్చి పండిస్తాం. ముందుగా మార్కెట్‌కు వస్తే మంచి ధర పలుకుతుందని అందరికీ తెలుసు. కానీ క్వింటాల్‌కు రూ.18వేలు పలుకుతుందని మాత్రం నాతో పాటు ఎవరూ ఊహించలేదు. గతంలో మా ఊరి రైతు తెచ్చిన మిర్చి క్వింటాకు రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెప్పుకుంటున్నారు. ఇక నుంచి నాకు లభించిన ధరే రికార్డుగా చెబుతారు. - పి.సంపత్, పుల్లూరు రంగయ్యపల్లె -
ఆ‘పత్తి’ తీరేనా?
నేటి నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ప్రారంభంకానున్న కొనుగోళ్లు సెలవు రోజుల్లో మిల్లుల వద్దపత్తి కొనుగోళ్లు భారీగా తరలిరానున్న పత్తి కొనుగోళ్లు సాఫీగా జరగాలని రైతుల ఆకాంక్ష వరంగల్ సిటీ : వారం రోజుల పండుగ సెలవులు పూర్తయ్యూరుు. నేటి(సోమవారం) నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవనున్నారుు. ఇప్పటిదాకా కొనుగోళ్లు జరిగిన తీరు రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. యంత్రాలు, సామగ్రి, సిబ్బంది, అధికారులు ఇలా అందరూ అందుబాటులో ఉన్నా..పత్తి కొనుగోళ్లు కనీస అంచనాలను అందుకోవడం లేదు. దీంతో సీసీఐ సేవల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయూరైంది. ఈనెల 1న సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 81వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా, సీసీఐ అధికారులు కేవలం 676 క్వింటాళ్లే కొన్నారు. దీన్ని బట్టి కొనుగోళ్లలోని వైఫల్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. నేటి నుంచి జరిగే కొనుగోళ్లైనా సాఫీగా జరగాలని రైతులు కోరుకుంటున్నారు. పెద్దఎత్తున పత్తి మార్కెట్‌కు తరలిరానుంది. మార్కెట్‌కు లూజు పత్తి కాకుండా ప్రతిరోజూ కనీసం 40 నుంచి 60 వేల పైచిలుకు పత్తి బస్తాలు అమ్మకానికి రానున్నట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కావాలని ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్ల నుంచి తప్పుకున్నా, తక్కువ ధరతో కొనుగోళ్లు చేపట్టినా మళ్లీ గొడవలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. నామమాత్రంగా ‘సీసీఐ’ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 84 సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.4100 ధరకు పత్తి కొంటామని ప్రకటించింది. అరుునా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్లే ప్రారంభమయ్యాయి. వీటిలో నామమాత్రంగా నడుస్తున్నవి 6 సెంటర్లు. మిగతా 4 సెంటర్లను తూతూమంత్రంగా నడిపిస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రకటించే నిర్ణయూల అమలులో క్షేత్రస్థారుులో జరుగుతున్న వైఫల్యానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. చెక్‌పోస్టుల్లో వసూళ్ల దందా.. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక..రోజుకు 15 నుంచి 20 లారీల పత్తి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇక సెలవురోజుల్లో పత్తి మిల్లుల వద్ద బ్రోకర్లు కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది పత్తి లోడ్లు తరలివెళ్లేందుకు సహకరిస్తున్నారు. ప్రతీ చెక్‌పోస్టు వద్ద రూ.2500 నుంచి రూ.3000 ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కమర్షియల్ ట్యాక్స్ రూపేణా వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతోంది. కాగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పత్తికి క్వింటాలుకు రూ.4500 నుంచి రూ.4800 ధర పలుకుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారుు. అందుబాటులోకి మరిన్ని తేమ యంత్రాలు సెలవుల అనంతరం వరంగల్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి రాానున్నదనే సమాచారంతో మార్కెట్ కార్యదర్శి మరో 5 తేమను కొలిచే యంత్రాలను తెప్పించారు. ఇప్పటికే తేమ శాతాన్ని కొలిచే 10 చిన్న మిషన్లు, 5 పెద్ద మిషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి సీసీఐ పత్తి కొనుగోళ్లను భారీ ఎత్తున చేపడుతోందని, మార్కెట్లో ప్రత్యేకంగా 6 వే బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీసీఐ కోసం ప్రత్యేక పత్తి యార్డును ఏర్పాటు చేశారు. కానీ సీసీఐ మాత్రం అంచనాలకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లను చేపట్టడం లేదు. రైతులకు మద్దతు ధర అందించక తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ మార్కెట్లో.. శర్మ ఔట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్ల కోసం 2 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రధాన ఇన్చార్జి అధికారిగా ఆర్కే శర్మను నియమించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో మార్కెట్ వెనుకంజకు ఆయనే కారణమనే ఆరోపణలున్నారుు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి కారణంగా పెద్ద ఎత్తున పత్తి నిల్వలు లారీలలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక వరంగల్ మార్కెట్లో సీసీఐ ఇన్చార్జిగా సేవలందిస్తున్న శర్మ ప్రస్తుత పరిస్థితులను చూసి ఈ సారి లాభాలు గడించే అవకాశం లేదని నిర్ణయించుకొని సెలవు రోజుల్లో స్వయంగా వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో వరంగల్ మార్కెట్‌కు ఇన్చార్జి అధికారిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. ఈ క్రమంలో సీసీఐ వరంగల్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు మరీ కష్టంగా మారారుు. -
పత్తి రైతుల ఆగ్రహం
ఈ-మార్కెటింగ్ విధానం వద్దని దాడి ఫర్నిచర్, కంప్యూటర్లు, కేబిన్లు ధ్వంసం పోలీసుల బందోబస్తుతో తప్పిన ప్రమాదం పత్తి రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యూరుు. ఈ-మార్కెటింగ్ విధానం కోసం తయారు చేసిన కేబిన్లు రైతుల చేతిలో తునాతునకలయ్యాయి. అధికారులు, పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది.. - వరంగల్ సిటీ వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా ఈ-మార్కెటింగ్ (ఆన్లైన్ క్రయవిక్రయాలు) కొనసాగుతున్నారుు. రోజు కొందరు ఖరీదుదారులు తక్కువగా పత్తికి ధరను కోట్ చేస్తూ రైతులను రెచ్చగొట్టి గొడవకు ప్రయత్నిస్తున్నారు. వీరికి అడ్తిదారులు, హమాలీ, దడువాయి, గుమాస్తాలు సహకరిస్తున్నారు. ఏ విధంగానైనా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ-మార్కెటింగ్ విధానం అమలుకాకుండా వ్యాపార, కార్మిక వర్గాలు సర్వ ప్రయత్నం చేస్తున్నాయి. బుధవారం మార్కెట్‌కు 7,311పత్తి బస్తాలు రాగా, 1,114 లాట్లను ఏర్పాటు చేశారు. ఇం దులో పాత పత్తికి క్వింటాల్‌కు రూ.4,389 పలుకగా, కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.4,255 పలికింది. 2 వేల బస్తాలకు గరిష్ట ధర నిర్ణయించి మిగతా 5 వేల బస్తాలకు రూ.800 నుంచి రూ.2000, రూ.2500 లోపే ధరను కోట్ చేశారు. దీంతో తక్కువ ధర పలికిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తీసుకొచ్చిన పత్తిని మార్కెట్ కార్యాలయం ఎదుట వేసి అధికారులతో గొడవకు దిగారు. దీంతో రైతులు కావాలనే వరంగల్ మార్కెట్లో ఈ-మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి అందరూ కుమ్మక్కై రైతులను ముంచుతున్నారని కార్యాలయంపై దాడికి దిగారు. మార్కెట్ కార్యాలయంలోని కంప్యూటర్లు, మానిటర్లు, కీ-బోర్డులు, సీపీయూలను ధ్వంసం చేశారు. తలుపులు, కిటికీలను రాళ్లతో పగులగొట్టారు. కుర్చీలను నేలకేసి కొట్టారు. తగలబెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటడంతో మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజు, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇక ఈ-మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కేబిన్లను కొందరు గుమస్తాలు దగ్గర ఉండి ధ్వంసం చేయించారు. కొందరూ గుమస్తాలు కూడా దాడుల్లో పాల్గొనడం విశేషం. పోలీసుల భారీ బందోబస్తు విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో మార్కెట్లోకి వచ్చారు. అప్పటికే ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉన్నా, రైతులను ఆపడం వారి నుంచి కాలేదు. దీంతో అడిషనల్ ఎస్పీ యాదయ్య, ఇద్దరు ఏసీపీలు సురేంద్రనాథ్, మహేందర్‌లు, ఆర్డీఓ వెంకటమాధవరావు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ జేడీ, వరంగల్ తహసీల్దార్లు మార్కెట్‌కు చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అప్పటికే పత్తి కార్యాలయం వద్ద ఆగ్రహంతో ఉన్న రైతులు ఎవరి మాట వినకుండా ఈ -మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేసి, ఎప్పటిలాగే బహిరంగ మార్కెట్‌ను నిర్వహించాలని, లేదంటే వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. వర్గ విభేదాలు బహిర్గతం జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమక్షంలో జరిగిన చర్చల్లో అడ్తి, ట్రేడర్స్ మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ క్రమంలో జేసీ ట్రేడర్స్ ప్రతినిధి వీరారావుతో పత్తి కొనుగోళ్లలో కావాలని కొందరు ట్రేడర్స్ మరీ తక్కువ ధరను కోట్ చేసి రైతు అల్లర్లకు కారణమవుతున్నారని, కనీస ధర క్వింటాల్‌కు రూ.3,500 కంటే తక్కువ వేయకుండా చూడాలని సూచించారు. దీనికి వీరారావు సమాధానం చెబుతూ, తక్కువ కోట్ చేసింది ట్రేడర్స్ కాదని, కావాలని అడ్తిదారులు కొందరు లెసైన్స్ లేని వ్యాపారులతో తక్కువ ధరకు కోట్ చేయించి, ట్రేడర్స్‌ను బదనాం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాము వివరాలతో సహా మార్కెట్ అధికారులకు తెలియజేయడం జరిగిందని తె లిపారు. ఈ మార్కెటింగ్ విధానం తమకు పూర్తిగా ఆమోదయోగ్యమని, ఇందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. అయితే అడ్తి సెక్షన్ ప్రతినిధి జేకే.లింగారెడ్డి మాత్రం ఇది అన్యాయమని, తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, తాము రైతులకు, ట్రేడర్లకు మధ్యవర్తులుగా ఉంటూ రైతులకు మంచి ధర రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఖరీదుదారులే కావాలని తక్కువ ధరకు కోట్ చేస్తూ రైతులను, అడ్తిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొందరు ఖరీదుదారులు, కొందరు అడ్తిదారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన జేసీ ప్రస్తుతం ఆరోపణలకు సమయం కాదని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిగిలిన పత్తిని కొనుగోలు చేసిన అనంతరం సాయంత్రం అందరం కలసి పత్తి కొనుగోళ్లపై చర్చిద్దామని తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎప్పటి నుంచి కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని, వీలైనంత తొందరలో సీసీఐ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ అధికారి శర్మకు సూచించారు. తేమశాతంపై చర్చ సీసీఐ అధికారి శర్మతోపాటు అడ్తి, ఖరీదుదారులు రైతులు తెచ్చే పత్తిలో తేమ శాతంపై చర్చించారు. మార్కెట్లో తేమ శాతాన్ని గుర్తించడానికి తగినన్ని మిషన్లు లేవని, తేమశాతాన్ని నిర్ధారించే గ్రేడర్లు కూడా అందుబాటులో లేరని జేసీకి తెలిపారు. ఈ క్రమంలో మార్కెట్ కార్యదర్శి రాజు తేమ శాతాన్ని నిర్ధారించే ఐదు పెద్ద మిషన్లు, పది చిన్న మిషన్లు, అందుబాటులో ఉన్నాయని వివరించారు. తేమ శాతం 12 లోపు ఉంటే తాము పత్తిని కొనుగోలు చేయడానికి అభ్యంతరం లేదని ట్రేడర్స్ తెలుపగా, ప్రస్తుతం తేమ శాతం పత్తిలో అధికంగానే ఉంటుందని, తేమ శాతం సాకుతో పత్తిని కొనుగోలు చేయకుండా తక్కువ ధర నిర్ణయించడం కరెక్టు కాదని అడ్తిదారులు వాదించారు. దీంతో జేసీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పత్తి కొనుగోళ్లను పూర్తి చేసి, సాయంత్రం చర్చల్లో తేమశాతం, ఈ-మార్కెట్ విధానంపై మాట్లాడుతామని తెలిపి, ప్రస్తుతం మాత్రం మార్కెట్లో మిగిలిన పత్తి కొనుగోళ్లను పూర్తి చేయాలని అడ్తి, వ్యాపారులకు సూచించి, క్రయ విక్రయాలు జరిగేవిధంగా ఏర్పాట్లు చేసి వెళ్లిపోయారు. జేసీ మాట బేఖాతర్ జేసీతో చర్చల్లో పాల్గొన్న అడ్తి, ట్రేడర్స్ మార్కెట్లో తక్కువ ధర పలికిన పత్తిని వెంటనే కొనుగోలు చేసి, సాయంత్రంలోపు రైతులను ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చారు. కానీ, మార్కెట్ అధికారులు ఎంత బతిలాడినా ఖరీదుదారులు అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేది లేక మార్కెట్లో ఉన్న పత్తి బస్తాలను షెడ్లలోకి మార్చి రైతులు భద్రపరచుకున్నారు. గురువారం మిగిలిన పత్తికి ధర నిర్ణయించి కొనుగోలు చేపట్టనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
చేయి తడిపితే.. ‘పరీక్ష’ లేదు!
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్‌తో పాటు జేసీ సందర్శించి 24గంటలు కూడా కాలేదు... వారు సీసీఐ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, ఇచ్చిన సూచనల అమలు మాటేమో కానీ... తాజాగా సీసీఐ గుమస్తాల చేతివాటం వెలుగు చూసింది. రైతులు తీసుకొచ్చే పత్తిని సక్రమంగా కొనుగోలు చేయాలని, తేమ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్న అధికారుల ఆదేశాలు అమలుకు నోచుకోని వైనం కూడా బయటపడింది. సీసీఐ గుమస్తాలపై పర్యవేక్షణ కరువవడంతో వారు ఆ డిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. వారి వైఖరి కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. డబ్బు ఇస్తే ఓకే... వరంగల్ మార్కెట్‌కు శుక్రవారం 15వేల బస్తాల వరకు పత్తి అమ్మకానికి రాగా, 80కి పైగా వాహనాల్లో లూజ్ పత్తిని రైతులు తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చే పత్తిని ఎక్కువ భాగం సీసీఐ అధికారులే కొనుగోలు చేయాలన్న ఉన్నతాధికారులను ఆదేశాలతో అధికారులు గుమస్తాలను శుక్రవారం గేట్ వద్దే మొహరించారు. వచ్చిన వాహనాల్లోని పత్తి తేమ శాతాన్ని అక్కడికక్కడే పరీక్షించడం, దాని ప్రకారం ధర ఖరారు చేసి సీసీఐ లీజ్‌కు తీసుకున్న మిల్లులకు పంపడం ప్రారంభించారు. ఇక్కడే గుమస్తాలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. లూజ్ పత్తి తీసుకొచ్చిన రైతుల్లో ఎవరైనా తమకు డబ్బులు ఇస్తే తేమ శాతాన్ని తక్కువగా నమోదు చేసి ధర ఖరారు చేస్తుండడాన్ని కొందరు రైతులు గుర్తించారు. కొన్ని వాహనాల్లో 30 శాతం తేమ ఉన్నా క్వింటాల్‌కు రూ.4010గా ధర నిర్ణయించడం, కొన్ని వాహనాల్లో 15లోపు తేమ శాతం ఉన్నా డబ్బు ఇవ్వని పక్షంలో క్వింటాల్‌కు రూ.3800గా ధర నిర్ణయించడంతో పాటు పలువురు రైతులు గుమస్తాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్కెట్ గ్రేడ్-2 కార్యదర్శి రాహుల్ వెంకట్‌కు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్నారు. మరోసారి రైతులు వాహనాల్లో తీసుకొచ్చిన పత్తి తేమ శాతాన్ని పరీక్షించడంతో రైతులు శాంతించారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు మార్కెట్‌ను సందర్శించి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిరంతరం మార్కెట్, సీసీఐ ఉద్యోగుల తీరుపై నిఘా ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. -
నిలిచిన పత్తి క్రయవిక్రయాలు
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సుమారు మూడు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీసీఐ అధికారులు తమను సంప్రదించకుండా దళారులు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చిన లూజు, ఇతర పత్తిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్తిదారులు, వ్యాపారులు పత్తి క్రయవిక్రయాలను బహిష్కరించారు. అంతేకాకుండా హమాలీ, గుమస్తాలు కూడా సీసీఐ అధికారులకు సహకరించకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో సిబ్బంది, గుమస్తాలు లేక సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టక.. ఇటు వ్యాపారులు పట్టించుకోక పత్తి తీసుకొచ్చిన రైతులు నరకం అనుభవించారు. సీసీఐతో కొనిపించిన అధికారులు మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెటిగ్ జాయింట్ డెరైక్టర్ పి.సుధాకర్, కార్యదర్శి రాజులు స్థానిక డీఎస్పీ హిమవ తి సమక్షంలో చాంబర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మార్కెట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సమస్యలపై తర్వాత చర్చిద్దామని, తొలుత కొనుగోళ్లు కొనసాగించాలని అధికారులు కోరినా వ్యాపారులు ససేమిరా అన్నారు. ఇప్పటికే 40వేల పత్తి బస్తాలు మార్కెకు వచ్చినందున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించినా పట్టించుకోలేదు సరికదా.. హమాలీ, గుమస్తాలు క్రయవిక్రయాల్లో పాల్గొనకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అధికారులు చేసేదేం లేక.. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని సీసీఐ అధికారులను కోరారు. ఎంత రాత్రి అయినా తామందరం కొనుగోళ్లకు సహకరిస్తామని హామీ ఇచ్చి ఈ విషయాన్ని మార్కెట్లోని మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేయించారు. ఆ తర్వాత సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు కుదుటపడ్డారు. ఆ తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. -
రైతులపై ఎస్సై లాఠీచార్జ్
వరంగల్‌సిటీ, న్యూస్‌లైన్ : హోటల్లో భోజనం చేస్తూ మద్యం సేవిస్తున్న రైతులపై ఇంతేజార్గంజ్ ఎస్సై దాడికి పాల్పడిన సంఘటన సోమవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెం దిన రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు సోమవారం మార్కెట్‌కు వచ్చారు. అయితే క్రయ విక్రయాలు పూర్తికాగానే మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు కొంతమంది రైతులు మార్కెట్ సమీపంలోని హోటళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు రైతులు భోజనం చేస్తూ మద్యాన్ని సేవిస్తున్నారు. వీరితోపాటు మరికొంత మంది మార్కెట్ సమీపంలోని ఓ వైన్‌షాపు ఎదుట ఉన్న బిల్డింగ్‌పై కూర్చుని మద్యం తాగుతున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్గంజ్ ఎస్సై రవికిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి మార్కెట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా హోటళ్లు, మార్కెట్ ఎదుట ఉన్న బిల్డింగ్‌పై మద్యం సేవిస్తున్న రైతులను పట్టుకుని విపరీతంగా కొట్టారు. ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలా మద్యం సేవిస్తారని ఆగ్రహంతో ఊగిపోయి చితకబాదడంతో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మద్యం దుకాణాల యజమానులు, హోటళ్ల నిర్వాహకులను వదిలిపెట్టి తమను ఎందుకు కొడుతున్నారని రైతులు ఎస్సైని నిలదీశారు. హోటళ్లలో మద్యం సేవించేందుకు అనుమతి లేకుంటే తాము అక్కడికి వెళ్లేవారే కామంటూ ఆయనపై తిరగపడ్డారు. అనంతరం ఎస్సై దౌర్జన్యం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డుకుని సుమారు గంటపాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్గంజ్ సీఐ సతీష్‌బాబు, మట్టెవాడ సీఐ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. అనంతరం గాయపడిన రైతులను జీపులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, మార్కెట్‌కు వచ్చిన రైతులపై ఎస్సై దాడికి పాల్పడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.