ఈ-మార్కెటింగ్ విధానం వద్దని దాడి
ఫర్నిచర్, కంప్యూటర్లు, కేబిన్‌లు ధ్వంసం
పోలీసుల బందోబస్తుతో తప్పిన ప్రమాదం
పత్తి రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యూరుు. ఈ-మార్కెటింగ్ విధానం కోసం తయారు చేసిన కేబిన్లు రైతుల చేతిలో తునాతునకలయ్యాయి. అధికారులు, పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది.. - వరంగల్ సిటీ
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులుగా ఈ-మార్కెటింగ్ (ఆన్‌లైన్ క్రయవిక్రయాలు) కొనసాగుతున్నారుు. రోజు కొందరు ఖరీదుదారులు తక్కువగా పత్తికి ధరను కోట్ చేస్తూ రైతులను రెచ్చగొట్టి గొడవకు ప్రయత్నిస్తున్నారు. వీరికి అడ్తిదారులు, హమాలీ, దడువాయి, గుమాస్తాలు సహకరిస్తున్నారు. ఏ విధంగానైనా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ-మార్కెటింగ్ విధానం అమలుకాకుండా వ్యాపార, కార్మిక వర్గాలు సర్వ ప్రయత్నం చేస్తున్నాయి. బుధవారం మార్కెట్‌కు 7,311పత్తి బస్తాలు రాగా, 1,114 లాట్లను ఏర్పాటు చేశారు. ఇం దులో పాత పత్తికి క్వింటాల్‌కు రూ.4,389 పలుకగా, కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.4,255 పలికింది. 2 వేల బస్తాలకు గరిష్ట ధర నిర్ణయించి మిగతా 5 వేల బస్తాలకు రూ.800 నుంచి రూ.2000, రూ.2500 లోపే ధరను కోట్ చేశారు. దీంతో తక్కువ ధర పలికిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు తీసుకొచ్చిన పత్తిని మార్కెట్ కార్యాలయం ఎదుట వేసి అధికారులతో గొడవకు దిగారు. దీంతో రైతులు కావాలనే వరంగల్ మార్కెట్‌లో ఈ-మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి అందరూ కుమ్మక్కై రైతులను ముంచుతున్నారని కార్యాలయంపై దాడికి దిగారు. మార్కెట్ కార్యాలయంలోని కంప్యూటర్లు, మానిటర్లు, కీ-బోర్డులు, సీపీయూలను ధ్వంసం చేశారు. తలుపులు, కిటికీలను రాళ్లతో పగులగొట్టారు. కుర్చీలను నేలకేసి కొట్టారు. తగలబెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటడంతో మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజు, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇక ఈ-మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కేబిన్లను కొందరు గుమస్తాలు దగ్గర ఉండి ధ్వంసం చేయించారు. కొందరూ గుమస్తాలు కూడా దాడుల్లో పాల్గొనడం విశేషం.
పోలీసుల భారీ బందోబస్తు
విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో మార్కెట్‌లోకి వచ్చారు. అప్పటికే ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉన్నా, రైతులను ఆపడం వారి నుంచి కాలేదు. దీంతో అడిషనల్ ఎస్పీ యాదయ్య, ఇద్దరు ఏసీపీలు సురేంద్రనాథ్, మహేందర్‌లు, ఆర్‌డీఓ వెంకటమాధవరావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్ జేడీ, వరంగల్ తహసీల్దార్‌లు మార్కెట్‌కు చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అప్పటికే పత్తి కార్యాలయం వద్ద ఆగ్రహంతో ఉన్న రైతులు ఎవరి మాట వినకుండా ఈ -మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేసి, ఎప్పటిలాగే బహిరంగ మార్కెట్‌ను నిర్వహించాలని, లేదంటే వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు.
వర్గ విభేదాలు బహిర్గతం
జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమక్షంలో జరిగిన చర్చల్లో అడ్తి, ట్రేడర్స్ మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ క్రమంలో జేసీ ట్రేడర్స్ ప్రతినిధి వీరారావుతో పత్తి కొనుగోళ్లలో కావాలని కొందరు ట్రేడర్స్ మరీ తక్కువ ధరను కోట్ చేసి రైతు అల్లర్లకు కారణమవుతున్నారని, కనీస ధర క్వింటాల్‌కు రూ.3,500 కంటే తక్కువ వేయకుండా చూడాలని సూచించారు. దీనికి వీరారావు సమాధానం చెబుతూ, తక్కువ కోట్ చేసింది ట్రేడర్స్ కాదని, కావాలని అడ్తిదారులు కొందరు లెసైన్స్ లేని వ్యాపారులతో తక్కువ ధరకు కోట్ చేయించి, ట్రేడర్స్‌ను బదనాం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాము వివరాలతో సహా మార్కెట్ అధికారులకు తెలియజేయడం జరిగిందని తె లిపారు. ఈ మార్కెటింగ్ విధానం తమకు పూర్తిగా ఆమోదయోగ్యమని, ఇందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. అయితే అడ్తి సెక్షన్ ప్రతినిధి జేకే.లింగారెడ్డి మాత్రం ఇది అన్యాయమని, తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, తాము రైతులకు, ట్రేడర్లకు మధ్యవర్తులుగా ఉంటూ రైతులకు మంచి ధర రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఖరీదుదారులే కావాలని తక్కువ ధరకు కోట్ చేస్తూ రైతులను, అడ్తిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొందరు ఖరీదుదారులు, కొందరు అడ్తిదారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన జేసీ ప్రస్తుతం ఆరోపణలకు సమయం కాదని, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మిగిలిన పత్తిని కొనుగోలు చేసిన అనంతరం సాయంత్రం అందరం కలసి పత్తి కొనుగోళ్లపై చర్చిద్దామని తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పటి నుంచి కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని, వీలైనంత తొందరలో సీసీఐ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ అధికారి శర్మకు సూచించారు.
తేమశాతంపై చర్చ
సీసీఐ అధికారి శర్మతోపాటు అడ్తి, ఖరీదుదారులు రైతులు తెచ్చే పత్తిలో తేమ శాతంపై చర్చించారు. మార్కెట్‌లో తేమ శాతాన్ని గుర్తించడానికి తగినన్ని మిషన్లు లేవని, తేమశాతాన్ని నిర్ధారించే గ్రేడర్లు కూడా అందుబాటులో లేరని జేసీకి తెలిపారు. ఈ క్రమంలో మార్కెట్ కార్యదర్శి రాజు తేమ శాతాన్ని నిర్ధారించే ఐదు పెద్ద మిషన్లు, పది చిన్న మిషన్లు, అందుబాటులో ఉన్నాయని వివరించారు. తేమ శాతం 12 లోపు ఉంటే తాము పత్తిని కొనుగోలు చేయడానికి అభ్యంతరం లేదని ట్రేడర్స్ తెలుపగా, ప్రస్తుతం తేమ శాతం పత్తిలో అధికంగానే ఉంటుందని, తేమ శాతం సాకుతో పత్తిని కొనుగోలు చేయకుండా తక్కువ ధర నిర్ణయించడం కరెక్టు కాదని అడ్తిదారులు వాదించారు. దీంతో జేసీ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పత్తి కొనుగోళ్లను పూర్తి చేసి, సాయంత్రం చర్చల్లో తేమశాతం, ఈ-మార్కెట్ విధానంపై మాట్లాడుతామని తెలిపి, ప్రస్తుతం మాత్రం మార్కెట్‌లో మిగిలిన పత్తి కొనుగోళ్లను పూర్తి చేయాలని అడ్తి, వ్యాపారులకు సూచించి, క్రయ విక్రయాలు జరిగేవిధంగా ఏర్పాట్లు చేసి వెళ్లిపోయారు.
జేసీ మాట బేఖాతర్
జేసీతో చర్చల్లో పాల్గొన్న అడ్తి, ట్రేడర్స్ మార్కెట్లో తక్కువ ధర పలికిన పత్తిని వెంటనే కొనుగోలు చేసి, సాయంత్రంలోపు రైతులను ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చారు. కానీ, మార్కెట్ అధికారులు ఎంత బతిలాడినా ఖరీదుదారులు అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేది లేక మార్కెట్‌లో ఉన్న పత్తి బస్తాలను షెడ్లలోకి మార్చి రైతులు భద్రపరచుకున్నారు. గురువారం మిగిలిన పత్తికి ధర నిర్ణయించి కొనుగోలు చేపట్టనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
పత్తి రైతుల ఆగ్రహం
Published Thu, Oct 1 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement