సాక్షి, హైదరాబాద్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 13,504 క్వింటాళ్ల పత్తి రాగా, అందులో మూడో వంతు అంటే 4,193 క్వింటాళ్ల పత్తికి రూ.3,800 లోపే ధర పలికింది. గతేడాది ఇదే నెల 26న వరంగల్ మార్కెట్‌లో అత్యంత తక్కువగా రూ.4,400 ధర పలికింది.
అది కనీస మద్దతుధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. తడిసిన పత్తిని ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.4,320 ఉండగా, వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు.
ప్రమాణాలు లేకే ధర పతనం..
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేకచోట్ల పత్తి తడిసిపోవడం, తేమ శాతం ఎక్కువ ఉండటంతో పత్తి ధర పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడిసిన పత్తికి ఎంఎస్‌పీ ఇచ్చే పరిస్థితి ఉండదని వ్యాపారులు, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
8 శాతం తేమ ఉంటే పత్తి క్వింటాల్‌కు రూ.4,320కు, 9 శాతం ఉంటే రూ.4,277కు, 10 శాతముంటే రూ.4,234, 11 శాతం తేమ ఉంటే రూ.4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ.4,147కు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం వర్షాల కారణంగా అనేకచోట్ల 20 శాతం వరకు తేమ ఉండటం, తడిసిపోవడంతో వ్యాపారులు అత్యంత తక్కువకు కొంటున్నారు. ప్రమాణాల ప్రకారం పత్తి లేకుంటే సీసీఐ కూడా కొనుగోలు చేయదు. కాబట్టి ఆ మేరకు రైతులు నష్టపోయే ప్రమాదముంది.
ఒక్క రోజు 45 వేల క్వింటాళ్లు కొనుగోలు
రాష్ట్రంలో ఈ నెల 16న 45,151 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. ఆ రోజు పత్తికి గరిష్టంగా రూ.3,680 నుంచి రూ.5,010 ధర పలికినట్లు ఆ శాఖ ఒక నివేదికలో తెలిపింది. గజ్వేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3,680 ధర పలుకగా, కనిష్టంగా రూ.3,100 ధర పలికింది.
సరాసరి ఆ మార్కెట్లో రూ.3,500 ధర పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లో అదే రోజు గరిష్టంగా ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా రూ.4,580 పలుకగా, కనిష్టంగా రూ. 4,030 ధర పలికింది. సరాసరి ఎంఎస్‌పీ కంటే తక్కువగా రూ.4,259 ధర పలికింది. అదే రోజు వరంగల్ మార్కెట్లో గరిష్ట ధర ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
గరిష్ట ధర రూ.5,010 పలుకగా, కనిష్ట ధర రూ.3,600 పలికింది. సరాసరి అక్కడ రూ.4,500 పలికింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. ఇదిలావుండగా రాష్ట్రంలో మంగళవారం నాటికి సీసీఐ ఆధ్వర్యంలో 20 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment