ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది.
సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.
బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ..
పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్‌గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment