వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సుమారు మూడు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీసీఐ అధికారులు తమను సంప్రదించకుండా దళారులు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చిన లూజు, ఇతర పత్తిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్తిదారులు, వ్యాపారులు పత్తి క్రయవిక్రయాలను బహిష్కరించారు. అంతేకాకుండా హమాలీ, గుమస్తాలు కూడా సీసీఐ అధికారులకు సహకరించకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో సిబ్బంది, గుమస్తాలు లేక సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టక.. ఇటు వ్యాపారులు పట్టించుకోక పత్తి తీసుకొచ్చిన రైతులు నరకం అనుభవించారు.
సీసీఐతో కొనిపించిన అధికారులు
మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెటిగ్ జాయింట్ డెరైక్టర్ పి.సుధాకర్, కార్యదర్శి రాజులు స్థానిక డీఎస్పీ హిమవ తి సమక్షంలో చాంబర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మార్కెట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సమస్యలపై తర్వాత చర్చిద్దామని, తొలుత కొనుగోళ్లు కొనసాగించాలని అధికారులు కోరినా వ్యాపారులు ససేమిరా అన్నారు. ఇప్పటికే 40వేల పత్తి బస్తాలు మార్కెకు వచ్చినందున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించినా పట్టించుకోలేదు సరికదా.. హమాలీ, గుమస్తాలు క్రయవిక్రయాల్లో పాల్గొనకుండా జాగ్రత్త పడ్డారు.
దీంతో అధికారులు చేసేదేం లేక.. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని సీసీఐ అధికారులను కోరారు. ఎంత రాత్రి అయినా తామందరం కొనుగోళ్లకు సహకరిస్తామని హామీ ఇచ్చి ఈ విషయాన్ని మార్కెట్‌లోని మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేయించారు. ఆ తర్వాత సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు కుదుటపడ్డారు. ఆ తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
నిలిచిన పత్తి క్రయవిక్రయాలు
Published Tue, Nov 18 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement