రైతులపై ఎస్సై లాఠీచార్జ్
వరంగల్‌సిటీ, న్యూస్‌లైన్ : హోటల్‌లో భోజనం చేస్తూ మద్యం సేవిస్తున్న రైతులపై ఇంతేజార్‌గంజ్ ఎస్సై దాడికి పాల్పడిన సంఘటన సోమవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెం దిన రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు సోమవారం మార్కెట్‌కు వచ్చారు. అయితే క్రయ విక్రయాలు పూర్తికాగానే మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు కొంతమంది రైతులు మార్కెట్ సమీపంలోని హోటళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు రైతులు భోజనం చేస్తూ మద్యాన్ని సేవిస్తున్నారు. వీరితోపాటు మరికొంత మంది మార్కెట్ సమీపంలోని ఓ వైన్‌షాపు ఎదుట ఉన్న బిల్డింగ్‌పై కూర్చుని మద్యం తాగుతున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్‌గంజ్ ఎస్సై రవికిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి మార్కెట్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా హోటళ్లు, మార్కెట్ ఎదుట ఉన్న బిల్డింగ్‌పై మద్యం సేవిస్తున్న రైతులను పట్టుకుని విపరీతంగా కొట్టారు. ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలా మద్యం సేవిస్తారని ఆగ్రహంతో ఊగిపోయి చితకబాదడంతో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మద్యం దుకాణాల యజమానులు, హోటళ్ల నిర్వాహకులను వదిలిపెట్టి తమను ఎందుకు కొడుతున్నారని రైతులు ఎస్సైని నిలదీశారు. హోటళ్లలో మద్యం సేవించేందుకు అనుమతి లేకుంటే తాము అక్కడికి వెళ్లేవారే కామంటూ ఆయనపై తిరగపడ్డారు. అనంతరం ఎస్సై దౌర్జన్యం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డుకుని సుమారు గంటపాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్‌గంజ్ సీఐ సతీష్‌బాబు, మట్టెవాడ సీఐ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. అనంతరం గాయపడిన రైతులను జీపులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, మార్కెట్‌కు వచ్చిన రైతులపై ఎస్సై దాడికి పాల్పడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.