అందుకే ఓకే చెప్పా!
2015లో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జయంరవినే. రోమియో జూలియెట్, తనీఒరువన్, భూలోకం చిత్రాల విజయాల త రువాత ఆయన నటిస్తున్న చిత్రం మిరుదన్. మూడు విజయవంతమైన చిత్రాల తరువాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.అలాంటి మిరుదన్ చిత్రాన్ని దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత మైఖెల్‌రాయప్పన్ నిర్మించిన చిత్రం మిరుదన్.
లక్ష్మీమీనన్ తొలి సారిగా జయంరవితో జత కట్టిన ఈ చిత్రానికి డీ.ఇమాన్ స్వరాలు సమకూర్చారు. మిరుదన్ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర యూనిట్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ మాట్లాడుతూ మిరుదన్ చిత్రం లాంటి కథతో ఇంతకు ముందు భారతీయ చిత్రపరిశ్రమలోనే రాలేదని అన్నారు. ఇందులో జయంరవి ట్రాఫిక్ పోలీస్ అధికారిగా, లక్ష్మీమీనన్ డాక్టర్‌గాను నటించారని తెలిపారు.
ఒక వైరస్ గురించి అవగాహన కలిగించే కథా చిత్రంగా మిరుదన్ చిత్రం ఉంటుందన్నారు. హాలీవుడ్ స్థాయిలో..చిత్ర నిర్మాత మైఖెల్ రాయప్పన్ మాట్లాడుతూ మిరుదన్ చిత్ర మేకింగ్ హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రెఫరెన్స్ లేని కథ ఇప్పటి వరకూ కమర్షియల్ కథా చిత్రాల్లో నటించిన జయంరవి మిరుదన్ చిత్రంలో సరికొత్త కథా పాత్రలో నటించారు.
దీని గురించి ఆయన తెలుపుతూ .కథ ఆద్యంతం ఊహలకు అందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. ఇందులో గ్లోబల్ పొల్యూషన్ గురించి అవగాహన కలిగించే చక్కని సందేశం కూడా ఉంటుందని తెలిపారు. ఇందులో నటించిన ప్రతి సన్నివేశం మంచి అనుభవం అని నటి లక్ష్మీమీనన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో రివైజింగ్ కమిటీకి వెళుతున్నట్లు నిర్మాత వెల్లడించారు.అయితే 19వ తేదీన చిత్ర విడుదల ఖాయం అనీ రాష్ట్ర వ్యాప్తంగా 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం అదే రోజు తెలుగులోనూ తెరపైకి రానుందని దర్శకుడు వెల్లడించారు.