చిన్నది కానున్న ‘మిర్యాలగూడ’
– డివిజన్లో నాడు 11 మండలాలు
– విభజనలో తొమ్మిది మండలాలతో సరి
– మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి
మిర్యాలగూడ పట్టణం
మిర్యాలగూడ : మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మరింత చిన్నది కానున్నది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజనల అనంతరం మిర్యాలగూడ డివిజన్ చిన్నది కానున్నది. గతంలో 11 మండలాలతో ఉన్న మిర్యాలగూడ డివిజన్ నుంచి నాలుగు మండలాలను ఇతర డివిజన్లో కలుపుతున్నారు. కాగా మరో రెండు కొత్త మండలాలను చేర్చుతున్నారు. గతంలో మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాలు ఉండేవి. కాగా వీటిలో హుజూర్నగర్, మఠంపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటయ్యే కోదాడ డివిజన్లో కలుపుతుండగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాన్ని మాత్రం సూర్యాపేట డివిజన్లో కలుపుతున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడనున్న తిరుమలగిరి (సాగర్), మాడ్గులపల్లి మండలాలను మిర్యాలగూడ డివిజన్లో కలపనున్నారు. నాలుగు మండలాలను తొలగించి రెండు మండలాలను కలపడం వల్ల తొమ్మిది మండలాలకు మిర్యాలగూడ డివిజన్ పరిమితం కానున్నది.
మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి
నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రానున్నది. ప్రస్తుతం మాడ్గులపల్లి గ్రామం తిప్పర్తి మండలంలో ఉండగా పునర్విభజనలో భాగంగా మాడ్గులపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. కానీ నూతనంగా ఏర్పడే మండలంలో తిప్పర్తి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలపనున్నారు. దాంతో మూడు నియోజకవర్గాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండకు సంబంధించిన గ్రామాలు ఈ మండలంలో చేరనున్నాయి. నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలంలో వేములపల్లి మండలం నుంచి కోయిలపాడు, ఆగామోత్కూర్, చిరుమర్తి, కుక్కడం, గండ్రవారిగూడెం, తోపుచర్ల, కల్వలపాలెం, నిడమనూరు మండలం నుంచి కన్నెకల్, త్రిపురారం మండలం నుంచి పూసలపాడు, గజలాపురం, పెద్దదేవులపల్లి, నర్లెకంటిగూడెం, అబంగాపురం, త్రిప్పర్తి మండలం నుంచి చెర్వుపల్లి, దాచారం, ఇందుగుల గ్రామాలను కలపనున్నారు. వేములపల్లి మండలం నుంచి మాడ్గులపల్లిలోకి కలిసే గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గం, త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని గ్రామాలు నాగార్జునసాగర్, తిప్పర్తి మండలంలోని గ్రామాలు నల్లగొండ నియోజకవర్గం నుంచి వచ్చి కలవనున్నాయి.