Mirza Ghalib
-
గ్రేట్ రైటర్..గాలిబ్
గాలిబ్ అంటే అర్థం ఉన్నతమైన అని. ‘గాలిబ్‌కు గాలిబే సాటి’ అని వినయంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్న మహాకవి గాలిబ్. అసలు పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ (1797–1869). ఆగ్రాలో జన్మించాడు. ఉర్దూ, పర్షియా, అరబిక్ భాషల్లో రాశాడు. తన కాలానికి ఆధునిక కవి. చిన్న మాటలతోనే పెద్ద భావాన్ని పలికించాడు. మనిషిలోని దుఃఖం, ఊహాప్రేయసి, ప్రేమ, శృంగారం, విరహం, కరుణించని ప్రేయసి కాఠిన్యం, స్వీయాన్వేషణ, నీతి, సౌకుమార్యం, జీవితపు గాఢత, మానవుడి అంతరంగ లోతు, ఒంటరితనపు క్షోభ, బతుకు రుచి, లోకరీతి, ఏదీ శాశ్వతంగా ఉండిపోదన్న వాస్తవం... ఇలాంటివన్నీ గాలిబ్ కవితల్లో కనిపిస్తాయి. అందంతో ఆరోగ్యవంతుల్ని చేసే ప్రేయసి గురించి గాలిబే రాయగలడు! ప్రేమకు ప్రేమే బాధ, ప్రేమే చికిత్స అని గాలిబే చెప్పగలడు! ‘మనమనుకుంటాం మనమితరులతోనే మోసపోతామని, కాని వాస్తవానికి మనం మనతోనే ఎక్కువ మోసపోతాం’ అని గాలిబ్ మాత్రమే పాడగలడు. మనిషి మనిషిగా బతకడం ఎంత కష్టమో అని గాలిబ్ మాత్రమే వాపోగలడు(‘నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము’). ‘స్వర్గమును గూర్చి నాకు సర్వమ్ము తెలియు, మనసు సంతసపడుటకు మంచి ఊహ’ అని గాలిబ్ మాత్రమే తేల్చగలడు! తెలుగు వరకూ గాలిబ్‌ను అర్థం చేసుకోవడానికి దాశరథి అనువదించిన గాలిబ్ గీతాలు ఎంతగానో ఉపకరిస్తాయి. -
గాలిబ్‌ను గుర్తు చేసిన గూగుల్
న్యూఢిల్లీ: ఉర్దూ రచయిత, కవి గాలిబ్(విజేత అని అర్థం)గా సుప్రసిద్ధుడైన మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ 220 జయంతి సందర్భంగా సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది. ఆయన యానిమేషన్ ఫొటోతో డూడుల్‌ను రూపొందించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడు, మసీదు నేపథ్యంతో భవనం బాల్కనీలో పేపరు, పెన్నుతో గాలిబ్ నిలబడినట్లు అందులో చూపింది. గాలిబ్ ఆగ్రాలోని కాలా మహల్లో 1797లో జన్మించారు. మొగల్ చక్రవర్తి ఆఖరు కాలంలో, భారత్‌ను బ్రిటిషర్లు ఆక్రమించుకున్న కాలంలో ఉర్దూ, పర్షియన్ భాషల్లో రచనలు సాగించి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిన ప్రముఖుల్లో ఒకరు. అతని గజల్స్‌కు పలు రూపాల్లో వ్యాఖ్యానాలు రాగా వివిధ వర్గాల ప్రజలు పాడుకున్నారు. గాలిబ్ తన 11వ ఏటనే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఆయన మాతృభాష ఉర్దూ అయినప్పటికీ పర్షియన్, టర్కిష్ భాషల్లోనూ అంతేస్థాయి ప్రావీణ్యం ప్రదర్శించారు. ఆయన విద్యాభ్యాసం పర్షియన్, అరబిక్ భాషల్లో సాగింది. 1869 ఫిబ్రవరి 15న గాలిబ్ తుదిశ్వాస విడిచారు. ఆయన నివాసం గాలిబ్ స్మృతి భవన్‌గా రూపాంతరం చెందింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని చౌసాత్ ఖామ్బాలో ఆయన సమాధి ఉంది. -
మహాకవికి దక్కని గుర్తింపు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి గురజాడకు తగిన గౌరవం దక్కడం లేదు. విద్యలకు నిలయమైన విజయనగరంలో ఆయన జన్మించడం వల్ల జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నైతిక విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో గురజాడ జయంతి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఉపాన్యాసాలిచ్చే నాయకులు కోకొల్లలు. అయితే గత ఏడాది జిల్లాలో నిర్వహించిన గురజాడ 150వ జయంత్యుత్సవాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పలు హమీలు ప్రకటించి నేటికి ఏడాది గడుస్తున్నా అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఉత్సవాల అనంతంరం వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారంటే ఆయనకు ఇచ్చే గౌరవం ఏపాటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. హామీలు ఇవే.... గత ఏడాది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 150వ జయంత్యుత్సవాల్లో గురజాడ పేరిట ఉన్న గ్రంథాలయం ఆవరణలో రూ.కోటి వ్యయంతో కళాభారతి ఏర్పాటు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు. గురజాడ నివసించిన ఇంటిని రూ.15 లక్షల నిధులతో మ్యూజియంగా తీర్చిదిద్దడం. ప్రధానంగా గురజాడ పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ప్రజాప్రతినిధు లు ప్రకటించిన హమీలు నెరవేర్చాలని గడిచిన ఏడాది కాలంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యం లో ఎన్ని ఆందోళనలు చేసినా ఏఒక్కరికి పట్టడం లేదు. తెలుగువారంటే అంత చులకనా...? దేశ భాషలందు తెలుగులెస్స అన్నది కాగితాలకే పరిమితమవుతోందన్న విషయం గురజాడ కు ఇచ్చే గౌరవంతో స్పష్టంగా అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల రచయితలకు, కవులకు దక్కిన గౌరవం మన తెలుగు వారికి దక్కడం లేదన్నది సుస్పష్టం. గతంలో కవులు, రచయితలు, సాహితీవేత్తల పేరిట పలు పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. వాటిలో 1969లో బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ, ఉర్దూ రచయిత మీర్జా గాలిబ్, 1976లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హిందీ రచయిత్రి సుభద్రాకుమారి చౌహాన్, బెంగాల్ రచయిత సూర్యకాంత్ త్రిపాఠీ, 1978 లో నానాలాల్ దల్పత్ రామ్కవి, 1998లో మరాఠీ రచయిత విష్ణుశేఖరం ఖండేకర్ ఇలా పలువురు రచయితల పేర్ల మీద పోస్టల్ స్టాంపులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సమాజాన్ని ప్రభావితం చేసే మూఢాచారాలపై తన సాహిత్యంతో పోరాడిన గురజాడ పేరిట స్టాంపు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఈ విషయంలో మన ప్రజా ప్రతినిధుల ప్రయత్నం కనీసం లేకపోవడం ప్రధాన కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా...? లేదా...? అన్నది వేచి చూడాల్సిందే.