మహాకవికి దక్కని గుర్తింపు
Published Sat, Sep 21 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి గురజాడకు తగిన గౌరవం దక్కడం లేదు. విద్యలకు నిలయమైన విజయనగరంలో ఆయన జన్మించడం వల్ల జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నైతిక విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో గురజాడ జయంతి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఉపాన్యాసాలిచ్చే నాయకులు కోకొల్లలు. అయితే గత ఏడాది జిల్లాలో నిర్వహించిన గురజాడ 150వ జయంత్యుత్సవాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పలు హమీలు ప్రకటించి నేటికి ఏడాది గడుస్తున్నా అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఉత్సవాల అనంతంరం వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారంటే ఆయనకు ఇచ్చే గౌరవం ఏపాటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
హామీలు ఇవే....
గత ఏడాది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 150వ జయంత్యుత్సవాల్లో గురజాడ పేరిట ఉన్న గ్రంథాలయం ఆవరణలో రూ.కోటి వ్యయంతో కళాభారతి ఏర్పాటు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు. గురజాడ నివసించిన ఇంటిని రూ.15 లక్షల నిధులతో మ్యూజియంగా తీర్చిదిద్దడం. ప్రధానంగా గురజాడ పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ప్రజాప్రతినిధు లు ప్రకటించిన హమీలు నెరవేర్చాలని గడిచిన ఏడాది కాలంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యం లో ఎన్ని ఆందోళనలు చేసినా ఏఒక్కరికి పట్టడం లేదు.
తెలుగువారంటే అంత చులకనా...?
దేశ భాషలందు తెలుగులెస్స అన్నది కాగితాలకే పరిమితమవుతోందన్న విషయం గురజాడ కు ఇచ్చే గౌరవంతో స్పష్టంగా అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల రచయితలకు, కవులకు దక్కిన గౌరవం మన తెలుగు వారికి దక్కడం లేదన్నది సుస్పష్టం. గతంలో కవులు, రచయితలు, సాహితీవేత్తల పేరిట పలు పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. వాటిలో 1969లో బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ, ఉర్దూ రచయిత మీర్జా గాలిబ్, 1976లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హిందీ రచయిత్రి సుభద్రాకుమారి చౌహాన్, బెంగాల్ రచయిత సూర్యకాంత్ త్రిపాఠీ, 1978 లో నానాలాల్ దల్పత్ రామ్‌కవి, 1998లో మరాఠీ రచయిత విష్ణుశేఖరం ఖండేకర్ ఇలా పలువురు రచయితల పేర్ల మీద పోస్టల్ స్టాంపులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సమాజాన్ని ప్రభావితం చేసే మూఢాచారాలపై తన సాహిత్యంతో పోరాడిన గురజాడ పేరిట స్టాంపు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఈ విషయంలో మన ప్రజా ప్రతినిధుల ప్రయత్నం కనీసం లేకపోవడం ప్రధాన కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా...? లేదా...? అన్నది వేచి చూడాల్సిందే.
Advertisement