Gurazada Apparao
-
నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం
కన్యాశుల్కం నాటకంపై వందలకొద్దీ వ్యాసాలు, పరిశోధనాత్మక గ్రంథాలు, విశేష సంచికలు, తులనాత్మక పరిశీలనలు వచ్చాయి. అయినా ఆ నాటకం ఓ అక్షయ పాత్ర. చదివినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి. కన్యాశుల్కం మొదటి ప్రదర్శనకు 125 ఏళ్లు అయిన సందర్భంగా కన్యాశుల్కం తాలూకు కొన్ని విశేషాలు: ఎన్నో గ్రంథాలకు, కావ్యాలకు మొదటి నుండి రూపాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక మహేతిహాసమైన ‘కన్యాశుల్కం’ కూడా వివిధ ప్రక్రియలుగా రూపాంతరం చెందింది. కన్యాశుల్కం మొదటి ముద్రణ 1897లో జరిగింది. ఆ తర్వాత సవరించి, పెంచి మళ్ళీ 1909లో ముద్రించారు గురజాడ. ఆ తర్వాత ఎన్నో పునర్ముద్రణలు పొందింది. కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. తర్వాత వందలకొద్దీ ప్రదర్శనలు జరిగాయి. ‘కన్యాశుల్కం’ పలు భాషల్లోకి అనువాదమైంది. 1927లో కన్నడలోకి కె.క్రిష్ణయ్యంగార్, తమిళంలోకి 1964లో ముదునూరు జగన్నాథరావు అనువాదం చేశారు. ఫ్రెంచ్ భాషలోకి 1960–61 ప్రాంతాల్లో అనువాదమైంది. 1962లో రష్యన్లోకి పెర్తూనిచెవోయ్, అగ్రానిన అనువదించారు. ఆంగ్లంలోకి మూడు నాలుగుసార్లు అనువాదమైంది. ఎస్.ఎన్.జయంతి చేసిన అనువాదాన్ని 1964లో గురజాడ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాదు ముద్రించింది. తర్వాత ఎస్.జి.మూర్తి, కె.రమేష్ చేసిన అనువాదాన్ని 1976లో సాహిత్య అకాడమీ ప్రచురించింది. సి.విజయశ్రీ, టి.విజయ్ కుమార్ చేసిన అనువాదాన్ని బుక్ రెవ్యూ లిటెరరీ ట్రస్ట్, న్యూ దిల్లీ 2002లో ప్రచురించింది. ఆ తర్వాత వేల్చేరు నారాయణరావు ‘గల్స్ ఫర్ సేల్: కన్యాశుల్కం, ఎ ప్లే ఫ్రమ్ కలోనియల్ ఇండియా’ పేరుతో అనువదించారు. దీన్ని ఇండియానా యూనివర్సిటీ ప్రెస్ 2007లో ప్రచురించింది. కన్యాశుల్కం నవలా రూపంలో వచ్చింది. నవలీకరణ సెట్టి ఈశ్వరరావు. 156 పుటల్లో వివిధ శీర్షికలు పెట్టి, ప్రధాన కథకు ఏమాత్రం భంగం కలగకుండా నవలీకరించారు. 1993లో దీని ప్రచురణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 1960ల్లోనే ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంత నిడివిగల నాటకాన్ని ఒక గంటకు కుదించి రేడియో నాటకంగా ప్రసారం చేసి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత చాలాసార్లు పున:ప్రసారం అయ్యింది. పూర్వం రాసిన ఉద్గ్రంథాలకూ, కొరుకుడుపడని పద్యాలకూ టీకా టిప్పణులు వచ్చిన సందర్భాలున్నాయి. ఆధునిక వ్యవహార భాషలో రాసిన కన్యాశుల్కానికి కూడా వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కరలేదు! 125 ఏళ్ల క్రితం రాసిన కన్యాశుల్కంలో ఈనాటి యువతరానికి అర్థంకాని భాష, పలుకుబడులు ఎన్నో ఉన్నాయి. వాటిని విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో కన్యాశుల్కం రెండవ కూర్పుకు ‘కన్యాశుల్కం టీకా టిప్పణీ’ తయారు చేశారు కె.వి.రమణారెడ్డి. దీన్ని వెలుగు రామినీడు 1991లో ప్రచురించారు. దీనికంటే ముందే 1980ల్లో కన్యాశుల్కం మొదటి కూర్పుకు వివరణాత్మక పుట్ నోట్స్ రాసి మనకందించారు బంగోరెగా ప్రసిద్ధులైన బండి గోపాలరెడ్డి. అబ్బూరి రామకృష్ణారావు 1924లో రామవిలాస సభను ఏర్పాటు చేసి, ఆ సంస్థ తరఫున శతాధిక ప్రదర్శనలు ఇచ్చారు. బక్షి శ్రీరామ్ త్రీడి వేదికను ఏర్పాటుచేసి, 300 స్పాట్ లైట్లు అమర్చి నాటకాన్ని రంగుల హరివిల్లులా ప్రదర్శించారు. రెండుసార్లు టీవీ సీరియల్‌గా ప్రసారమైంది. 1990లో దూరదర్శన్ తెలుగు డివిజన్లో పదమూడు వారాలపాటు ప్రసారమైంది. అందులో జె.వి.రమణమూర్తి ‘గిరీశం’గా, శ్రుతి ‘మధురవాణి’గా నటించారు. ఆ తర్వాత 2005లో ‘మాటీవీ’లో 26 వారాలపాటు ప్రసారమైంది. దీనికి రావి కొండలరావు దర్శకుడు. గిరీశంగా గొల్లపూడి మారుతిరావు, మధురవాణిగా జయలలిత నటించారు. రామారావు, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా పి.పుల్లయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ కన్యాశుల్కం సినిమాను నిర్మించారు. ఇది 1955 ఆగస్టు 26న విడుదలైంది. ఇందులో సామాన్య పాత్రగా ప్రవేశించి అసామాన్య పాత్రగా ఎదగడం మధురవాణి పాత్ర ప్రత్యేకత. అందులో గొప్పగా ఒదిగిపోయారు సావిత్రి. వేశ్య పాత్ర అయినప్పటికీ అశ్లీలం, ఎబ్బెట్టు లేకుండా సావిత్రి నటించిన తీరు అమోఘం. ఇక దగాకోరుగా, మాయలమారిగా గిరీశం పాత్రలో అద్భుతంగా జీవించారు ఎన్టీఆర్. అయితే నాటకం సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులకు లోనైంది. ‘నాటకమును యథాతథంగా చిత్రించుటకు వీలుపడనందున, కొన్ని సన్నివేశములలోను, సంభాషణలలోను యథోచితంగా మార్పులు చేయవలసి వచ్చింది. రసజ్ఞులు సహృదయంతో స్వీకరించవలెనని ప్రార్థన’ అని ప్రారంభంలోనే చెప్పారు. అయిదారు గంటల నిడివిగల నాటకాన్ని మూడు గంటల్లో కుదించి చెప్పడం కత్తి మీద సామే! నాటకంలోని ఆత్మ చెడుతుందని చిత్రీకరణకు ముందే విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కన్యాశుల్కం నాటకంలాగా సినిమా కూడా క్లాసిక్‌గా నిలిచింది. జె.రాయమల్లు 9951428183 మీకు తెలుసా? గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. కోట్ పూర్ రిచ్చర్డు చెప్పినట్టు... గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో గిరీశం చేత ఒకటి లేదా రెండు మూడు పాదాలుగా ఆంగ్ల సూక్తులనో, ఆంగ్ల పద్యాలనో కొన్నింటిని చెప్పించారు. అందులో ఒకటి: పూర్ రిచ్చర్డు చెప్పినట్టు, పేషన్సు ఉంటేనే కానీ లోకములో పని జరగదు. గిరీశం చేత గురజాడ పలికించిన ఆ ఉవాచ బెంజమిన్ ఫ్రాంక్లిన్ది. దాని మూలం: He that can have patience can have what he will. బెంజమిన్ ఫ్రాంక్లిన్(17 జనవరి 1706– 17 ఏప్రిల్ 1790) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త, అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాతల్లో ఒకడు, రచయిత, ముద్రాపకుడు, రాజకీయ సిద్ధాంతకర్త, రాజకీయ నాయకుడు, ‘పోస్టు మాస్టర్’, శాస్త్రవేత్త, అన్వేషకుడు, ప్రజాసేవకుడు. పిడుగు నిరోధకాన్నీ, చత్వారపు కళ్లద్దాలనీ కనుగొన్నారు. ఆనాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వలస ప్రాంతాల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడినందువల్ల The First American బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి. ఆయన తనకు ‘పూర్రిచ్చెర్డు’ అని మారుపేరు పెట్టుకున్నారు. ఆయన సూక్తులు ఎంతగానో పేరు పొంది, ఎందరో ఉపయోగించుకున్నారు. అలా గురజాడ కూడా పేషన్స్ మీద ఆయన చెప్పిన సూక్తిని తన కన్యాశుల్కంలో వాడేరు. వేదప్రభాస్ 9490791568 -
తెలంగాణ వికాసోద్యమ ప్రాతినిధ్య గ్రంథం
‘‘ఇక్కడ ఏ గురజాడ అప్పారావూ, వీరేశలింగమూ ఆ ఉదయానికి ఆహ్వానం పలకలేదని గుర్తించవలసి ఉన్నది’’. ‘‘ఇరవయ్యో శతాబ్దం మొదటి సగంలో తెలంగాణలో కేవల సాహిత్యంగా చెప్పుకోదగ్గది చాలా తక్కువ’’ లాంటి వాటి గురించి చాలా చర్చ జరుగవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ఆధునిక సాహిత్య ప్రారంభ వికాసాల గురించి చర్చించిన మొట్టమొదటి సిద్ధాంత గ్రంథమిది. ఇంతకు ముందు ఈ విషయంలో ప్రయత్నం జరగలేదని కాదు. దేవులపల్లి రామానుజరావు (సుజాత- 1951), వానమామలై వరదాచార్యులు (తెలంగాణ- 1956), ఓగేటి అచ్యుతరామ శాస్త్రి, తరువాతి కాలంలో తొలినాటి కథ, నవల వికాసం గురించి సంగిశెట్టి శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి చర్చించినారు. కాని తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకూ సాహిత్యానికీ ఉన్న పరస్పర సంబంధాన్ని విశ్లేషించిన మొదటి సమగ్ర గ్రంథం ఇదే! కురుగంటి ‘నవ్యాంధ్ర సాిహ త్య వీథులు’, సినారె సిద్ధాంత గ్రంథం పట్టించుకోని అనేక విషయాల్ని ఆత్మీయంగా రికార్డ్ చేసిన గ్రంథం ఇది. ఆ రకంగా ఆ రెండు గ్రంథాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాతినిధ్య సిద్ధాంత గ్రంథమిది. ఆ రకంగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వం ఈ గ్రంథం. తెలంగాణ ఆధునిక సాహిత్యం మీద పరిశోధన చేసే వారెవరైనా శ్రీనివాస్ ద్వయంతో కరచాలనం చేయకుండా ముందుకెళ్లడం అసాధ్యం. అందుకు తాజా ఉదాహరణ ఇది. 1900 నుంచి 1940 వరకు జరిగిన తెలంగాణ ఆధునిక సాహిత్య ఆవిర్భావ వికాసాలకు సామాజిక రాజకీయ పరిణామాలు ఎట్లా ప్రాతిపదిక సిద్ధం చేసినవో ఆ మూడింటిని సమన్వయం చేస్తూ సాగిన సిద్ధాంత గ్రంథమిది. ‘‘ఆ కాలంలో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసంలో సాహిత్యం పాత్ర ఏమిటి; సాహిత్య వికాసం ఏ మార్గంలో సాగింది, ఏయే ప్రభావాలతో సాగింది, ఏయే అంశాలకు తెలంగాణ సాహిత్యరంగం స్పందించింది మొదలైన అంశాలను పరిశీలించడం ఇక్కడ ఉద్దేశ్యం’’(పుట-7) అని ఆయన చెప్పుకున్న సంకల్పం అందుకు నిదర్శనం. కె.శ్రీనివాస్ ఆలోచనలో స్పష్టత ఉన్నవాడు. కనుకనే చాప్టరైజేషన్లో చాలా స్పష్టత ఉన్నది. మొత్తం కలగాపులగం చేయకుండ, నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం ఆవిర్భావానికి ముందు, తర్వాత అనే రెండు విభాగాలు చేసి విశ్లేశించినారు. ఆయన విశ్లేషణ చాలామటుకు వస్తుగతంగా నిర్మమకారంగా ఉంటుంది. తాను పుట్టుక రీత్యా శ్రీవైష్ణవుడైనప్పటికీ (ఆ కుల స్పృహ ఆయనకున్నా లేకున్నా) తెలంగాణ వికాసోద్యమంలో శైవ మతస్థుల దోహదాన్ని (పుట-350) ప్రస్తుతించడం అందుకు ఒక ఉదాహరణ. కె.శ్రీనివాస్ కొందరిలా అతివాది కాడు, సంయమనవాది. అది ఈ గ్రంథానికి ప్రామాణికతను, విశ్వసనీయతను సంతరించి పెట్టింది. 1900 నుంచి 1940 వరకు లేదా 1944 వరకు తెలంగాణ సమాజంలో జరిగిన పరిణామం చాలా సంక్లిష్టమైనది. ఆ సంక్లిష్టతను విడమరచడంలో శ్రీనివాస్ చాలా నేర్పు చూపించినారు. ఇందుకు సుదీర్ఘమైన ఉల్లేఖనలు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మంచి రీడబిలిటీని సాధించినారు. తెలంగాణ సాహిత్యం మీద పరిశోధన చేసేవారికి డాక్టరేట్ పొందాలనే యావ కంటే తెలంగాణ మీద ప్రేమ ముఖ్యం. అటువంటి ప్రేమ ఉన్నవాడు కనుకనే ‘‘అంధకార యుగం అనడం అతిశయోక్తి’’ (పుట-121) అని అనగలిగినారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనకుండా ‘‘రెండు ప్రాంతాలలో జరిగిన వికాసాన్ని భిన్న వికాసాలుగా చూడా’’లని అనగలిగినారు. ‘వైతాళికులు’లో జాషువా లేకపోవడాన్ని, ‘గోల్కొండ కవుల సంచిక’లో అరిగె రామస్వామి ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని, ‘‘ఆధునిక ఆంధ్రకంటె వెనుకబడిన తెలంగాణలోనే సార్వజనీన భాగస్వామ్యం మెరుగుగా కనిపించడం విశేషం’’ (పుట-261) అని అనగలిగినారు. అట్లా అనగలిగిన తెలంగాణ ప్రేమికుడు అయినప్పటికీ, ఆలోచనలో, విశ్లేషణలో చాలా మంది కంటే ఎత్తులో ఉన్నప్పటికీ, ఆ కాలంనాటి సాహిత్యం గురించి, ఆంధ్రోద్యమం గురించి అంతకు ముందు ఎవరూ చేయని ఎన్నో కొత్త ప్రతిపాదనలు చేసినప్పటికీ, కొన్ని విషయాల్లో ఆయన చేసిన విశ్లేషణతో ఏకీభవించడం కష్టం. ‘‘ఇక్కడ ఏ గురజాడ అప్పారావూ, వీరేశలింగమూ ఆ ఉదయానికి ఆహ్వానం పలకలేదని గుర్తించవలసి ఉన్నది’’ (పుట-6). ‘‘ఇరవయ్యో శతాబ్దం మొదటి సగంలో తెలంగాణలో కేవల సాహిత్యంగా చెప్పుకోదగ్గది చాలా తక్కువ’’(పుట-11) లాంటి వాటి గురించి చాలా చర్చ జరుగవలసిన అవసరం ఉన్నది. ఆ కాలంనాటి(1900-1940) సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామ దృశ్యాన్ని విశ్లేషించినంత సమగ్రంగా సాహిత్యాన్ని గురించికూడా మరింత విపులంగా విశ్లేషించి ఉంటే బాగుండేది. అందుకు తగిన సమర్థత ఉండి కూడా సమయాభావమో, సమాచార అలభ్యతో - ఏ కారణంగానో ఆయన ఆ పని చేయలేకపోయినారు. సరే, ఇలాంటివి కొన్ని వదిలేస్తే తెలంగాణ ఆధునిక సాహిత్య ఆవిర్భావ వికాసాల గురించి తెలుసుకోగోరే పాఠకులు, పరిశోధకులు అనివార్యంగా చదువవలసిన గొప్ప గ్రంథం. (తెలంగాణ సాహిత్య వికాసం: ఆధునికత వైపు సొంత అడుగులు/ 1900-1940; రచన: కె.శ్రీనివాస్; పేజీలు: 560; వెల: 300; ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు) డా॥సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 9885682572 -
మహాకవికి దక్కని గుర్తింపు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి గురజాడకు తగిన గౌరవం దక్కడం లేదు. విద్యలకు నిలయమైన విజయనగరంలో ఆయన జన్మించడం వల్ల జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నైతిక విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో గురజాడ జయంతి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఉపాన్యాసాలిచ్చే నాయకులు కోకొల్లలు. అయితే గత ఏడాది జిల్లాలో నిర్వహించిన గురజాడ 150వ జయంత్యుత్సవాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పలు హమీలు ప్రకటించి నేటికి ఏడాది గడుస్తున్నా అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఉత్సవాల అనంతంరం వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారంటే ఆయనకు ఇచ్చే గౌరవం ఏపాటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. హామీలు ఇవే.... గత ఏడాది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 150వ జయంత్యుత్సవాల్లో గురజాడ పేరిట ఉన్న గ్రంథాలయం ఆవరణలో రూ.కోటి వ్యయంతో కళాభారతి ఏర్పాటు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు. గురజాడ నివసించిన ఇంటిని రూ.15 లక్షల నిధులతో మ్యూజియంగా తీర్చిదిద్దడం. ప్రధానంగా గురజాడ పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ప్రజాప్రతినిధు లు ప్రకటించిన హమీలు నెరవేర్చాలని గడిచిన ఏడాది కాలంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యం లో ఎన్ని ఆందోళనలు చేసినా ఏఒక్కరికి పట్టడం లేదు. తెలుగువారంటే అంత చులకనా...? దేశ భాషలందు తెలుగులెస్స అన్నది కాగితాలకే పరిమితమవుతోందన్న విషయం గురజాడ కు ఇచ్చే గౌరవంతో స్పష్టంగా అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల రచయితలకు, కవులకు దక్కిన గౌరవం మన తెలుగు వారికి దక్కడం లేదన్నది సుస్పష్టం. గతంలో కవులు, రచయితలు, సాహితీవేత్తల పేరిట పలు పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. వాటిలో 1969లో బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ, ఉర్దూ రచయిత మీర్జా గాలిబ్, 1976లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హిందీ రచయిత్రి సుభద్రాకుమారి చౌహాన్, బెంగాల్ రచయిత సూర్యకాంత్ త్రిపాఠీ, 1978 లో నానాలాల్ దల్పత్ రామ్కవి, 1998లో మరాఠీ రచయిత విష్ణుశేఖరం ఖండేకర్ ఇలా పలువురు రచయితల పేర్ల మీద పోస్టల్ స్టాంపులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సమాజాన్ని ప్రభావితం చేసే మూఢాచారాలపై తన సాహిత్యంతో పోరాడిన గురజాడ పేరిట స్టాంపు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఈ విషయంలో మన ప్రజా ప్రతినిధుల ప్రయత్నం కనీసం లేకపోవడం ప్రధాన కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా...? లేదా...? అన్నది వేచి చూడాల్సిందే.