నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం
కన్యాశుల్కం నాటకంపై వందలకొద్దీ వ్యాసాలు, పరిశోధనాత్మక గ్రంథాలు, విశేష సంచికలు, తులనాత్మక పరిశీలనలు వచ్చాయి. అయినా ఆ నాటకం ఓ అక్షయ పాత్ర. చదివినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి. కన్యాశుల్కం మొదటి ప్రదర్శనకు 125 ఏళ్లు అయిన సందర్భంగా కన్యాశుల్కం తాలూకు కొన్ని విశేషాలు:
ఎన్నో గ్రంథాలకు, కావ్యాలకు మొదటి నుండి రూపాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక మహేతిహాసమైన ‘కన్యాశుల్కం’ కూడా వివిధ ప్రక్రియలుగా రూపాంతరం చెందింది. కన్యాశుల్కం మొదటి ముద్రణ 1897లో జరిగింది. ఆ తర్వాత సవరించి, పెంచి మళ్ళీ 1909లో ముద్రించారు గురజాడ. ఆ తర్వాత ఎన్నో పునర్ముద్రణలు పొందింది. కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. తర్వాత వందలకొద్దీ ప్రదర్శనలు జరిగాయి.
‘కన్యాశుల్కం’ పలు భాషల్లోకి అనువాదమైంది. 1927లో కన్నడలోకి కె.క్రిష్ణయ్యంగార్, తమిళంలోకి 1964లో ముదునూరు జగన్నాథరావు అనువాదం చేశారు. ఫ్రెంచ్ భాషలోకి 1960–61 ప్రాంతాల్లో అనువాదమైంది. 1962లో రష్యన్‌లోకి పెర్తూనిచెవోయ్, అగ్రానిన అనువదించారు. ఆంగ్లంలోకి మూడు నాలుగుసార్లు అనువాదమైంది. ఎస్.ఎన్.జయంతి చేసిన అనువాదాన్ని 1964లో గురజాడ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాదు ముద్రించింది. తర్వాత ఎస్.జి.మూర్తి, కె.రమేష్ చేసిన అనువాదాన్ని 1976లో సాహిత్య అకాడమీ ప్రచురించింది. సి.విజయశ్రీ, టి.విజయ్ కుమార్ చేసిన అనువాదాన్ని బుక్ రెవ్యూ లిటెరరీ ట్రస్ట్, న్యూ దిల్లీ 2002లో ప్రచురించింది.
ఆ తర్వాత వేల్చేరు నారాయణరావు ‘గల్స్ ఫర్ సేల్: కన్యాశుల్కం, ఎ ప్లే ఫ్రమ్ కలోనియల్ ఇండియా’ పేరుతో అనువదించారు. దీన్ని ఇండియానా యూనివర్సిటీ ప్రెస్ 2007లో ప్రచురించింది.
కన్యాశుల్కం నవలా రూపంలో వచ్చింది. నవలీకరణ సెట్టి ఈశ్వరరావు. 156 పుటల్లో వివిధ శీర్షికలు పెట్టి, ప్రధాన కథకు ఏమాత్రం భంగం కలగకుండా నవలీకరించారు. 1993లో దీని ప్రచురణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 1960ల్లోనే ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంత నిడివిగల నాటకాన్ని ఒక గంటకు కుదించి రేడియో నాటకంగా ప్రసారం చేసి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత చాలాసార్లు పున:ప్రసారం అయ్యింది.
పూర్వం రాసిన ఉద్గ్రంథాలకూ, కొరుకుడుపడని పద్యాలకూ టీకా టిప్పణులు వచ్చిన సందర్భాలున్నాయి. ఆధునిక వ్యవహార భాషలో రాసిన కన్యాశుల్కానికి కూడా వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కరలేదు! 125 ఏళ్ల క్రితం రాసిన కన్యాశుల్కంలో ఈనాటి యువతరానికి అర్థంకాని భాష, పలుకుబడులు ఎన్నో ఉన్నాయి. వాటిని విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో కన్యాశుల్కం రెండవ కూర్పుకు ‘కన్యాశుల్కం టీకా టిప్పణీ’ తయారు చేశారు కె.వి.రమణారెడ్డి. దీన్ని వెలుగు రామినీడు 1991లో ప్రచురించారు. దీనికంటే ముందే 1980ల్లో కన్యాశుల్కం మొదటి కూర్పుకు వివరణాత్మక పుట్ నోట్స్ రాసి మనకందించారు బంగోరెగా ప్రసిద్ధులైన బండి గోపాలరెడ్డి.
అబ్బూరి రామకృష్ణారావు 1924లో రామవిలాస సభను ఏర్పాటు చేసి, ఆ సంస్థ తరఫున శతాధిక ప్రదర్శనలు ఇచ్చారు. బక్షి శ్రీరామ్ త్రీడి వేదికను ఏర్పాటుచేసి, 300 స్పాట్ లైట్లు అమర్చి నాటకాన్ని రంగుల హరివిల్లులా ప్రదర్శించారు. రెండుసార్లు టీవీ సీరియల్‌గా ప్రసారమైంది. 1990లో దూరదర్శన్ తెలుగు డివిజన్‌లో పదమూడు వారాలపాటు ప్రసారమైంది. అందులో జె.వి.రమణమూర్తి ‘గిరీశం’గా, శ్రుతి ‘మధురవాణి’గా నటించారు. ఆ తర్వాత 2005లో ‘మాటీవీ’లో 26 వారాలపాటు ప్రసారమైంది. దీనికి రావి కొండలరావు దర్శకుడు. గిరీశంగా గొల్లపూడి మారుతిరావు, మధురవాణిగా జయలలిత నటించారు.
రామారావు, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా పి.పుల్లయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ కన్యాశుల్కం సినిమాను నిర్మించారు. ఇది 1955 ఆగస్టు 26న విడుదలైంది. ఇందులో సామాన్య పాత్రగా ప్రవేశించి అసామాన్య పాత్రగా ఎదగడం మధురవాణి పాత్ర ప్రత్యేకత. అందులో గొప్పగా ఒదిగిపోయారు సావిత్రి. వేశ్య పాత్ర అయినప్పటికీ అశ్లీలం, ఎబ్బెట్టు లేకుండా సావిత్రి నటించిన తీరు అమోఘం. ఇక దగాకోరుగా, మాయలమారిగా గిరీశం పాత్రలో అద్భుతంగా జీవించారు ఎన్టీఆర్. అయితే నాటకం సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులకు లోనైంది. ‘నాటకమును యథాతథంగా చిత్రించుటకు వీలుపడనందున, కొన్ని సన్నివేశములలోను, సంభాషణలలోను యథోచితంగా మార్పులు చేయవలసి వచ్చింది. రసజ్ఞులు సహృదయంతో స్వీకరించవలెనని ప్రార్థన’ అని ప్రారంభంలోనే చెప్పారు. అయిదారు గంటల నిడివిగల నాటకాన్ని మూడు గంటల్లో కుదించి చెప్పడం కత్తి మీద సామే! నాటకంలోని ఆత్మ చెడుతుందని చిత్రీకరణకు ముందే విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కన్యాశుల్కం నాటకంలాగా సినిమా కూడా క్లాసిక్‌గా నిలిచింది.
జె.రాయమల్లు
9951428183
మీకు తెలుసా?
గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు.
కోట్
పూర్ రిచ్చర్డు చెప్పినట్టు...
గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో గిరీశం చేత ఒకటి లేదా రెండు మూడు పాదాలుగా ఆంగ్ల సూక్తులనో, ఆంగ్ల పద్యాలనో కొన్నింటిని చెప్పించారు. అందులో ఒకటి: పూర్ రిచ్చర్డు చెప్పినట్టు, పేషన్సు ఉంటేనే కానీ లోకములో పని జరగదు.
గిరీశం చేత గురజాడ పలికించిన ఆ ఉవాచ బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ది. దాని మూలం: He that can have patience can have what he will. బెంజమిన్ ఫ్రాంక్లిన్(17 జనవరి 1706– 17 ఏప్రిల్ 1790) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త, అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాతల్లో ఒకడు, రచయిత, ముద్రాపకుడు, రాజకీయ సిద్ధాంతకర్త, రాజకీయ నాయకుడు, ‘పోస్టు మాస్టర్’, శాస్త్రవేత్త, అన్వేషకుడు, ప్రజాసేవకుడు. పిడుగు నిరోధకాన్నీ, చత్వారపు కళ్లద్దాలనీ కనుగొన్నారు.
ఆనాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వలస ప్రాంతాల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడినందువల్ల The First American బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి. ఆయన తనకు ‘పూర్రిచ్చెర్డు’ అని మారుపేరు పెట్టుకున్నారు. ఆయన సూక్తులు ఎంతగానో పేరు పొంది, ఎందరో ఉపయోగించుకున్నారు. అలా గురజాడ కూడా పేషన్స్ మీద ఆయన చెప్పిన సూక్తిని తన కన్యాశుల్కంలో వాడేరు.
వేదప్రభాస్
9490791568