తెలంగాణ వికాసోద్యమ ప్రాతినిధ్య గ్రంథం
‘‘ఇక్కడ ఏ గురజాడ అప్పారావూ, వీరేశలింగమూ ఆ ఉదయానికి ఆహ్వానం పలకలేదని గుర్తించవలసి ఉన్నది’’. ‘‘ఇరవయ్యో శతాబ్దం మొదటి సగంలో తెలంగాణలో కేవల సాహిత్యంగా చెప్పుకోదగ్గది చాలా తక్కువ’’ లాంటి వాటి గురించి చాలా చర్చ జరుగవలసిన అవసరం ఉన్నది.
తెలంగాణ ఆధునిక సాహిత్య ప్రారంభ వికాసాల గురించి చర్చించిన మొట్టమొదటి సిద్ధాంత గ్రంథమిది. ఇంతకు ముందు ఈ విషయంలో ప్రయత్నం జరగలేదని కాదు. దేవులపల్లి రామానుజరావు (సుజాత- 1951), వానమామలై వరదాచార్యులు (తెలంగాణ- 1956), ఓగేటి అచ్యుతరామ శాస్త్రి, తరువాతి కాలంలో తొలినాటి కథ, నవల వికాసం గురించి సంగిశెట్టి శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి చర్చించినారు. కాని తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకూ సాహిత్యానికీ ఉన్న పరస్పర సంబంధాన్ని విశ్లేషించిన మొదటి సమగ్ర గ్రంథం ఇదే! కురుగంటి ‘నవ్యాంధ్ర సాిహ త్య వీథులు’, సినారె సిద్ధాంత గ్రంథం పట్టించుకోని అనేక విషయాల్ని ఆత్మీయంగా రికార్డ్ చేసిన గ్రంథం ఇది. ఆ రకంగా ఆ రెండు గ్రంథాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాతినిధ్య సిద్ధాంత గ్రంథమిది. ఆ రకంగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వం ఈ గ్రంథం. తెలంగాణ ఆధునిక సాహిత్యం మీద పరిశోధన చేసే వారెవరైనా శ్రీనివాస్ ద్వయంతో కరచాలనం చేయకుండా ముందుకెళ్లడం అసాధ్యం. అందుకు తాజా ఉదాహరణ ఇది.
1900 నుంచి 1940 వరకు జరిగిన తెలంగాణ ఆధునిక సాహిత్య ఆవిర్భావ వికాసాలకు సామాజిక రాజకీయ పరిణామాలు ఎట్లా ప్రాతిపదిక సిద్ధం చేసినవో ఆ మూడింటిని సమన్వయం చేస్తూ సాగిన సిద్ధాంత గ్రంథమిది. ‘‘ఆ కాలంలో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసంలో సాహిత్యం పాత్ర ఏమిటి; సాహిత్య వికాసం ఏ మార్గంలో సాగింది, ఏయే ప్రభావాలతో సాగింది, ఏయే అంశాలకు తెలంగాణ సాహిత్యరంగం స్పందించింది మొదలైన అంశాలను పరిశీలించడం ఇక్కడ ఉద్దేశ్యం’’(పుట-7) అని ఆయన చెప్పుకున్న సంకల్పం అందుకు నిదర్శనం.
కె.శ్రీనివాస్ ఆలోచనలో స్పష్టత ఉన్నవాడు. కనుకనే చాప్టరైజేషన్‌లో చాలా స్పష్టత ఉన్నది. మొత్తం కలగాపులగం చేయకుండ, నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం ఆవిర్భావానికి ముందు, తర్వాత అనే రెండు విభాగాలు చేసి విశ్లేశించినారు.
ఆయన విశ్లేషణ చాలామటుకు వస్తుగతంగా నిర్మమకారంగా ఉంటుంది. తాను పుట్టుక రీత్యా శ్రీవైష్ణవుడైనప్పటికీ (ఆ కుల స్పృహ ఆయనకున్నా లేకున్నా) తెలంగాణ వికాసోద్యమంలో శైవ మతస్థుల దోహదాన్ని (పుట-350) ప్రస్తుతించడం అందుకు ఒక ఉదాహరణ.
కె.శ్రీనివాస్ కొందరిలా అతివాది కాడు, సంయమనవాది. అది ఈ గ్రంథానికి ప్రామాణికతను, విశ్వసనీయతను సంతరించి పెట్టింది.
1900 నుంచి 1940 వరకు లేదా 1944 వరకు తెలంగాణ సమాజంలో జరిగిన పరిణామం చాలా సంక్లిష్టమైనది. ఆ సంక్లిష్టతను విడమరచడంలో శ్రీనివాస్ చాలా నేర్పు చూపించినారు. ఇందుకు సుదీర్ఘమైన ఉల్లేఖనలు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మంచి రీడబిలిటీని సాధించినారు.
తెలంగాణ సాహిత్యం మీద పరిశోధన చేసేవారికి డాక్టరేట్ పొందాలనే యావ కంటే తెలంగాణ మీద ప్రేమ ముఖ్యం.
అటువంటి ప్రేమ ఉన్నవాడు కనుకనే ‘‘అంధకార యుగం అనడం అతిశయోక్తి’’ (పుట-121) అని అనగలిగినారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనకుండా ‘‘రెండు ప్రాంతాలలో జరిగిన వికాసాన్ని భిన్న వికాసాలుగా చూడా’’లని అనగలిగినారు. ‘వైతాళికులు’లో జాషువా లేకపోవడాన్ని, ‘గోల్కొండ కవుల సంచిక’లో అరిగె రామస్వామి ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని, ‘‘ఆధునిక ఆంధ్రకంటె వెనుకబడిన తెలంగాణలోనే సార్వజనీన భాగస్వామ్యం మెరుగుగా కనిపించడం విశేషం’’ (పుట-261) అని అనగలిగినారు.
అట్లా అనగలిగిన తెలంగాణ ప్రేమికుడు అయినప్పటికీ, ఆలోచనలో, విశ్లేషణలో చాలా మంది కంటే ఎత్తులో ఉన్నప్పటికీ, ఆ కాలంనాటి సాహిత్యం గురించి, ఆంధ్రోద్యమం గురించి అంతకు ముందు ఎవరూ చేయని ఎన్నో కొత్త ప్రతిపాదనలు చేసినప్పటికీ, కొన్ని విషయాల్లో ఆయన చేసిన విశ్లేషణతో ఏకీభవించడం కష్టం.
‘‘ఇక్కడ ఏ గురజాడ అప్పారావూ, వీరేశలింగమూ ఆ ఉదయానికి ఆహ్వానం పలకలేదని గుర్తించవలసి ఉన్నది’’ (పుట-6). ‘‘ఇరవయ్యో శతాబ్దం మొదటి సగంలో తెలంగాణలో కేవల సాహిత్యంగా చెప్పుకోదగ్గది చాలా తక్కువ’’(పుట-11) లాంటి వాటి గురించి చాలా చర్చ జరుగవలసిన అవసరం ఉన్నది.
ఆ కాలంనాటి(1900-1940) సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామ దృశ్యాన్ని విశ్లేషించినంత సమగ్రంగా సాహిత్యాన్ని గురించికూడా మరింత విపులంగా విశ్లేషించి ఉంటే బాగుండేది. అందుకు తగిన సమర్థత ఉండి కూడా సమయాభావమో, సమాచార అలభ్యతో - ఏ కారణంగానో ఆయన ఆ పని చేయలేకపోయినారు. సరే, ఇలాంటివి కొన్ని వదిలేస్తే తెలంగాణ ఆధునిక సాహిత్య ఆవిర్భావ వికాసాల గురించి తెలుసుకోగోరే పాఠకులు, పరిశోధకులు అనివార్యంగా చదువవలసిన గొప్ప గ్రంథం.
(తెలంగాణ సాహిత్య వికాసం: ఆధునికత వైపు సొంత అడుగులు/ 1900-1940; రచన: కె.శ్రీనివాస్; పేజీలు: 560; వెల: 300; ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు)
డా॥సుంకిరెడ్డి నారాయణరెడ్డి,
9885682572