గాలిబ్ అంటే అర్థం ఉన్నతమైన అని. ‘గాలిబ్‌కు గాలిబే సాటి’ అని వినయంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్న మహాకవి గాలిబ్. అసలు పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ (1797–1869). ఆగ్రాలో జన్మించాడు. ఉర్దూ, పర్షియా, అరబిక్ భాషల్లో రాశాడు. తన కాలానికి ఆధునిక కవి. చిన్న మాటలతోనే పెద్ద భావాన్ని పలికించాడు.
మనిషిలోని దుఃఖం, ఊహాప్రేయసి, ప్రేమ, శృంగారం, విరహం, కరుణించని ప్రేయసి కాఠిన్యం, స్వీయాన్వేషణ, నీతి, సౌకుమార్యం, జీవితపు గాఢత, మానవుడి అంతరంగ లోతు, ఒంటరితనపు క్షోభ, బతుకు రుచి, లోకరీతి, ఏదీ శాశ్వతంగా ఉండిపోదన్న వాస్తవం... ఇలాంటివన్నీ గాలిబ్ కవితల్లో కనిపిస్తాయి.
అందంతో ఆరోగ్యవంతుల్ని చేసే ప్రేయసి గురించి గాలిబే రాయగలడు! ప్రేమకు ప్రేమే బాధ, ప్రేమే చికిత్స అని గాలిబే చెప్పగలడు! ‘మనమనుకుంటాం మనమితరులతోనే మోసపోతామని, కాని వాస్తవానికి మనం మనతోనే ఎక్కువ మోసపోతాం’ అని గాలిబ్ మాత్రమే పాడగలడు. మనిషి మనిషిగా బతకడం ఎంత కష్టమో అని గాలిబ్ మాత్రమే వాపోగలడు(‘నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము’). ‘స్వర్గమును గూర్చి నాకు సర్వమ్ము తెలియు, మనసు సంతసపడుటకు మంచి ఊహ’ అని గాలిబ్ మాత్రమే తేల్చగలడు! తెలుగు వరకూ గాలిబ్‌ను అర్థం చేసుకోవడానికి దాశరథి అనువదించిన గాలిబ్ గీతాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
Published Mon, Nov 26 2018 12:38 AM | Last Updated on Mon, Nov 26 2018 12:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment