‘మిషన్’కు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో సుమారు రూ.25 వేల కోట్ల ఖర్చుతో 46 వేల చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ (ట్రిపుల్ఆర్)ద్వారా కొంతమేర నిధులు రాబట్టుకోవడంలో సఫలమైన ప్రభుత్వం వరల్డ్బ్యాంకు, జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) నిధులను తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగింది.
మొత్తంగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 9,577 చెరువులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 4,873 చెరువుల పనులు ఆరంభమై పనులు కొనసాగుతున్నాయి. మున్ముందు పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం నాబార్డ్, కేంద్రాన్ని సాయం కోరింది. చిన్న తరహా సాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా 1,600 చెరువులకు రూ.380 కోట్లు ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా 90 శాతం, 10 శాతం వాటాలతో ట్రిపుల్ఆర్ పథకం కింద 335 చెరువుల పునరుద్ధరణకు రూ.292 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది.
మరో రూ.2,500 వేల కోట్ల కోసం...
సామాజిక ఆధారిత చెరువుల నిర్వహణ ప్రాజెక్టు కింద సుమారు 5వేల చెరువుల పునరుద్ధరణకు రూ.2,500 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరిపేందుకు సమాయత్తమయ్యారు. గతంలో సైతం వరల్డ్ బ్యాంకు 1,182 చెరువుల పునరుద్ధరణకు రూ.436 కోట్లు కేటాయించింది. ఇక జైకా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టిన సర్కారు చిన్నతరహా వనరుల పునరుద్ధరణకు వారి నుంచి ఆర్థిక చేయూత కోసం ప్రయత్నిస్తోంది.