కెనడా నుంచి అలా వచ్చా: నేహా శ్రీకరం
కొత్తపేట : పుట్టి పెరిగింది కెనడాలో అయినా.. కోనసీమలో సందడి చేస్తోంది వర్ధమాన హీరోయిన్, ‘మిస్ వరల్డ్ కెనడా’ నేహా శ్రీకరం. హిందీ, బెంగాలీ సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల బొమ్మ ఇప్పుడు తెలుగు తెరపై కనిపించబోతోంది. ఎంఏ జర్నలిజం కోర్సు పూర్తిచేయడమే కాదు.. మిస్ వరల్డ్ కెనడా కిరీటాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పీసీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘తాతగారింటికి వెళ్లొద్దాం రండి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె షూటింగ్ కోసం మందపల్లి వచ్చింది. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తన కుటుంబం, కెరీర్ గురించి చెప్పుకొచ్చింది.
ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం..?
జవాబు: నాన్న శ్రీచరణ్ బిజినెస్‌మేన్. కెనడా (టొరంటో)లో ఎస్.ఆర్.కిచెన్స్, స్టార్ హోటల్ అధినేత, అమ్మ రజని గృహిణి. నాన్న స్వస్థలం ఢిల్లీ అయినా 30 ఏళ్ల కిందటే కెనడాలో స్థిరపడ్డారు.
ప్రశ్న: విద్యార్హతలు..?
జవాబు: ఎమ్ఎ జర్నలిజం, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేశాను. టీవీ చానల్స్‌కు సృజనాత్మక, మానవీయ కథనాలు అందించాను.
ప్రశ్న: మిస్ వరల్డ్ కెనడాగా ఎప్పుడు ఎంపికయ్యారు?
జవాబు: ముందు వివిధ వేదికలపై అందాల పోటీల్లో ప్రయత్నించాను. 2012-13 సంవత్సరానికి మిస్ వరల్డ్ కెనడాగా ఎంపికయ్యాను.
ప్రశ్న: సినీ పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు?
జవాబు: మా నాన్నగారికి ‘తాతగారింటికి’ సినిమాలో తాతయ్య పాత్ర పోషిస్తున్న హోటల్ రంగానికి చెందిన ప్రముఖుడు మంతెన సుందరనాగరాజు మంచి మిత్రులు. ఆయనకు సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఆయన ప్రోత్సాహంతో ప్రవేశించాను.
ప్రశ్న: ఏవైనా సినిమాల్లో నటించారా?
జవాబు: హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తున్నాను. బెంగాలీ సినిమాలో రూపాగంగూలీ (‘మహాభారత్ హిందీ సీరియల్ ద్రౌపది పాత్రధారి) కుమార్తెగా నటించాను. తెలుగులో ‘తాతగారింటికి’ తొలి సినిమా.