వరి‘సిరులు’ కురిసేనా?
వ్యవసాయశాఖ ప్రణాళిక
ఖరీఫ్ నుంచే అమలు
తోట్లవల్లూరు : వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పెరుగుతున్న ఆహార ఉత్పత్తుల డిమాండ్‌కు అనుకూలంగా సాగుఖర్చులను తగ్గించుకుని, అధిక దిగుబడుల సాధనే లక్ష్యంగా వ్యవసాయశాఖ ముందుకు సాగనున్నది. ఇప్పటికే ఈ ఏడాది ఖరీఫ్ ప్రణాళిక రూపొందించే పనిలో పడింది. ఇందుకోసం ఇక్రిశాట్ ఆధ్వర్యంలో మిషన్ప్రాజెక్టును అమలు చేయనుంది. సగటు దిగుబడికన్నా తక్కువ ఉత్పత్తి ఉన్న గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఈ పథకాన్ని అమలు చేసి ఫలితం సాధించాలని భావిస్తున్నారు.
కార్యక్రమం ఇలా...
వర్షాభావ పరిస్థితులను అధిగమించి దిగుబడులను పెంచేందుకు ప్రతి గ్రామంలో 25 హెక్టార్లను ఎంపిక చేస్తారు. భూసార పరీక్షల నుంచి మార్కెటింగ్ వరకు అంతా వ్యవసాయశాఖ పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. వ్యవసాయశాఖ అందించే ఫౌండేషన్ విత్తనాన్ని గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా గ్రామాల్లో వినియోగిచడమే కాకుండా తద్వారా వచ్చే దిగుబడులను నూతన విత్తనంగా వాడతారు .అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా పంటబోదెల తవ్వకం పనులు చేస్తారు.
త్వరగా పంట నేలకొరగని విత్తనాలను ఎంపిక చేసుకుని,పంట ఒత్తుగా లేకుండా చూస్తారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహనా తరగతులు నిర్వహిస్తారు. సాగు ఖర్చులు తగ్గిం చేందుకు వెదజల్లే పద్ధతి అవలంభిస్తూ వ్యవసాయశాఖ అందించే సబ్సిడీ యంత్ర పరికరాలు వినియోగించేలా చూస్తారు.
సేంద్రీయ సాగును ప్రోత్సహించడంలో భాగంగా పచ్చిరొట్ట విత్తనాలు, వర్మి కంపోస్టు యూనిట్లు, బయోఫెర్టిలైజర్స్‌ను రైతులకు సబ్సీడీలపై అందజేస్తారు. గ్రామాలలో ధాన్యాన్ని భద్రపరచుకునేందుకు నాబార్డు సహకారంతో గోదాముల నిర్మించి, రైతుకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను సబ్సిడీపై అందుబాటులో ఉంచుతారు.
అధిక, మేలైన దిగుబడుల సాధనకే
వరి పంట ఉత్పాదకతను పెంచేందుకు వ్యవసాయశాఖ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తాయి. ముఖ్యంగా భూసారాన్ని పెంచడంతోపాటు, పెరుగుతున్న సాగు ఖర్చులు అధిగమించడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. దిగుబడులు సాధించటంతోపాటు సరైన గిట్టుబాటు ధర లభించటానికి ఆస్కారం కలుగుతుంది.
- జివి శివప్రసాద్, మండల వ్యవసాయాధికారి, తోట్లవల్లూరు