ఉత్తరకొరియాకు సాయం చేసిన రష్యా!
ప్యాంగ్యాంగ్/వాషింగ్టన్: ఖండాతర క్షిపణి సామర్ధ్యం కోసం ఉత్తరకొరియా ఎంతగా పరితపించి పోయిందో అందరికీ తెలుసు. అమెరికాపై కాలు దువ్వుతూ త్వరలోనే ఖండాతర క్షిపణి సామర్ధ్యం సాధిస్తామని ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ పలుమార్లు స్పష్టం చేశారు. అదే థ్యేయంతో ఈ నెల 4వ తేదీన జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షలో విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా అమెరికా షాక్కు గురైంది. అయితే, ఖండాంతర క్షిపణి సామర్ధ్యాన్ని ఉత్తరకొరియా సొంతగా సాధించలేదనే అనుమానం వ్యక్తమవుతోంది.
అమెరికా వినాశనం కోరి రష్యాయే ఆ టెక్నాలజీని ఉత్తరకొరియాకు రహస్యంగా అందించిందనే వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. ఇందుకు అమెరికాకు చెందిన ఓ ఆయుధాల నిపుణుడు మిచెల్ ఇల్లేమాన్ చేసిన వ్యాఖ్యలే కారణం. ఉత్తరకొరియా పరీక్షించిన క్షిపణి ఇల్లేమాన్ అది రష్యా క్షిపణి టెక్నాలజీని పోలి ఉందని అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియెట్ క్షిపణులను తాను పరిశీలించానని, చాలా కాలం తర్వాత అదే విధమైన క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందని ఆయన అన్నారు. దీంతో రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ఈ మిసైల్ తయారీకి సహకరించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇందుకు ఉదాహరణగా ఓ ఘటనను ప్రస్తావిస్తూ.. 1962లో ఉత్తరకొరియా వెళ్లేందుకు రష్యాకు చెందిన 60 మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారని, డబ్బులు తీసుకుని మిసైల్ టెక్నాలజీని ఉత్తరకొరియాకు అందించాలని వారు భావించినట్లు చెప్పారు. సరిహద్దు దాటేందుకు కుటుంబాలతో సహా సిద్ధమవుతుండగా వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. అనంతరం రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియాకు ఈ టెక్నాలజీని అందించడంతో ఈ క్షిపణులు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.