దెయ్యం ఇంట్లో చిక్కుకున్న నటి !
మచ్చాన్ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే అందాల భామ నమిత చాలా గ్యాప్ తరువాత కథానాయకిగా నటించిన చిత్రం మియా. ఈ స్టూడియో పతాకంపై మిన్రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాథ్యూ, ఆర్ఎన్.రవి ద్వయం దర్శకత్వం వహించారు. ఈ దర్శక ద్వయం స్పీడ్ అనే మలయాళ చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందారన్నది గమనార్హం. ఈ మియా చిత్రంలో నమితతో పాటు నటి సోనియా అగర్వాల్, వీరా, బేబి ఇలా ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి రెజమోన్ సంగీతాన్ని, రవిస్వామి ఛాయాగ్రహణం అందించారు.
చిత్ర వివరాలను దర్శక ద్వయం తెలుపుతూ ఇది హర్రర్ ఇతి వృత్తంతో తెరకిక్కించిన కథా చిత్రం అని తెలిపారు. అయితే ఇందులో దెయ్యం భయపెట్టడంగానీ, బాధించడంగానీ జరగదన్నారు. ఇందులో భార్యాభర్తల మధ్య మనస్పర్థలే ప్రధాన ఇతివృత్తం అన్నారు. కథానాయకి నమితకు ఆమె భర్తకు మధ్య భేదాబిప్రాయాలు ఏర్పడతాయన్నారు. అలాంటి సమయంలో ఒక దెయ్యం ఇంట్లో చిక్కుకున్న నమిత ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన మియా చిత్ర షూటింగ్‌ను కేరళ, తిరువనంతపురం, థాయిల్యాండ్‌లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.