జీ..హుజూర్ !!
► అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే కేసులు
► కదిరి ఎమ్మెల్యే వాహనంపై దాడికేసులో నిందితులను తప్పించిన వైనం
► ఉరవకొండ హత్య కేసులోనూ
► పాత్రధారులను తప్పించేందుకు రంగం సిద్ధం
► నెల గడుస్తున్నా లాయర్ శ్రీరాములును అరెస్టు చూపని వైనం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
► ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం జన్మభూమి కమిటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలను నియమించింది. ఈ కమిటీ ఎవరి పేర్లు చెబితే వారు లబ్ధిదారుల జాబితాలో ఉంటారు.’
►‘ అనంత’లో ఏ కేసులో ఎవరి పేరు చేర్చాలి? ఎవరు పేరు తొలగించాలనే సూచనలు కూడా అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. బాధాకరమేంటంటే పోలీసులు కూడా ‘జీ హుజూర్’ అని వారి చెప్పినట్లుగానే కేసులు తారుమారు చేస్తున్నారు.’
\తాజాగా ‘అనంత’లో వెలుగు చూస్తున్న కేసుల తారుమారు అంశం సామాన్య ప్రజల్లో భయాందోళనలను రేపుతోంది. పోలీసులే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుంటే శాంతి భద్రతలు ఏ మేరకు అదుపులో ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా తలుపుల మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల వెళ్లారు. ఆయన కారుపై కొందరు రాళ్లు వేసి దాడికి యత్నించారు. బాషా అనే వ్యక్తి రాళ్లు వేసినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తలుపుల టీడీపీ నేత గరికపల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు ఆదేశాలతోనే తాను దాడి చేశానని బాషా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తీరా పోలీసులు కేసు మాత్రమూ బాషా, గరికపల్లి కుమారుడిపై కాకుండా ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని అశోక్ అనే వ్యక్తిపై నమోదు చేశారు.
ఉరవకొండలో హ త్యకేసు తారుమారుకు యత్నం
ఉరవకొండలో మార్చి 17న వెంకటేశ్ అనే టీడీపీ నేత పోలీస్ స్టేషన్ పక్కనున్న ఆర్అండ్బీ అతిథిగృహంలో హత్యకు గురయ్యారు. విడపనకల్లు ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, లాయర్ శ్రీనివాసులు తన భర్తను హత్య చేశారని వెంకటేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కూడా మార్చి 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వీరిద్దరితో పాటు మరికొందరు ఈ కేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు చార్జ్‌షీటు ఫైలు చేసి కేసును కోర్టు ముందు ఉంచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. చార్జ్‌షీట్‌లో ప్రతాప్, శ్రీనివాసులు పేర్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హత్యకు ప్రధాన కారకులైన వారిని తప్పించి, ఘటనతో సంబంధం లేని వ్యక్తులను కేసులో చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ కేసును తారుమారు చేసేందుకు సిద్ధమయ్యారని అక్కడి విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా శ్రీనివాసులు వృత్తి రీత్యా లాయర్. ఒక లాయర్‌ను అరెస్టు చేస్తే 24 గంటల్లోపు కోర్టుకు హాజరు పర చాలి. లేదంటే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలి. కానీ ఇన్ని రోజులుగా శ్రీనివాసులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇలాంటి కేసులే తారుమారవుతున్నాయంటే బయటి ప్రపంచానికి తెలీయకుండా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల పరిస్థితి ఏంటో ఇట్టే తెలుస్తోంది.
నేరాలకు సంబంధించి అసలు నేరస్తులను తప్పించి, మరొకరిని బాధ్యుల్ని చేస్తే నేరస్తులు మరిన్ని నేరాలు చేసే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా నేరస్తులకు శిక్షపడేలా చేయడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, లేదంటే శాంతిభద్రతలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.