నిందితుల్ని తప్పించారు..
► అసలు నిందితులేరీ ?
► కదిరి ప్రాంతంలో హాట్ టాపిక్
► ఎమ్మెల్యే వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్
కదిరి : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వాహనంపై ఇటీవల జరిగిన దాడి కేసులో అసలు నిందితుల్ని తప్పించారన్న చర్చ కదిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు గురువారం రాత్రి పొద్దుపోయాక తలుపుల మండలం పూలబజార్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆగమేఘాల మీద రిమాండ్‌కు తరలించారు. అయితే దాడి జరిగిన రోజు రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మాత్రం తప్పించారట.
తెలుగుదేశం పార్టీకి చెందిన తలుపుల మండల ఓ ముఖ్య నాయకుడి కుమారుడి కోరిక మేరకు ‘అన్న’గా పిలువబడే ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడి ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడ్ని తప్పించారన్నది ప్రధాన విమర్శ. ఫలానా నాయకుడి కుమారుడి సూచన మేరకే తాము ఈ దాడి చేశామని, ఈ కేసులో తనతో పాటు మరో ముగ్గురున్నారని తొలుత పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి చెప్పడంతో వారు విషయం ‘అన్న’కు చెప్పడం.. ఆయన ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని మాత్రం ఈ కేసులో గుట్టుగా అరెస్ట్ చేసి చేతులు దులుపుకుని ‘అన్న’ను మెప్పించారని పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం.
డీఎస్పీకి ఏమైంది? :
ఇన్నాళ్లు నిజాయితీ గల పోలీస్ అధికారిగా పేరు గడించిన కదిరి డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయాడని ఇప్పుడు కదిరి ప్రాంత ప్రజల్లోనే కాకుండా పోలీస్ వర్గాల్లో కూడా ప్రధాన చర్చ. ఆయన్ను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ బదిలీ చేయిస్తారేమోనన్న భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారా అన్న మాటలు బహిరంగంగా వినబడుతున్నాయి. ఎమ్మెల్యే వాహనంపై దాడి కేసులో మూడు రోజులైనా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ గురువారం కదిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన చంద్రగిరి, ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషాతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, పార్టీ శ్రేణులు జాతీయ రహ దారిపై బైఠాయిస్తే.. డీఎస్పీ దురుసుగా వ్యవహరించడాన్ని పోలీసులే తప్పుబట్టడం కొసమెరుపు.
కదిరి ఎమ్యెల్యే కారుపై దాడిలో యువకుడిపై కేసు నమోదు
తలుపుల : మండల కేంద్రంలోని ఎగువపేట షహమీర్ ఔలియా దర్గాలో ఇటీవల కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వాహనంపై దాడి ఘటనలో యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది నేనే అంటూ శింగనపల్లికి చెందిన వెంకటనారాయణ కుమారుడు అశోక్‌కుమార్(20) అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి కేసు నమోదు చేసుకుని అశోక్‌కుమార్‌ను కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్‌ఐ జి.గోపాలుడు తెలిపారు.