ప్రొద్దుటూరు డీఎస్పీ బదిలీ
►అధికార పార్టీ నాయకుల ఆధిపత్య పోరే కారణం
►సీనియర్ టీడీపీ నేతను కలవలేదనే బదిలీ
►నాడు సీఐ.. నేడు డీఎస్పీ
ప్రొద్దుటూరు క్రైం : విధుల్లో చేరి పట్టుమని వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే అధికార పార్టీ ఆధిపత్య పోరులో పోలీసు అధికారి బలిపశువు అయ్యారు. ప్రొద్దుటూరు డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులుపై బదిలీ వేటు పడింది. ఆదివారం సాయంత్రం కడప ఎస్పీ అట్టాడ బాబూజీని కలసిన డీఎస్పీ సాయంత్రం రిలీవ్ అయి వెళ్లిపోయారు. అనంతపురం పీటీసీలో పని చేస్తున్న ఆయన ఈ నెల 14న ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. వారం రోజులు కాకముందే బదిలీ కావడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతోనే ఆయన బదిలీ అయినట్లు సమాచారం.
టీడీపీ నాయకుడ్ని కలవలేదనే..
స్థానికంగా ఉన్న అధికార పార్టీ సీనియర్ నేతను కలవనందుకే డీఎస్పీపై బదిలీ వేటు పడినట్లు వార్తలు వస్తున్నాయి. డీఎస్పీ బా«ధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడిని కలిశారు. స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారి ఇంటికి రాజ్యసభ సభ్యుడు రాగా డీఎస్పీ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం సీనియర్ నేతకు తెలిసింది. వారం రోజులు కావస్తున్నా తనకు ఫోన్ చేయడం గానీ, కలవడం గానీ జరగకపోవడం సీనియర్ నేతకు ఆగ్రహాన్ని తెప్పించింది. కేవలం తనను కలవలేదనే కారణంతోనే డీఎస్పీని బదిలీ చేయించారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్న సీనియర్ నేత ఆదివారం అక్కడే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడి ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెప్పించి బదిలీ చేయించినట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రం నుంచి ఫోన్ రావడంతో డీఎస్పీ కడపకు వెళ్లారు. ఉన్నతాధికారులకు వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు రిలీవ్ అయ్యారు. ప్రభుత్వ సిమ్ కార్డును స్థానిక పోలీసు అధికారులకు అప్పగించి, తాను తెచ్చుకున్న ఛైర్‌ను తీసుకొని వెళ్లారు. ఆరు నెలల నుంచి ప్రొద్దుటూరు డీఎస్పీ కుర్చీ ఖాళీగా ఉండగా, ఎట్టకేలకు ఉన్నతాధికారులు డీఎస్పీని నియమించారని పట్టణ వాసులు భావించారు. అయితే అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరుతో డీఎస్పీ బదిలీ కావడాన్ని పోలీసు అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు.
సీఐల విషయంలోనూ అంతే..
గతంలో ప్రొద్దుటూరు అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన సీఐ శ్రీనివాసులు విషయంలో కూడా ఇలాగే జరిగింది. సీఐ కడప ఎస్పీని కలవడానికి వెళ్తుండగా దారిలో ఉండగానే వెనక్కి వెళ్లాలని ఉన్నతాధికారి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తిరిగి ప్రొద్దుటూరుకు రాకుండానే సీఐ వెళ్లిపోయారు. కడపలో పని చేస్తున్న సీఐ సదాశివయ్యను ఎర్రగుంట్లకు బదిలీ చేశారు. అయితే ఆ ప్రాంత టీడీపీ నాయకుడికి తెలియకుండా బదిలీ చేశారనే కారణంతో సీఐని విధుల్లో చేరనివ్వలేదు. ఇలా మితి మీరిన రాజకీయ జోక్యంతో పోలీసు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ వర్గ పోరులో ప్రొద్దుటూరుకు రావాలంటేనే పోలీసు అధికారులు భయపడే పరిస్థితి వస్తోంది.