అధికారపక్షం అభీష్టమే ప్రక్షాళన!
సాక్షి, రాజమండ్రి : ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను భ్రష్టు పట్టించింది. ఎస్సై స్థాయి వరకూ పోలీసు శాఖను ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పటికే ఎస్పీల బదిలీలు పూర్తయ్యాయి’ రాజమండ్రిలో బుధవారం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పిన మాటలివి. ఈ మాటలు శాఖలో కిందిస్థాయి అధికారులకు కూడా స్థానచలనాలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికార గణానికి బదిలీల అవస్థ తప్పదు. మిగిలిన శాఖల్లో ఈ పరిస్థితి ఎక్కువ అయినా.. పోలీసు శాఖలో కేవలం డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల వరకే పరిమితమవుతుంది. కానీ ఇప్పుడు హోం మంత్రి కిందివరకూ మార్పులు తప్పవని చెపుతున్నారు.
జిల్లాలో 73 పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నలుగురు డీఎస్పీలు, 43 మంది సీఐలు, 141 మంది ఎస్సైలు పనిచేస్తున్నారు. రాజమండ్రి అర్బన్‌జిల్లాలోని 16 స్టేషన్‌ల పరిధిలో 9 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు ఉండగా స్టేషన్‌కు ఇద్దరి నుంచి ముగ్గురు ఎస్సైలున్నా రు. వీరంతా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. గత ఫిబ్రవరిలోనే జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన విజయ్‌కుమార్ ప్రభుత్వం మారగానే మళ్లీ బదిలీ అయ్యారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ కావడం పరిపాటే అనుకున్నా.. ప్రస్తుతం ఆ పరిధిని చిన్న అధికారుల దాకా వర్తింపచేయడం పట్ల ప్రతిపక్షాల స్థానిక నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
టీడీపీ వారు రెచ్చిపోయే ముప్పు..
ఎస్సైల స్థాయి వరకూ పోలీసు శాఖను ‘ప్రక్షాళన’ చేయడంలో అధికార పార్టీ స్థానిక నేతల పాత్రే ఎక్కువ ఉండబోతోంది. ఎస్సైల ఎంపికలో మండల స్థాయి నేతల మనోభీష్టాలు పరిగణనలోకి తీసుకుని, వారికి అనుకూలురను నియమించేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎక్కువ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారంలో ఉంది. అన్ని శాఖల అధికారులు తమకు అనువైన వారుంటే తిరుగుండదు అనే ఆలోచనతో మండల స్థాయి నేతలు కూడా తమ ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేస్తున్నారని, ఈ నేపథ్యంతోనే హోం మంత్రి నోట ఎస్సై స్థాయి వరకూ ప్రక్షాళన అన్న మాట వచ్చిందని భావిస్తున్నారు. కాగా ఈ ప్రక్షాళన తమకు సమస్యలు తెచ్చి పెడుతుందని ప్రతిపక్షాల స్థానిక నేతలు ఆందోళనకు గురవుతన్నారు. అధికార పార్టీ నేతలు అధికారులను అడ్డు పెట్టుకుని తమపై అక్రమ కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడతార ని భయపడుతన్నారు. అంతే కాక ఇసుక, మ ద్యం, మైనింగ్, ల్యాండ్ తదితర మాఫియాలు అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోయే అవకాశం ఉందంటున్నారు.