ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ ఫైట్
కాలూరు వేదికగా డిష్యూం.. డిష్యూం..
టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఎమ్మెల్సీపై చేయి చేసుకోవడంపై చర్చ పిలవకున్నా వచ్చి రాద్దాంతం చేస్తున్నందుకేనని సమర్థన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై కేసు.. బాజిరెడ్డిపై ఫిర్యాదు.. ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇద్దరూ అధికారపార్టీకి చెందిన వారే. ఒకరు శాసనసభ్యులు, ఇంకొకరు శాసనమండలి సభ్యులు. ఇద్దరి మధ్య పొడచూపిన అంతర్గత విభేదాలు శనివారం నిజామాబాద్ మండలం కాలూరు వేదికగా బయడపడ్డాయి. కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డి వర్గీయుల మధ్యఫ్లెక్సీలో ఫొటోలు పెట్టలేదని మొదలైన గొడవ.. చివరకు చినికి చినికి గాలివానగా మారింది.
ఎమ్మెల్సీ ఫొటోలు ఫ్లెక్సీలో పెట్టలేదని మహిళ సంఘం భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ అనుచరలు నిరసన తెలుపుతుండగా.. కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి ధర్మారం రమాకాంత్‌పై చేయి చేసుకున్నాడు. ఇదేమిటనే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రశ్నించే క్రమంలో ఎమ్మెల్సీపై కూడా బాజిరెడ్డి గోవర్ధన్ చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఇరువర్గాలు బాహాబాహీకి దిగగా అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దు మణిగింది. కాగా ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేయి చేసుకోవడం దారుణమైన చర్యగా ఆ పార్టీలోని కొందరు బహిరంగంగానే మాట్లాడుతుండగా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంబంధం లేకుండా ఆయన నియోజకవర్గంలో వైరివర్గాలతో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటుండటం.. తరచూ పిలవడం లేదంటూ ప్రొటోకాల్ పేరిట రాద్దాంతం చేస్తుండటమే గొడవకు కారణమని ఎమ్మెల్యే వర్గీయుులు సమర్థిస్తున్నారు.
ఎమ్మెల్సీపై కేసు.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
నిజామాబాద్ మండలం కాలూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డ్డిల మధ్య జరిగిన వాగ్వాదం, ఘర్షణపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన తనను కొట్టారంటూ నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో మున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్సీపై 353, 506, రెడ్‌విత్ 34 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దాడి చేశారని ఎమ్మెల్సీ వర్గీయుడు కుమార్‌రెడ్డి నిజామాబాద్ రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా వుండగా రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ప్రొటోకాల్ వివాదం చివరకు ఎమ్మెల్సీపై చేయి చేసుకునే స్థాయికి చేరిన అంశం జిల్లాలో చర్చనీయాంశం కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బహిరంగంగా వాగ్వాదానికి దిగడం, చేయి చేసుకునే స్థాయికి వెళ్లడం రాష్ర్టంలో ఇదే మొదటి సంఘటన.
రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు
సంచలనం కలిగించిన నిజామాబాద్ మండలం కాలూరు సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై చేయి చేసుకునే పరిస్థితిపై ఆయన వివరాలు అడిగి తెలిసుకున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరినీ వేర్వేరుగా ఈ సంఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది.
నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో డ్వాక్రా మహిళలకు నిర్మించిన మహిళ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిల చోటు చేసుకున్న వాగ్వాదం కారణాలను పార్టీకి చెందిన కొందరు సీనియర్లను సీఎం అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం. ఈ సంఘటనకు ముందు, తర్వాత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మొదటి నుంచి చివరి వరకు ప్రత్యక్షసాక్షి నిలవగా.. వీజీ గౌడ్ ఇచ్చే వివరాలు కీలకం కానున్నాయి.
ఇదిలా వుండగా రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఉదంతం, అందుకు దారి తీసిన కారణాలు, వాస్తవఅవాస్తవాలపై లోతుగా పరిశీలన చేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ అంతర్గత వ్యవహారంకు సంబంధించిన కాలూరు సంఘటనపై అన్నికోణాల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ విచారణ మొదలైంది.