బెడిసికొట్టిన టీడీపీ కుట్ర
► పార్టీ మారుతున్నామన్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
► వైఎస్సార్సీపీని వీడేది లేదని ఎమ్మెల్యేలు కలమట, కళావతి, కంబాల స్పష్టీకరణ
► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని స్పష్టీకరణ
► వై.ఎస్.జగన్‌ను సీఏం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన
విశాఖపట్నం: టీడీపీ రాజకీయ కుయుక్తులపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారన్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టింది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్న విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై తమ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాడతామన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడం ద్వారా రాష్ట్రంలో దివంగత వై.ఎస్. సంక్షేమ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.
బెడిసికొట్టిన చంద్రబాబు కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్‌ను దొంగ దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు వేసిన కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంపై దుష్ర్పచారానికి తెగబడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు 10మంది టీఆర్ఎస్లో చేరిపోయారు.
ఆ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతోంది. ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌పై దుష్ర్పచారానికి తెగబడ్డారని తేటతెల్లమైంది. అందుకే చంద్రబాబు తమ అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని ప్రచారానికి తెరతీశారు. కానీ దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు సమష్టిగా తిప్పికొట్టడంతో టీడీపీ బిత్తరపోయింది.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు
రెండేళ్లలోనే చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే సీఎం చంద్రబాబు గోదావరి పురష్కరాలకు 1200 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు, విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఏలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు సంక్షేమం, ఉద్యోగుల జీతాలు లేవంటూ ప్రచార ఆర్భాటం కోసం ఇంత సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అభివృద్ధికంటే దోచుకోవడానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తన ప్రభుత్వ సొమ్మును అనమాయులకు దోచుపెడుతున్నారని ఆరోపించారు.
వై.ఎస్.జగన్ వెన్నంటేనని స్పష్టీకరణ
పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పార్టీ ఎమ్మెల్యేలు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్కాంగ్రెస్లోనే కొనసాగుతామని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జగన్ వెన్నంటి నిలుస్తామన్నారు. జగన్‌ను సీఎం చేయడం ద్వారా దివంగత వై.ఎస్. సంక్షేమ పాలనను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు.
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
‘సీఎం చంద్రబాబుకు మతిభ్రమించి వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. చంద్రబాబు రెండేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. వై.ఎస్.జగన్ మాత్రమే నిస్వార్థంగా ప్రజల వెన్నంటి ఉంటున్నారు. ఇప్పటికే పలు మార్లు అధికార టీడీపీ కుయుక్తులు పన్నినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీవైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన అధికార టీడీపీని భూస్థాపితం చేసి వైఎస్సార్సీపీని గెలుపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు’
- ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల
టీడీపీలో చేరాల్సిన అగత్యం లేదు
‘ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న టీడీపీలో చేరాల్సిన అగత్యం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్ర ప్రజలు అంతా వై.ఎస్.జగన్ వెన్నంటి ఉన్నారు. చంద్రబాబు వైఖరి వల్ల తెలంగాణలో టీడీపీ నేతలందరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇది మింగుడుపడక ఆంధ్రాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు దుష్ర్పచారం చేస్తూ టీడీపీ కుట్ర పన్నుతోంది. కుట్రను ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించి వై.ఎస్. జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిశ్చయానికి వచ్చేశారు.’
- గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు
టీడీపీ డ్రామా..
విపక్ష ఎమ్మెల్యేలపై దుష్ర్పచారం
విజయవాడ : విపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు తమ అనుకూల వర్గ మీడియాకు లీకులిచ్చారు. వైఎస్సార్సీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు వాటిని ఖండించటంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. ఎమ్మెల్యేల ఖండనతో టీడీపీ నాయకులు కిక్కురుమనలేదు. ఛానళ్లలో వచ్చిన స్క్రోలింగ్‌లు కూడా ఆగిపోయాయి.
అధికార పక్షం కుట్రలు...
గత కొంతకాలంగా కృష్ణాజిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరతారంటూ అధికార పార్టీ వారు ప్రచారం చేస్తూ వచ్చారు. దీనిని నమ్మించేందుకు వ్యూహాలు పన్నారు. వారి ఎత్తులను చిత్తు చేస్తూ పలుమార్లు ఎమ్మెల్యేలు ఖండనలు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో తాము ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు, ఓటర్లు గెలిపించారని, ఆ ఓటర్లు ఏం చెబితే అది చేస్తామని స్పష్టం చేశారు. అంతేకానీ పార్టీలు మారే సంస్కృతి తమకు లేదని తెగేసి చెప్పడంతో టీడీపీ వారు నోరు మెదపలేదు. ప్రతిపక్షాన్ని వీక్ చేసే కుట్రలో భాగంగానే అధికారపక్షం తమ అనుకూల మీడియాకు లేనిపోని లీకులిస్తోందని పలువురు వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అవకతవకలు బయటపడతాయనే...
జిల్లా టీడీపీలో అవినీతి పరుల భరతం పట్టేందుకు వైఎస్సార్సీపీ వ్యూహరచన చేస్తున్నట్లు పలువురు ముఖ్య నాయకులు చెప్పారు. ఇప్పటికే అటువంటి వారి జాబితాలు తయారు చేశామన్నారు. బినామీలను రంగంలోకి దించి పబ్బం గడుపుకుంటున్న నేతల వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
రాజధాని ప్రాంతంలో లంకభూములు కొనుగోలు చేసిన వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని వారు వివరించారు. ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే తమ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. దుష్ర్పచారాలు మాని ప్రజల పక్షాన పనిచేసేందుకు పూనుకోవాలని టీడీపీ వారికి హితవు పలుకుతున్నారు.
తుది వరకు జగన్ వెంటే
నూజివీడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా తుదివరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను టీడీపీలోకి వస్తున్నట్లుగా ఆ పార్టీ వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పుడు జిల్లాలో వైఎస్సార్ సీపీలో చేరిన తొలివ్యక్తిని తానేనని గుర్తుచేశారు. మోసం చేయడమనేది తన రక్తంలోనే లేదని, చివరికంటా వెంటే ఉంటానని, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్నట్లుగా అందరి దృష్టినీ మళ్లించడానికి టీడీపీ నాయకులు వేస్తున్న చౌకబారు ఎత్తుగడ ఇదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకొక ఎమ్మెల్యే టీడీపీని వీడి వెళ్లిపోతుంటే వారిని నిలువరించుకోలేక, ఇతర పార్టీ ఎమ్మెల్యేలపై ఇలాంటి దుష్ర్పచారం చేయడం వారికే చెల్లిందన్నారు. టీడీపీ అనేది మునిగిపోయే నావలాంటిదని, దానిలో చేరి ఎవరూ మునిగిపోవాలని కోరుకోరని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల నూజివీడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ట్రిపుల్ ఐటీ ఏర్పాటుతో పాటు నేడు పట్టణ ప్రజలు కృష్ణా జలాలను తాగుతున్నారంటే అది వైఎస్ చలవేనని అన్నారు.
- నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
పార్టీ మారే ఆలోచన లేదు
విజయవాడ (లబ్బీపేట) : తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైఎస్సార్ సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తానని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన ముస్లిం మేధావుల సదస్సుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. ఒక శాసనసభ్యునిగా నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళితే పార్టీ మారుతున్నట్లేనా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో షాదీఖానా శంకుస్థాపన విషయమై చర్చించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోన్ చేస్తే వెళ్లానని తెలిపారు. అక్కడ మైనార్టీ శాఖ కార్యదర్శి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులందరూ ఉన్నట్లు చెప్పారు. మంత్రి ఉమా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారని మీడియా ప్రశ్నించగా, ఎవరు వస్తున్నారో ఆ విషయం ఆయన్నే అడగండని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు. మీడియా ప్రతిసారీ తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు.
- విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
టీడీపీ మునిగిపోతున్న నావ
టీడీపీ మునిగిపోయే నావ. సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ తెలియనిది కాదు. వైఎస్సార్సీపీని వీడేది లేదు. కొన్ని పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తలు బాధాకరం. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో వారి నుంచి దూరమవుతున్న టీడీపీలో ఎవరైనా చేరారంటే అది హాస్యాస్పదమే అవుతుంది. ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయడం టీడీపీ నైజం. తెలంగాణలో దుకాణం సర్దేసిన టీడీపీ ఆంధ్రలో చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి.
- ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
పార్టీ వీడే ప్రశ్నే లేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నే లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున రాజాం ఎమ్మెల్యేగా గెలిచా. రాష్ట్రంలో పార్టీకి 67మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లలో ఎవరూ కూడా పార్టీ వీడరు. టీడీపీ మైండ్‌గేమ్ బయటపడుతోంది. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. అక్కడ ఆ పార్టీ ఖాళీ అయిపోవడంతో ఆంధ్రాలో కూడా ఇలాగే జరుగుతుందని ఊహించి ముందస్తు జాగ్రత్తగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేరిపోతున్నారని ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో దుర్మార్మ పాలన నడుస్తోంది. టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, వాటి పరిష్కారం కోసం కలసి పనిచేస్తున్నాం.
- రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
గ్రేటర్ ఫలితాలతో దిమ్మతిరిగింది
గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిన చంద్రబాబు మైండ్‌గేమ్‌కు తెరతీశారు. చంద్రబాబు నాయుడుకు పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్ ఫలితాల్లాగే ఆంధ్రాలో కూడా చుక్కెదురవుతుంది. పార్టీలో ఉన్న నాయకులు బయటకు వెళ్లిపోకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. తెలంగాణాలో టీడీపీ పని చాపచుట్టేసినట్టే. 2019 ఎన్నికల్లో ఆంధ్రాలోను ఆ పార్టీకి ఇదే పరిస్థితి వస్తుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం చేసే కంటే టీడీపీలో ఉన్న వారు జారిపోకుండా బాబు చూసుకోవాలి. ప్రజాఆమోదం కోల్పోయిన చంద్రబాబుకు ఇలాంటి మైండ్‌గేమ్‌లు కొత్త కాదు.
- పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
పచ్చరోతలవీ..
⇒ చంద్రబాబూ నీచ రాజకీయాలు మానుకో
⇒ మేం వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే...
⇒ తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా
⇒ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హెచ్చరిక
పార్టీ మారుతున్నట్లు తమ అనుకూల మీడియాలో చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని కట్టిపెట్టాలి... తమపై తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా పరువు నష్టం దావా వేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని గొట్టిపాటి అన్నారు. 2009లో జగన్ కోసమే రెండేళ్ల ముందే పదవిని వదులుకున్నామని గుర్తు చేశారు. ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచాం. ఆ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో టీడీపీ ప్రజలఆదరణ, నమ్మకం కోల్పోవడంతో ఈ తరహా డ్రామాలకు చంద్రబాబు తెరలేపుతున్నారు. టీడీపీకి ఓట్లు వేసిన వారు కూడా చీదరించుకునే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
తెలంగాణాలో టీడీపీ నావ మునిగిపోతోంది...జనం దృష్టిని మరల్చడానికి ‘పచ్చ’రా(రో)తలు రారుుస్తూ సీఎం చంద్రబాబు పైశాచిక ఆనందంపై జిల్లాకు చెందిన ఆరుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మతిపోరుు ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌లు తమవద్ద చెల్లవంటూ హెచ్చరించారు.
ఒంగోలు: చంద్రబాబునాయుడు తన నీచ రాజకీయాలు మానుకోవాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హితవు పలికారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నామని, తాము పార్టీ మారుతున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని కట్టిపెట్టాలని వారు హెచ్చరించారు. తమపై తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సంతమాగులూరు కేఎంసీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కొందరు తెలుగుదేశంలో చేరుతున్నట్లుగా పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. ‘మీ కళ్లముందు ఆరుగురు సమష్టిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాసినవారిపై, చెప్పేవారిపై పరువునష్టం దావా వేయడానికి వెనుకాడమని’ ఆయన హెచ్చరించారు. లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పత్రికల్లో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. 2009లో జగన్ కోసమే రెండేళ్ల ముందే పదవిని వదులుకున్నామని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, అసత్య ప్రచారం నమ్మవద్దని కోరారు.
కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు మాట్లాడుతూ 2004 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో శాసనసభ్యునిగా ఎన్నిక అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ కుటుంబంతోనే ఉన్నానన్నారు. రాజకీయాలు కొత్త కాదని, చిన్న రాష్ట్రం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులతో ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ఫోరంలో అయినా తాము కలిసిపని చేస్తున్నామని గుర్తు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్ వెంటే జంకె...బయటకు పోయే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచామని, ఆ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభ్యులు పార్టీ మారుతున్నారంటూ చేస్తున్న గోబెల్స్ ప్రచారం చంద్రబాబునాయుడి నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇది పెద్ద మైండ్ గేమ్ అని, అన్ని రంగాల్లో టీడీపీ ప్రజల ఆదరణ, నమ్మకం కోల్పోవడంతో ఈ తరహా డ్రామాలకు తెరలేపిందన్నారు. 20 నెలల నుంచి ఒక గడ్డిపోచను కూడా కదిలించలేకపోయిందని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా చీదరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడామో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి పోయిందని జిల్లాకు ఒక్క సంస్థను కేటాయించడం గానీ, అభివృద్ధి పనులు చేపట్టడం గాని జరగలేదన్నారు. తమ ఐకమత్యాన్ని దెబ్బకొట్టాలని చేస్తున్న నీచరాజకీయాలు చౌకబారు సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు వరికూటి అమృతపాణి, బుర్రా మధుసూదనయాదవ్, వరికూటి అశోక్‌బాబు, కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు.