కలెక్టర్ల కంటే మస్కూర్లే నయం!
సాక్షి, వరంగల్ రూరల్: ‘కలెక్టర్ల కంటే మస్కూర్లే నయం.. వారే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు’అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, కలెక్టర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బుధవారం నర్సంపేటలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అయితే.. కలెక్టర్ తనకు సమాచారం ఇవ్వకపోవడం, పైగా నియోజకవర్గ అభివృద్ధి విషయమై చర్చించకపోవడంపై ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజంగా చెప్పాలంటే కలెక్టర్ల కంటే మస్కూర్లే వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఆయన విలేకరుల సమావేశంలో ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ రెవెన్యూ అధికారులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్ విషయంలోనే మర్యాదలేకపోతే కిందిస్థాయి అధికారుల పరిస్థితి ఏమిటని టీన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ షఫీఅహ్మద్ శాయంపేటలో అన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు నిధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ, రైతు సమన్వయ సమితుల నేతలు నర్సంపేటలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీ నేతలు సైతం ఎమ్మెల్యే మాటలపై ధ్వజమెత్తారు.