నగర రోడ్లకు మరో రూ.37 కోట్లు
ఉత్తర్వు జారీ చేసిన సర్కారు
జనవరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ సిటీ : తెలంగాణలోనే కరీంనగర్‌ను సుందరనగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారుల అభివృద్ధికి అదనంగా మరో రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గురువారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ.46 కోట్లు మంజూరు చేయగా, పనులు పనులు జరుగుతున్నాయని చెప్పారు. రహదారుల నిర్మాణానికి మరో రూ.37 కోట్లు అవసరమని ఇటీవల ప్రతిపాదనలు పంపగా, నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.353, తేదీ 27–07–2016 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మార్ట్సిటీపై అవగాహనకు ఇటీవల తాము ఇండోర్‌ను సందర్శించామని, భవిష్యత్‌లో ఇతర ప్రాంతాల వారు కరీంనగర్‌ను సందర్శించేలా నగరాన్ని తీర్చిదిద్దుతామని వివరించారు. భవిష్యత్‌లో రోడ్ల తవ్వకం ఉండరాదనే ఉద్దేశంతోనే డక్ట్‌ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్ అండ్‌బీ ఎస్ఈ సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం 6.13 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డివైడర్లకు రెడ్గ్రానైట్ వాడుతున్నామని, ఇది స్పష్టంగా కనిపించేట్లు ఉంటుందన్నారు. మున్సిపల్, ట్రాన్స్‌కో శాఖల సమన్వయంతో పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. దీనిపై శుక్రవారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. మొత్తం రోడ్లు వచ్చే జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, ఎండీ.ఆరీఫ్, ఏవీ.రమణ, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, పెద్దపల్లి రవీందర్, పిట్టల శ్రీనివాస్, చెన్నాడి అజిత్‌రావు పాల్గొన్నారు.